- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేడర్‌ను కాపాడుకునేందుకు కేసీఆర్ కొత్త ఎత్తు.. అధినేత ఆర్డర్‌తో కదిలిన కేటీఆర్, హరీశ్
దిశ, తెలంగాణ బ్యూరో: గులాబీ పార్టీ బలోపేతానికి అధిష్టానం చర్యలు తీసుకుంటోంది. త్వరలో పాదయాత్రను చేపట్టబోతున్నారు. ఇప్పటికే యాత్రను ఎక్కడి నుంచి ప్రారంభించాలి?.. ఎక్కడ ముగించాలనేదానిపై ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్టు తెలిసింది. సౌత్, నార్త్‌లో పాదయాత్రకు పార్టీ అధినేత కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని పార్టీ వర్గాల సమాచారం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్‌రావు ఇరువురు యాత్రను కొనసాగిస్తేనే పార్టీకి మైలేజ్ వస్తుందని అధినేత భావించి ఇప్పటికే పార్టీ సీనియర్ నేతలతో చర్చించినట్టు తెలిసింది. కేటీఆర్, హరీశ్‌రావుతో ఇదే విషయంపై మాట్లాడినట్టు విశ్వసనీయ సమాచారం. కేడర్‌లో భరోసా నింపేందుకు, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో యాత్రకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. యాత్రతో పార్టీ సైతం బలోపేతం అవుతుందని, కేడర్ సైతం పార్టీ మారకుండా అడ్డుకట్ట వేయవచ్చని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం.
ఉమ్మడి పది జిల్లాల్లో యాత్ర కొనసాగేలా రూట్ మ్యాప్
గులాబీ శ్రేణులను యాక్టివ్ చేయాలని పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. రాబోయే ఎన్నికల నాటికి కేడర్‌ను క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేసేందుకు ఫాంహౌస్ వేదికగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు పార్టీ నేతలు పేర్కొంటున్నారు. సీనియర్ నేతలతోనూ సంప్రదింపులు చేస్తున్నారు. పార్టీ కేడర్ చేజారకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలి? గత ఎన్నికల్లో ఓటమితో వారిలోని నైరాశ్యాన్ని ఎలాపోగొట్టాలని విశ్లేషించిన కేసీఆర్.. పాదయాత్రతోనే కేడర్‌లో భరోసా నింపవచ్చనే భావనకు వచ్చినట్టు తెలిసింది. అందులో భాగంగానే యాత్రపై కేటీఆర్, హరీశ్‌రావుతో చర్చించినట్టు విశ్వసనీయ సమాచారం. ఇద్దరు యాత్ర చేస్తేనే పార్టీ కేడర్‌లో జోష్ నింపవచ్చని, వారిలో మనోధైర్యం కల్పించవచ్చని అందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఉమ్మడి పది జిల్లాల్లో యాత్ర కొనసాగే విధంగా రూట్ మ్యాప్‌ను సైతం తయారీలో నిమగ్నమైనట్టు తెలిసింది. హరీశ్‌రావుకు సౌత్, కేటీఆర్‌కు నార్త్‌లో పాదయాత్ర కొనసాగించాలని సూచించినట్టు పార్టీ వర్గాల సమాచారం. ఇద్దరు పార్టీకి కీలకం కావడంతో ఒకరు చేపట్టి మరొకరు చేయకపోతే కేడర్‌లో తప్పుడు సమాచారం వెళ్లే అవకాశం ఉన్న తరుణంలో ఇరువురికి బాధ్యతలు అప్పగిస్తున్నారని తెలిసింది. ఈ యాత్రతో తెలంగాణ ఉద్యమం నాడు పార్టీకి ప్రజల నుంచి వచ్చిన ఆదరణ మళ్లీ వచ్చేలా చేయాలని అందుకు తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
సౌత్‌లో ట్రబుల్ షూటర్..
రాజకీయాల్లో ట్రబుల్ షూటర్‌గా పేరుగాంచిన తన్నీరు హరీశ్‌రావుకు దక్షిణ తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాలపై పట్టుంది. కాంగ్రెస్ పార్టీకి దక్షిణ తెలంగాణ బలంగా ఉన్నప్పటికీ హరీశ్‌రావుకు చక్రం తిప్పే సత్తా ఉంది. ఆయన ఎన్నికల ప్రచారం చేస్తే విజయం తథ్యం అని, బీఆర్ఎస్‌కు మెజార్టీ సీట్లు ఖాయమనే భావన పార్టీ అధిష్టానంలో సైతం ఉంది. మాస్ లీడర్‌గా పేరుండటం, ప్రజల్లో సైతం ఆయనకు ఆదరణ ఉండటంతో సాత్ తెలంగాణ బాధ్యతలను కేసీఆర్.. హరీశ్‌రావుకు అప్పగించినట్టు సమాచారం. ఆ మధ్య అకాల వర్షాలకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆస్తినష్టం జరిగితే బాధితుల పరామర్శకు సైతం హరీశ్ వెళ్లారు. వారికి ఆపన్నహస్తం అందించేందుకు నిత్యావసరాలను సైతం సొంత ఖర్చులతో పంపించారు. దక్షిణ తెలంగాణపై ఆయనకు సంపూర్ణ అవగాహన ఉండటం, నేతలందరినీ ఏకతాటిపైకి తెచ్చే చతురత ఉండటంతో యాత్ర చేయాలని పార్టీ అధినేత కేసీఆర్ హరీశ్‌కు సూచించినట్టు సమాచారం. దీనికి హరీశ్‌రావు సైతం ఓకే చెప్పారని, ఈ యాత్రలో నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలను కూడా అధ్యయనం చేయనున్నట్టు తెలిసింది. వాటిని ఎన్నికల్లో అస్త్రంగా మల్చుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం.
నార్త్‌లో కేటీఆర్ యాత్ర
గులాబీ పార్టీని నడిపించడంలో కేటీఆర్ కీలకంగా ఉన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తూ ఎప్పటికప్పుడు ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పనులను ప్రస్తుత కాంగ్రెస్ చేపడుతున్న విధానాలను పోల్చుతూ ప్రజలకు వివరిస్తూ చైతన్యం చేస్తున్నారు. కేటీఆర్‌కు నార్త్‌పై పట్టుండటంతో పార్టీ అధినేత యాత్ర బాధ్యతలను అప్పగించినట్టు విశ్వసనీయ సమాచారం. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌లో పార్టీకి మంచి ఆదరణ ఉంది. పటిష్టమైన కేడర్ ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో తక్కువ సీట్లు రావడంతో ఈ జిల్లాలపైనా ప్రత్యేక దృష్టి సారించారు. యాత్రతో కేడర్‌లో జోష్ నింపాలని, పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని భావిస్తున్నారు. యాత్రపై ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చినట్టు సమాచారం. అందువల్లనే ఈ నెల 31న ఎక్స్ వేదికగా నిర్వహించిన ఆస్క్ కేటీఆర్‌లో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు త్వరలోనే పాదయాత్ర కొనసాగిస్తానని క్లారిటీ ఇచ్చారు. ఇది పార్టీ కేడర్‌తో పాటు రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీసింది. కేడర్ సైతం యాత్రపై ఎదురుచూస్తున్నారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో పార్టీ బలంగా ఉండటంతో సభలు, సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నట్టు సమాచారం.
ఎప్పుడు, ఎక్కడి నుంచి యాత్ర ప్రారంభం?
అసెంబ్లీ, పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు వరుస ఓటములు ఎదురయ్యాయి. ఈ ఓటమిని పార్టీ అధిష్టానం, కేడర్ సైతం జీర్ణించుకోలేకపోతోంది. దీంతో కార్యకర్తలు, నేతల్లో తీవ్ర నైరాశ్యం నెలకొంది. 11 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ కావడంతో పాటు రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, ప్రజలు సమస్యలపై నిరసన బాట పట్టారు. దీంతో ఇదే అనువైన సమయం అని భావించి ఇప్పటికే వారి పక్షాన బీఆర్ఎస్ సైతం గళం వినిపిస్తుంది. వారితో కలిసి నిరసనలో భాగస్వాములవుతుంది. మరోవైపు కేడర్‌లో భరోసా నింపేందుకు సమాయత్తంలో భాగంగానే కేటీఆర్, హరీశ్‌రావులతో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. అయితే ఇద్దరి యాత్రలు ఎక్కడి నుంచి ప్రారంభించాలనే దానిపై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. హరీశ్‌రావు మహబూబ్‌నగర్ లేదా ఖమ్మం జిల్లా నుంచా అనేదానిపై స్థానిక నేతల నుంచి సైతం ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నట్టు సమాచారం. అదే విధంగా కేటీఆర్ యాత్రను ఆదిలాబాద్ లేదా మహబూబ్‌నగర్ నుంచి చేపడితే బాగుంటుందా అనే దానిపైనా ఆరా తీస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఎవరు ఎక్కడి నుంచి యాత్రను కొనసాగించాలి.. ఏయే జిల్లాల మీదుగా యాత్ర చేపట్టాలి..ఎక్కడ ముగించాలనేది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన సంక్షేమంపై యాత్రలో వివరణ
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలను యాత్రలో వివరించాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. రైతుభరోసా, రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, కేసీఆర్ కిట్, ఉచిత కరెంటు, రూ.2 వేల పింఛన్, మెడికల్ కాలేజీలు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఉద్యోగాల కల్పన, గురుకులాలు ఇలా ప్రతి సంక్షేమ పథకం, లబ్ధిదారుల వివరాలతో సహా వివరించనున్నారు. మరోవైపు నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలను నోట్ చేసుకొని వాటిపైనా స్థానిక నేతలు ప్రజల పక్షాన పోరాటానికి కార్యాచరణ చేపట్టనున్నట్టు సమాచారం. దీంతో కేడర్ చేజారకుండా పార్టీలోనే కొనసాగేలా చర్యలు తీసుకోవడం, కాంగ్రెస్ బెదిరింపులకు భయపడొద్దని అండగా ఉంటామనే భరోసా కల్పిస్తామని పార్టీ లీడర్లు పేర్కొంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను యాత్రలో ఎండగడతామని, ప్రజలకు తామున్నమనే హామీ ఇస్తామంటున్నారు. బీఆర్ఎస్ యాత్ర ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.