కేజ్రీవాల్‌కు కవిత నుంచి భారీ ఫండ్స్.. సుఖేశ్ చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-24 06:33:31.0  )
కేజ్రీవాల్‌కు కవిత నుంచి భారీ ఫండ్స్.. సుఖేశ్ చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఢిల్లీలోని మండోలి జైల్లో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ బుధవారం సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసంలోని ఫర్నీచర్‌కు ఎమ్మెల్సీ కవిత ‘షెల్’ అకౌంట్ల నుంచి డబ్బులు వెళ్లాయని, దీనికి సంబంధించిన ఆధారాలను త్వరలోనే బైటపెడతానని జైలు నుంచి రాసిన లేఖలో పేర్కొన్నారు.

మొత్తం మూడు విడతల్లో ఆమె ‘షెల్’ ఖాతా నుంచి రూ. 80 కోట్లు మారిషస్‌లోని ‘గ్రీన్ హస్క్ ఇండస్ట్రీస్’ అనే కంపెనీకి బదిలీ అయ్యాయని పేర్కొన్నారు. ఈ కంపెనీ ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి కైలాష్ గెహ్లాట్ బంధువులకు చెందిందని వివరించారు. కేజ్రీవాల్ ఆదేశాల మేరకే కవిత ‘షెల్’ అకౌంట్ నుంచి ఈ లావాదేవీలు జరిగినట్లు తెలిపారు. కేజ్రీవాల్ ఆదేశాలకు సంబంధించిన ఐ-ఫోన్ ఫేస్ టైమ్ ఛాటింగ్ స్క్రీన్ షాట్లన్నింటినీ త్వరలోనే వెల్లడిస్తానని పేర్కొన్నారు.

కవిత ‘షెల్’ అకౌంట్ నుంచి ‘గ్రీన్ హస్క్ ఇండస్ట్రీస్’ కంపెనీకి ఫండ్స్ బదిలీ అయిన తర్వాత అవి యూఎస్‌బీటీ, క్రిప్టో కరెన్సీ రూపంలో కన్వర్ట్ అయ్యాయని, అక్కడి నుంచి అవి అబుదాబికి వెళ్ళాయని, ఇవన్నీ కేజ్రీవాల్ ఆదేశాల మేరకే జరిగినట్లు సుఖేశ్ చంద్రశేఖర్ ఆ లేఖలో వివరించారు.

కవిత ‘షెల్’ అకౌంట్ నుంచి ఫస్ట్ టైమ్ రూ. 25 కోట్లు, ఆ తర్వాత మరో రూ. 25 కోట్లు, థర్డ్ టైమ్ రూ. 30 కోట్ల చొప్పున ట్రాన్సఫర్ అయినట్లు తెలిపారు. కేజ్రీవాల్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ వ్యవహారంలో తాను చొరవ తీసుకుని ఆపరేషన్‌ను కంప్లీట్ చేసినట్లు తెలిపారు. కేజ్రీవాల్ ఇంట్లో ప్రస్తుతం వాడుతున్న ఫర్నీచర్ వివరాలు, వాటిని ఏ కంపెనీ నుంచి ఎప్పుడు, ఎంత రేటుకు కొనుగోలు చేసిందీ సుఖేశ్ గత నెలలోనే వివరాలను వెల్లడించారు. వాటికి సంబంధించిన బిల్లులను త్వరలో బహిర్గతం చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఈ వివరాలు ఇప్పుడు బైటకొచ్చిందెందుకు?

ఢిల్లీలోని మండోలి జైల్ (నెం. 11)లో ఉంటున్న సుఖేశ్‌ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా గతంలో సీబీఐ, ఈడీ దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేశారు. వాటిని వాపస్ తీసుకోవాల్సిందిగా తనపైన ఒత్తిడి వస్తున్నట్లు తాజా లేఖలో సుఖేశ్ ప్రస్తావించారు. జైల్లోని ఫోన్ నుంచి తాను చేసిన ఫోన్లను టాంపరింగ్ చేసినట్లు వస్తున్న వార్తలను ఖండించారు.

ఉద్దేశపూర్వకంగానే తనను తీహార్ జైలు నుంచి మండోలికి మార్చారని, అక్కడి సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఓం ప్రకాశ్, దీపక్ కుమార్, మరికొంతమంది సిబ్బంది కేజ్రీవాల్‌కు నమ్మినబంట్లు అని, అందువల్లనే తనపైన అసత్య ప్రచారం చేస్తూ బద్నాం చేస్తున్నారని ఆరోపించారు. కేజ్రీవాల్ ఆదేశాల మేరకు అధికారులు తనను మానసికంగా వేధిస్తున్నారని, జాతీయ మానవ హక్కుల సంఘానికి ఇప్పటికే ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. త్వరలో కేజ్రీవాల్ కుంభకోణాలను వరుసగా వెలుగులోకి తెస్తానని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed