అప్పుడు అన్నీ తానే చేసి, ఇప్పుడు విమర్శిస్తే ఎలా..? కేసీఆర్ పై అద్దంకి హాట్ కామెంట్స్

by Ramesh Goud |
అప్పుడు అన్నీ తానే చేసి, ఇప్పుడు విమర్శిస్తే ఎలా..? కేసీఆర్ పై అద్దంకి హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో అన్ని రకాల వైఫల్యాలకు కారణం కేసీఆర్ (KCR) అని, రాష్ట్రాన్ని అన్ని విధాల నాశనం చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ (TPCC General Secretary Addanki Dayakar) అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ప్రతిపక్ష నేత (Opposition Leader)పై హాట్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక కేసీఆర్ ముఖ్యమంత్రి కాకుండా ఉంటే రాష్టం పరిస్థితి ఈ స్థితిలో ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోనే విఫలం చెందిందని కేసీఆర్ మాట్లాడుతున్నారని, అన్ని వైఫల్యాలకు అసలు కారణం కేసీఆరేనని ఆరోపించారు.

ఇవ్వని హామీలు కూడా నెరవేర్చామని ఆయన మాట్లాడుతున్నారని, కానీ దళితుడిని సీఎం చేస్తానన్న హామీ నుంచి ఉద్యోగాల వరకు ఇచ్చిన అన్నింటిని గాలికొదిలేశారని మండిపడ్డారు. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం చట్టం తేవాలనే ఆలోచన మీకు పదేళ్లలో రాలేదని, తాము వచ్చిన సంవత్సరంలోనే చేశామని తెలిపారు. అలాగే ఎస్సీ వర్గీకరణపై నాన్చుడు ధోరణి ప్రదర్శించి, మందకృష్ణ మాదిగను జైళ్లో పెట్టారని, కానీ కాంగ్రెస్ వచ్చిన ఏడాదిలోనే చేసిందని అన్నారు. అంతేగాక ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారెంటీలు కంప్లీట్ అయ్యే దశలో ఉన్నాయని, అవి మీకు కనిపించడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కేసీఆర్ అసెంబ్లీ రావట్లేదని ఆరోపణలు నేపథ్యంలోనే రెండు రోజులు వచ్చిపోయే ప్రయత్నం చేస్తు్న్నారని, కానీ ప్రతిపక్ష నాయకులుగా కేసీఆర్ సంపూర్ణంగా ఫెయిల్ అయ్యారని సంచలన విమర్శలు చేశారు.

ప్రజలు మిమ్మల్ని పట్టించుకోవడం లేదని మీ సోషల్ మీడియాతో రేవంత్ రెడ్డిని బూతులు తిట్టించి, ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని ప్రచారం చేసుకోవాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇప్పుడు మీరు దిద్దుబాటు చర్యలకు దిగినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్/టీఆర్ఎస్ (BRS/TRS) బతికి ఉంటుందనేది భ్రమేనని, మీ పార్టీ పేరులో నుంచి తెలంగాణను తొలగించి, ఏ ముఖం పెట్టుకొని తెలంగాణ అస్థిత్వం గురించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఇచ్చింది.. కాంగ్రెస్ పార్టీ డెవలెప్ చేస్తుందని స్పష్టం చేశారు. అధికారంలో పక్షంలో ఉన్నప్పుడు అన్నీ తానై అన్నట్టుగా వ్యవహరించి, తెలంగాణకు అన్యాయం కూడా మీరే చేసి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంట్లో కూర్చుంటే ఎలా అని ప్రశ్నించారు. అలాగే రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాలనను చూసి జెలస్ ఫీల్ కాకుండా సభకు రావాలని, రాకపోతే ప్రజలు మిమ్మల్ని పట్టించుకోరని అద్దంకి వ్యాఖ్యానించారు.

Next Story

Most Viewed