ఆశావర్కర్ల డీఎంఈ ముట్టడి ఉద్రిక్తం

by Sridhar Babu |
ఆశావర్కర్ల డీఎంఈ ముట్టడి ఉద్రిక్తం
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : వేతనాల పెంపు కోసం ఆశావర్కర్లు మంగళవారం చేపట్టిన డీఎంఈ ముట్టడి స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. వేతనాలు పెంచాలని వారు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో వారు డీఎంఈ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. ముందుగానే సమాచారం అందుకున్న సుల్తాన్ బజార్ పోలీసులు కార్యాలయం లోనికి వెళ్లే గేట్లను మూసి వేసి వారిని అక్కడే అడ్డుకున్నారు. దీంతో వారు ప్ల కార్డులు చేతబట్టుకుని అక్కడే బైఠాయించారు. దీంతో పోలీసులు వారిని అక్కడి నుండి పంపించే క్రమంలో తోపులాట చోటు చేసుకుని స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. ఆవరణలోని డీఎంఈ, డీహెచ్ , టీవీవీపీ , ఎయిడ్స్ కంట్రోల్ ,

టీఎస్ ఎంఎస్ ఐడీసీ తదితర కార్యాలయాలలో పని చేసే సిబ్బందిని కూడా లోనికి అనుమతించకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు . కొంతమంది గేట్లు దూకి లోనికి వెళ్లారు. ఇదిలా ఉండగా ఆందోళనకు దిగిన ఆశా వర్కర్లకు బీజేపీ మహిళా మోర్చా సంఘీభావం ప్రకటించింది. మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి అక్కడికి రాగా పోలీసులు ఆమెను కూడా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా శిల్పారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆశా వర్కర్లకు రూ . 9వేల నుండి రూ .18 వేలకు జీతాలను పెంచాలని డిమాండ్ చేశారు.

కరోనా సమయంలో ప్రాణాలను ఫణంగా పెట్టి సేవలు అందించిన ఆశా వర్కర్లపై చిన్నచూపు తగదన్నారు. ఆశా వర్కర్లకు ఈఎస్ఐ , పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, వారికి జాబ్ షీట్ వేసి , చేసిన పనికి వేతనాలు చెల్లించాలని, రూ. 50 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ కు సంబంధించిన జీవో ను జారీ చేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల మాట దేవుడెరుగు కొత్త మద్యం బ్రాండులు తీసుకొచ్చి యువతను చెడగొడుతోందని , రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్ల డిమాండ్ లను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed