Harish Rao: దసరాలోపు అందరికీ రుణమాఫీ చేయాలి.. ప్రభుత్వానికి హరీశ్‌రావు అల్టిమేటం

by Shiva |
Harish Rao: దసరాలోపు అందరికీ రుణమాఫీ చేయాలి.. ప్రభుత్వానికి హరీశ్‌రావు అల్టిమేటం
X

దిశ, వెబ్‌డెస్క్: దసరా పండుగలోపు అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు (Former Minister Harish Rao) ప్రభుత్వానికి డెడ్‌లైన్ (Deadline) విధించారు. ఇవాళ సిద్దిపేట జిల్లా (Siddipet District) నంగునూరులో రుణమాఫీ కోసం అన్నదాతలు చేపట్టిన దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన రైతులకు రుణమాఫీ జరిగేంత వరకు సీఎం రేవంత్‌రెడ్డిని నిద్రపోనివ్వబోమని కామెంట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఉండి కొట్లాడుతుందని అన్నారు. ఒకవేళ దసరాలోపు రుణమాఫీ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులతో కలిసి సచివాలయాన్ని ముట్టడిస్తామని హరీశ్‌రావు (Harish Rao) డెడ్‌లైన్ విధించారు.

కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 490 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని ప్రభుత్వం పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. రైతు రుణమాఫీ పేరుతో అన్నదాతలను దగా చేశారని మండిపడ్డారు. రైతు రుణమాఫీని ఎగ్గొట్టేందుకు రేవంత్ ప్రభుత్వం సాకులు చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఇప్పటి వరకు సుమారు 21 లక్షల మంది అన్నదాతలకు రుణాలు మాఫీ కాలేదని ఆరోపించారు. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతర రైతులకు కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదని హరీశ్‌రావు అన్నారు.

Advertisement

Next Story