వసూళ్లు ఫుల్.. వసతులు నిల్

by sudharani |
వసూళ్లు ఫుల్.. వసతులు నిల్
X

దిశ, శేరిలింగంపల్లి: హైదరాబాద్ మహానగరంలో హాస్టళ్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఇందులో కొన్ని విద్యార్థుల కోసం కాగా మిగతావి రోజు వారి అద్దె ఇస్తున్నవి ఉన్నాయి. పనిమీద హైదరాబాద్‌కు వచ్చిన వారికి ఇవి ఆశ్రయం కల్పిస్తున్నాయి. వీటి ఏర్పాటులో కనీస ప్రమాణాలు కూడా ఉండడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. హాస్టళ్ల నిర్వహణపై గతంలో హైకోర్టు ధర్మాసనం పలు సూచనలు చేసింది. నిర్వాహకులు ప్రమాణాలు పాటించేలా చూడాలని, అక్కడ ఉంటున్న వారి కోసం తీసుకుంటున్న చర్యలపై కూడా నిఘా ఉంచాలని వ్యాఖ్యానించింది. గతంలో నర్సింహ్మా చారి అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం పైవిధంగా స్పందించింది.

అడ్డగోలుగా వెలుస్తున్న హాస్టళ్లు

శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మాదాపూర్, గచ్చిబౌలి, చందానగర్, హైదర్‌నగ‌ర్, మియాపూర్, వివేకానంద నగర్, కొండాపూర్ డివిజన్లలో కొన్ని వందల హాస్టళ్లు వెలిశాయి. వీటిలో గర్ల్స్, బాయ్స్ హాస్టళ్లు ఉన్నాయి. అలాగే పేయింగ్ గెస్ట్ పేరుతో మరి కొన్ని వెలిశాయి. పని కోసం నగరానికి వచ్చిన వారికి ఇవి ఉపయోగపడతాయి. వీటితో పాటు ఈ కాలంలో కో లివింగ్ పేరుతో మరో అడుగు ముందుకు వేశారు నిర్వాహకులు. వీటిలో చాలా వాటికి ఎలాంటి అనుమతులు లేవు.

సాధారణంగా ఒక హాస్టల్ నిర్వహించాలంటే జీహెచ్ఎంసీ, పోలీస్, ఫైర్ సేఫ్టీ తదితర శాఖల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. చాలా మంది హాస్టల్ నిర్వాహకులు ఎలాంటి అనుమతులు లేకుండానే ఏర్పాటు చేస్తున్నారు. అదీగాక అందుకు వాడుతున్న బిల్డింగ్ నాణ్యత విషయంలోనూ లోపాలను దాస్తున్నారు. హాస్టళ్లలో ఉంటున్న వారి భద్రతను కూడా పట్టించుకోవడం లేదు. కేవలం ధనార్జనే ధ్యేయంగా పెట్టుకున్న కొందరు నిర్వాహకులు నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. శాఖల మధ్య సమన్వయం కూడా వీరికి కలిసి వస్తుంది. దీంతో ఒక్కొక్కరూ రెండు, మూడు హాస్టళ్లను కూడా నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది.

వసతులు కరువు

హాస్టల్ విద్యార్థుల ఆహార విషయంలోనూ నిర్వాహకులు కనీస ప్రమాణాలు పాటించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రికి తిరిగి భోజనాలు పెడుతున్నా అవన్నీ నాణ్యత లోపించినవే.. అంటూ హాస్టల్‌లో ఉంటున్న వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం చప్పిడి తిండి, నీళ్ల చారు, ఉడికీ ఉడకని భోజనం వడ్డిస్తున్నారని కన్నీటి పర్యంతం అవుతున్నారు. అవి తినలేక, బయట హోటళ్ల నుంచి కొని తెచ్చుకునేందుకు డబ్బులు లేక కడుపు మార్చుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు. చాలా సార్లు మంచినీళ్లు తాగి పడుకున్న సందర్భాలూ ఉన్నాయని కుమిలిపోతున్నారు. ఇక వేసవిలో తాగునీటి సమస్య కూడా తీవ్రంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలాది రూపాయలు దండుకుంటున్నా కనీస అవసరాలు కూడా తీర్చడం లేదంటూ మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు హాస్టళ్ల నిర్వహణపై శ్రద్ధ పెట్టాలని పలువురు కోరుతున్నారు.



Next Story

Most Viewed