Hyd: మంత్రి వర్యా..ఏమిటీ చర్య.. పిచ్చుకలపై బహ్మస్త్రమా?

by srinivas |   ( Updated:2023-05-16 03:37:46.0  )
Hyd: మంత్రి వర్యా..ఏమిటీ చర్య.. పిచ్చుకలపై బహ్మస్త్రమా?
X
  • పర్మినెంట్ ఉద్యోగులకు బయోమెట్రిక్ ఎక్కడ
  • లక్షల్లో జీతాలున్న ఉద్యోగులకు సమయపాలన వద్దా?
  • చిరుద్యోగులకే ఆంక్షలు పరిమితమా?
  • ఉద్యోగులందరికీ వర్తింపజేయాలని డిమాండ్

దిశ, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలో ఉద్యోగులు, కార్మికులకు సంబంధించి వేర్వేరు చట్టాలు అమలవుతున్నాయంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని రకాల ప్రయోజనాలున్నా పర్మినెంట్ ఉద్యోగులకు వర్తించని బయోమెట్రిక్ విధానం ఎలాంటి జాబ్ సెక్యూరిటీ లేని, చాలీచాలని జీతాలున్న తమకు అమలు చేయటంపై ఔట్‌సోర్స్ ఉద్యోగులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. నెలకు లక్షల్లో జీతాలు, రోజువారీ, నెలసరి మామూళ్లతో చేయాల్సిన పనిని కూడా పక్కనబెట్టి, అవసరమైతే ఆ పని కూడా ఔట్‌సోర్స్ ఉద్యోగులతో చేయించే పర్మినెంట్ ఉద్యోగులకెందుకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయరంటూ పలు యూనియన్లు ప్రశ్నిస్తున్నాయి.

జీహెచ్ఎంసీలో ప్రస్తుతం పర్మినెంట్, ఔట్‌సోర్స్, కాంట్రాక్టు ప్రాతిపదికన సుమారు 28 వేల పైచిలుకు ఉద్యోగులుండగా, వీరిలో సుమారు 18 వేల 352 మంది శానిటేషన్ సంబంధించిన వర్కర్లున్నారు. మిగిలిన పదివేల మందిలో దాదాపు మూడున్నర వేల మంది పర్మినెంట్ ఉద్యోగులుండగా, మిగిలిన ఆరున్నర వేల మందిలో వెటర్నరీ, ఎంటమాలజీ తదితర విభాగాలకు చెందిన ఔట్‌సోర్స్ కార్మికులున్నారు. మొత్తంలో ఉద్యోగుల్లో దాదాపు సుమారు 24 వేల మంది ఔట్‌సోర్స్ ఉద్యోగులకు విధి నిర్వహణలో పారదర్శకత, సమయపాలన పాటించేలా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నారు. చాలీచాలని జీతాలు, అపరిమితమైన పని గంటలున్నాయి.

పైగా వీరందరికి నెల మొత్తం పని చేసినట్లు విభాగాధిపతి జారీ చేసే సర్టిఫికెట్ సమర్పిస్తేనే జీతాలు చెల్లిస్తున్నారు. సుమారు మూడున్నర వేల మంది పర్మినెంట్ ఉద్యోగులకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయకపోవటంతో వారంతా తమకిష్టమొచ్చినపుడల్లా విధులకు హాజరవుతున్నట్లు ఆరోపణలున్నాయి. వారి పైఅధికారులు ప్రశ్నిస్తే యూనియన్లకు ఫిర్యాదులు చేసి, వారిచే అధికారులను బెదిరిస్తున్నట్లు కూడా ఆరోపణలున్నాయి. ఉద్యోగుల్లో లక్షల్లో జీతాలు తీసుకుంటున్న వారికి సమయపాలన, విధి నిర్వహణలో పారదర్శకతకు సంబంధించి ఎలాంటి నిబంధనల్లేవు. కానీ రూ.10 వేల నుంచి రూ.25 వేలలోపు జీతాలు తీసుకుంటున్న చిరుద్యోగులపై నిబంధనలను అమలు చేయటం కేవలం అధికారులు తమ ఉనికిని చాటుకునేందుకేనన్న విమర్శలున్నాయి.

పర్మినెంట్ ఉద్యోగులు సగంమందే విధులకు..

ప్రస్తుతం మూడున్నర వేలకు పడిపోయిన పర్మినెంట్ ఉద్యోగుల్లో కనీసం సగంమందైనా విధులకు హాజరుకావటం లేదని తెలిసింది. వీరిలో దాదాపు వెయ్యి నుంచి 1500 మంది పర్మినెంట్ ఉద్యోగులు వివిధ ఉద్యోగ, కార్మిక సంఘాలను ఏర్పాటు చేసి, వారికి సేవ చేస్తున్నామని చెప్పుకుంటూ వారి పనులు వారు చేసుకుపోతున్నారు.

ఇక మిగిలిన మరో సగం మందిలో చాలా మంది నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు తమ పై అధికారులకు, సూపర్ వైజర్లకు లంచాలిచ్చి అటెండెన్స్‌లు వేయించుకుని జీతాలు పైసా తగ్గకుండా డ్రా చేసుకుంటున్నట్లు సమాచారం. విధి నిర్వహణలో వారికి సమయపాలన, పారదర్శకత లేకపోవటం వల్లే అడ్డదారిలో జీతాలు అందుతూ, అవినీతి పెరిగిపోతుందని కొందరు అధికారులే బహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు.

తాము ప్రశ్నిస్తే యూనియన్లతో ఒత్తిళ్లు వస్తున్నాయంటూ వాపోతున్నారు. జీహెచ్ఎంసీలో ఇప్పటికే సుమారు 24 వేల పైచిలుకు ఔట్‌సోర్స్ కార్మికులకు అమలు చేస్తున్న బయోమెట్రిక్ విధానాన్ని మూడున్నర వేల మంది పర్మినెంట్ ఉద్యోగులకు అధికారులెందుకు అమలు చేయటం లేదు? దీని వెనకా రాజకీయం ఏమిటీ? అంటూ పలువురు ఔట్‌సోర్స్ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. వారికి కూడా బయోమెట్రిక్ విధానాన్ని వర్తింపజేస్తే వారి పనితీరులో పారదర్శకత, జవాబుదారితనం పెరుగుతుందన్న వాదనలున్నాయి.

Advertisement

Next Story