MLA పాడి కౌశిక్ రెడ్డిపై గవర్నర్ తమిళిసై సీరియస్

by Sathputhe Rajesh |   ( Updated:2024-01-25 05:43:26.0  )
MLA పాడి కౌశిక్ రెడ్డిపై గవర్నర్ తమిళిసై సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల ప్రచారం సందర్భంగా అభ్యర్థులు చేసే వ్యాఖ్యలపై గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్ జేఎన్టీయూలో జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఓటు వేయడం మనందరి బాధ్యత, హక్కు అన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి అండగా ఉండటం తన బాధ్యత అని తెలిపారు. పోలింగ్ రోజు ఇచ్చే సెలవును ఓటు హక్కు కోసం వాడుకోవాలన్నారు.

సాధారణ పౌరుడిని అసాధారణ శక్తిగా చేసేదే ఓటు హక్కు అని గుర్తు చేశారు. విదేశాలకు వెళ్లేందుకు వీసా కోసం లైన్‌లో ఉంటారు. అలాగే ఓటు కోసం కూడా లైన్‌లో ఉండాలని యువతకు సూచించారు. అభ్యర్థులను పూర్తిగా విశ్లేషించి ఓటు వేయాలన్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేరు ప్రస్తావించకుండానే ఆయనపై గవర్నర్ సీరియస్ అయ్యారు. ఓటు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని.. ఓ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. ఎన్నికలను ప్రభావితం చేసే అభ్యర్థుల వ్యాఖ్యలపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలన్నారు. ఓటర్లను ఎవరూ ఒత్తిడి చేయొద్దన్నారు. ఓటు అనేది ప్రధాన ఆయుధం అన్నారు. ప్రజాస్వామ్యం బతకాలి అంటే ఓటు వేయాలన్నారు. ‘ఓట్’ అనే పుస్తకాన్ని గవర్నర్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు.

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా హుజురాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న పాడి కౌశిక్ రెడ్డి కమలాపూర్ రోడ్డు షోలో మాట్లాడుతూ.. ‘ఓటు వేసి దీవిస్తే జైత్రయాత్ర.. గెలిపించకపోతే మా కుటుంబ సభ్యుల శవయాత్ర’ అని సంచలన వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story