విధులకు రాడు.. రిలీవ్ కాడు.. ఆ అధికారి స్టైలే వేరు!

by Sathputhe Rajesh |
విధులకు రాడు.. రిలీవ్ కాడు.. ఆ అధికారి స్టైలే వేరు!
X

దిశ, వైరా: ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి తాను పనిచేసే ప్రాంతం నుంచి బదిలీ అయినా.. లేక డిప్యూటేషన్ రద్దు చేసుకున్నా.. ఏమి చేస్తారు. తాను బదిలీ లేదా డిప్యూటేషన్ రద్దు చేసుకున్నా కార్యాలయం నుంచి రిలీవ్ అవుతారు. లేదంటే రిలీవ్ అయ్యేవరకు అక్కడ పనిచేస్తారు. కానీ వైరా మున్సిపాలిటీ నుంచి డిప్యూటేషన్‌ను రద్దు చేసుకున్న టీపిఓ భాస్కర్ మాత్రం ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. గత నెల24న ఆయన డిప్యూటేషన్ రద్దు చేసుకున్నా నేటి వరకు ఇక్కడి నుంచి రిలీవ్ కాలేదు. గత రెండు వారాలుగా విధులకు గైర్హాజరవుతున్నారు. వారం రోజుల్లో శుక్ర, శనివారాలు మాత్రమే ఆయన ఇక్కడ విధులు నిర్వహించాల్సి ఉంది. ఫిబ్రవరి 24, 25 ఈనెల3 ,4 తేదీలలో విధులు నిర్వహించాల్సి ఉన్నా హాజరు కాలేదు. ఓ వైపు రిలీవ్ కాకుండా, మరోవైపు విధులకు హాజరు కాకుండా టీపీఓ వ్యవహారం నిబంధనలకు విరుద్ధంగా ఉంది.

టీపీఓ భాస్కర్ వ్యవహార శైలితో వైరాలో ఆరు నెలలుగా టౌన్ ప్లానింగ్ శాఖలోని సమస్యలు కనీసం పరిష్కారం కావడం లేదు. వైరాలోని గంధం టవర్స్ అనుకొని కారిడార్‌ను మూసివేసి అక్రమంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారని వైరా మున్సిపాలిటీ కమిషనర్ అనితకు ఇప్పటి వరకు ఆ టవర్స్‌లో నివసించే ప్రజలు లిఖిత పూర్వకంగా నాలుగుసార్లు ఫిర్యాదు చేశారు. ఈ సమస్య పరిష్కరించాలని కోరుతూ ఆ టవర్ వాసులు చెప్పులు అరిగిపోయేలా మున్సిపాలిటీ కార్యాలు చుట్టూ ప్రదక్షిణ చేశారు. ప్రతిసారి కమిషనర్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని టవర్ వాసులకు సమాధానం చెప్పడమే తప్ప సమస్యను పరిష్కరించిన పాపాన పోలేదు.

దీంతో విసిగి వేసారిన గంధం టవర్స్‌లో నివాసం ఉంటున్న వారు వారం రోజుల క్రితం ఈసమస్యపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వైరాలోని ఎస్‌బీఐ టౌన్ బ్రాంచ్‌‌పై గత ఆరు నెలల క్రితం ఎలాంటి అనుమతులు లేకుండా మూడో అంతస్తు నిర్మించారు. ఈ వ్యవహారంలో ఓ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి కీలకంగా వ్యవహరించారు. అక్రమంగా మూడో అంతస్తు నిర్మించిన యజమానిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. అదే విధంగా వైరాలోని న్యూ లిటిల్ ఫ్లవర్స్ పాఠశాల వెనుక సర్వే నెంబర్ 49లో కోర్టు వివాదంలో ఉన్న భూమిలో ప్లాట్లు చేసి విక్రయించారు. ఈ విషయమై దిశలో దిన పత్రికలో అనేక వార్తా కథనాలు ప్రచురితమయ్యాయి.

దీంతో నెల రోజుల 49వ సర్వే నెంబర్లు అని పొలంలో ప్లాట్లు సరిహద్దులు తెలిపే రాళ్లను స్వయంగా టీపిఓ దగ్గరుండి జేసీబీతో తొలగించారు. అయితే మున్సిపాలిటీ అధికారులకు సవాల్ చేస్తూ ఆ వెంచర్ వేసిన అక్రమార్కుడు మరుసటి రోజే ప్లాట్ల సరిహద్దులు తెలిపే రాళ్లను మరలా ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ అధికారుల చర్యను లెక్కచేయకుండా మరలా రాళ్లు ఏర్పాటు చేసిన ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో స్థానిక అధికారులు ఉన్నారు. అదేవిధంగా డీటీసీపీ అనుమతి లేకుండా వేసిన అనేక వెంచర్లపై కనీస చర్యలు కూడా తీసుకోలేదు. ఇలా వైరాలో టౌన్ ప్లానింగ్ సంబంధించి పదుల సంఖ్యలో సమస్యలు గత ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉండి ములుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టీపీఓ రెండు వారాలుగా ఇక్కడ విధులకు రాకుండా.. రిలీవ్ కాకుండా ఉండటం విమర్శలకు దారితీస్తున్నది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వైరా టౌన్ ప్లానింగ్‌లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed