వందల కోట్ల భూములు వారి ఆధీనంలోకి.. రెవెన్యూ ఆఫీసులో రికార్డులు మాయం

by Sathputhe Rajesh |
వందల కోట్ల భూములు వారి ఆధీనంలోకి.. రెవెన్యూ ఆఫీసులో రికార్డులు మాయం
X

దిశ బ్యూరో, సంగారెడ్డి/ పటాన్ చెరు : అమీన్‌పూర్ రెవెన్యూ కార్యాలయంలో రికార్డులు మాయం అయ్యాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వివాదస్పద భూములకు కూడా రెవెన్యూ అధికారులు రిజిస్ట్రే‌ష్లన్లు జరిగిలే చూశారు. భూ కేటాయింపులు, అక్రమ క్రమబద్దీకరణ, ప్రభుత్వ భూముల అన్యాక్రాంతానికి అమీన్‌పూర్ కేంద్రం అయ్యింది. అప్పటి ప్రజా ప్రతినిధులు ఒకే చెప్పడంతో అధికారులు సరే అన్నారు. ఇంకేముందు కోట్ల విలువైన భూములను ప్రజాప్రతినిధులు, అక్రమార్కులు సొంతం చేసుకున్నారు.

ఈ అక్రమాలపై బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎవరు ప్రశ్నించినా అధికారులు లెక్క చేయలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చింది. ఇప్పుడు అమీన్‌పూర్ అక్రమ భూబాగోతాల లెక్కలను వెలికితీస్తున్నారు. దీనితో అక్రమాలకు సంబందించిన అన్నీ ఫైళ్లను రెవెన్యూ సిబ్బంది మాయం చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత తహసిల్దార్లు మారినప్పటికీ రెవెన్యూ ఆఫీసులో కింది స్థాయి సిబ్బంది పాతవాళ్లే ఉండడంతో ఇంకా అక్రమాల రాజ్యం యధేచ్చగా కొనసాగుతున్నదని అమీన్‌పూర్ రెవెన్యూ యంత్రాంగం వ్యవహారం ద్వారా స్పష్టం అవుతున్నది.

అక్రమార్కులకు అండగా...

అమీన్ పూర్ రెవెన్యూ కార్యాలయం అంటేనే ఆది నుంచి వివాదాలకు కేంద్రంగా చెప్పుకోవచచు. గతంలో పటాన్ చెరు మండలంలో ఉన్న అమీన్ పూర్ తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత నూతన మండలంగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మండల రికార్డులు, దస్త్రాల బదిలీలోను అధికారులు చేతి వాటం చూపి కొన్ని మాయం చెయ్యడంతో పాటు భూ రికార్డులను సైతం తారుమారు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంలో సర్వే రిపోర్టులను మార్చడంతో పాటు విచారణను ప్రభావితం చేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ప్రభుత్వ సర్వే నంబర్లు 993,343, 1000,1056 తదితర భూములు పెద్ద ఎత్తున అన్యాక్రాంతానికి గురయ్యాయి. ప్రభుత్వ సర్వే లో సైతం ఈ కబ్జాల తతంగం వెలుగులోకి వచ్చింది. తమ హయాంలో జరిగిన సర్వే రిపోర్టులను అప్పటి అధికారులు మాయం చేశారన్న విమర్శలున్నాయి.

అక్రమ కేటాయింపులు..

అమీన్ పూర్‌ను బంగారు బాతుగా భావిస్తూ గతంలో పైరవీలతో పదువులు పొందినా తహశీల్ధార్లు అక్రమాలను సైతం సక్రమంగా చేసి కబ్జాదారులకు, అక్రమార్కులకు పెద్ద ఎత్తున సహకరించారు. గతంలో వివాదస్పద భూములుగా ఉన్న కొన్ని ప్రభుత్వ భూములను పట్టా భూములుగా మారడంతో రెవెన్యూ అధికారులు కీలకంగా వ్యవహరించారు. వ్యతిరేకంగా ఉన్న వారిని బెదిరించడంతో పాటు తమకు అనుకూలంగా ఉన్న కొందరికి అక్రమ కేటాయింపులు చేశారనే ఆరోపనలున్నాయి. సర్వే నంబర్ 462లో జరిగిన అక్రమ కేటాయింపుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సర్వే నంబర్ 343లో సాహితీ ఇన్ ఫ్రా ఘటనను నిదర్శనంగా నిలుస్తున్నాయి. అదే విధంగా జీవో 59 సాకుతో విలువైన ప్రభుత్వ భూముల్ని కూడా ప్రజా ప్రతినిధుల ఆదేశాలతో రెవెన్యూ అధికారులు అక్రమార్కులకు కట్టబెట్టినట్లు స్థానికులు చెబుతున్నారు.

కీలక ఫైళ్లు మాయం...

అమీన్‌పూర్ రెవిన్యూ పరిధిలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూమి ఉంది. ఇక్కడ భూముల ధరలు కోట్లలో పలుకుతున్నది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయినట్లు చెప్పకోవచ్చు. 2004 సమయంలో మాజీ సైనికుల భూ కేటాయింపులకు సంబంధించిన కీలక సమాచారం మిస్ అయినట్లు తెలుస్తుంది. ఈ కేటాయింపులు చెల్లవని తర్వాత ప్రభుత్వం స్పష్టం చేసినా కొన్ని కేటాయింపులలో యధావిధిగా కార్యకలాపాలు జరగడం గమనార్హం. ఏ భూముల కేటాయింపులు రద్దయ్యాయన్న సమాచారం ప్రస్తుతం సీట్లపై కూర్చున్న కొత్త అధికారులకు లభిస్తుండకపోవడం గమనార్హం. పథకం ప్రకారం రెవెన్యూ శాఖలో అధికారులు రికార్డుల మాయం చేశారని స్పష్టం అవుతున్నది. ఈ కోవలోనే సాహితీ ఇన్ఫ్రాకు సరైన భూమి లేక పోయినా వందల కోట్లు వసూలు చేయడం అమీన్ పూర్ రెవిన్యూ లోపాలకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ భూమి కబ్జా...

అమీన్‌పూర్‌లోని సర్వే నెంబర్ 343/1లో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌కు 70 ఎకరాల భూమిని కేటాయించారు. ఆ భూమి కూడా కబ్జాకు గురికావడంతో ఇక్కడి రెవెన్యూ యంత్రాంగం నిర్యక్ష్యానికి, స్థానిక ప్రజా ప్రతినిధుల అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తున్నది. ఈ భూములను సర్వే చేసి కబ్జా నిజమని తేల్చి కొంత భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నా...పక్కనే ఇదే భూమిలో గృహ సముదాయాలు వెలిశాయి. సాక్షాత్తు పోలిస్ శాఖకు సంబంధించిన స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌కు సంబంధించిన భూ కేటాయింపుకు సంబంధించిన పత్రాలతో పాటు సర్వే రిపోర్ట్ సైతం కార్యాలయంలో అందుబాటులో లేనట్లు అధికారులు చెబుతున్నారు.

ఈ కబ్జా తతంగంలో బాగస్వామ్యుడైన నాయకుడి కనుసన్నల్లోనే ఈ రికార్డ్ మాయమైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే సర్వే నంబర్‌లో సుమారు 5 ఎకరాల భూమి ఆక్రమించినట్లు లెక్కలు చెబుతున్నాయి. సర్వే రిపోర్ట్ బయటకు వస్తే కబ్జా తతంగం బయటపడుతుందనే రిపోర్ట్‌ను మాయం చేశారని రెవెన్యూ శాఖలో ఓ అధికారి చెప్పుకొచ్చాడు. సర్వే నంబర్ 993తో పాటు 1000, 1056 ల సర్వే రిపోర్టులు కూడా మాయం చేసినట్లు రెవెన్యూ శాఖలో ప్రచారం జరుగుతున్నది. అధికారులు తమ పదవి కాలంలో పూర్తి సహకారం అందించడంతోనే అమీన్ పూర్ లో వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం, కబ్జాలకు గురైందని స్పష్టం అవుతున్నది. ఈ అక్రమాల బాగోతంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మేరకు స్పందించనున్నదో చూడాల్సి ఉన్నది.


Next Story

Most Viewed