- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టికెట్‌కు ఫుల్ డిమాండ్.. ప్రతీచోట పోటిపడుతున్న ముగ్గురు క్యాండిడేట్స్!
దిశ ప్రతినిధి, నిర్మల్ : అసెంబ్లీ ఎన్నికలు ముంచుకు వస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే టికెట్ కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ టికెట్ల కోసం పోటీ మొదలైంది. పార్టీ ఇటీవల కాలంలో బలంగా పుంజుకుంటున్న నేపథ్యంలో ఆ పార్టీ టికెట్ సాధిస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న అభిప్రాయంతో ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. ఎవరికి వారుగా తమకు ఉన్న రాష్ట్ర జాతీయస్థాయి అగ్రనేతల సహకారంతో టికెట్ వేటను మొదలుపెట్టారు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో బీజేపీ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
ఒకటి రెండు నియోజకవర్గాలు మినహా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీ క్రమంగా బలపడుతూ వస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో భారీ విజయం నమోదు చేసుకున్న కమలం పార్టీ ఆ తరువాత మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ధీటుగా జిల్లాలో బలపడింది. అధికార భారత్ రాష్ట్ర సమితి పార్టీని నిలువరించే స్థాయికి ఆ పార్టీ ఎదిగినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలు నియోజకవర్గాల్లో ముగ్గురు చొప్పున అభ్యర్థులు పోటీ పడుతుండడం చర్చనీయాంశంగా మారింది.
ప్రతీ చోటా ముగ్గురు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆయా నియోజకవర్గాలకు సంబంధించి బీజేపీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు అనేక నియోజకవర్గాల్లో ఇద్దరికి మించి పోటీపడుతుండడం ఆ పార్టీలో రసవత్తర రాజకీయాలకు తెర లేపుతోంది. ఈ పరిణామం మంచికా... చెడుకా తేల్చలేని పరిస్థితి ఉందని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. ముధోల్ నియోజకవర్గంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి రామారావు పటేల్ మోహన్ రావు పటేల్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఒకరిని మించి ఒకరు అన్నట్టు పార్టీ కార్యక్రమాలలో తలమునకలవుతున్నారు. నిర్మల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన మహేశ్వర్ రెడ్డికి టికెట్ ఖాయం అని ప్రచారం ఉంది.
అయితే ఆయనకు ముందు పార్టీలో చేరిన బీసీ నేత మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి కూడా టికెట్ కావాలని అధిష్టానంతో టచ్ లో ఉన్నట్లు చెబుతున్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలో మాజీ పార్లమెంటు సభ్యుడు రాథోడ్ రమేష్, పెంబి జెడ్పీటీసీ సభ్యురాలు బుక్యా జాను భాయి, హరి నాయక్ లు టికెట్ వేటలో ఉన్నారు. బోథ్ నియోజకవర్గంలో సర్వే శాఖలో సహాయ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన సాకటి దశరథ్ ఎంపీ సోయం బాపూరావు ఆయన తనయుడు సాయినాథ్ ప్రభుత్వ లెక్చరర్ జాదవ్ తదితరులు టికెట్ ఆశిస్తున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో మాజీ జడ్పీ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ లు టికెట్ వేటలో ఉన్నారు. ఎన్ఆర్ఐ శ్రీనివాస్ రెడ్డి మొన్నటిదాకా బరిలో ఉంటానంటూ తీవ్ర ప్రచారం చేసుకున్న చివరి క్షణంలో ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు.
తూర్పులో పోటీ తక్కువే..
ఇక తూర్పు జిల్లాలో బీజేపీ టికెట్ కోసం పోటీ పడుతున్న వారి సంఖ్య తక్కువగానే కనిపిస్తోంది. మంచిర్యాల నియోజకవర్గంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్, విద్యాసంస్థల అధినేత మల్లారెడ్డి ఒక ఎన్నారై పోటీ పడుతున్నట్లు సమాచారం. ఇక రిజర్వుడ్ నియోజకవర్గాలైన చెన్నూరు, బెల్లంపల్లి, సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో పోటీ అంతంతమాత్రంగానే ఉంది. చెన్నూరులో ఆందుగుల శ్రీనివాస్, బెల్లంపల్లిలో కొయ్యల హేమాజీ, సిర్పూర్ నియోజకవర్గంలో పాల్వాయి హరీష్ బాబు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇక ఆసిఫాబాద్ నియోజకవర్గంలో మాత్రం పరిస్థితి కొంత భిన్నంగా కనిపిస్తోంది. పార్టీని ప్రస్తుతం నడుపుతున్న తుకారాం టికెట్‌పై ఆశతో ఉండగా ఒక అధికారితో పాటు అధికార పార్టీకి చెందిన ఓ మహిళ నేతను పార్టీలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్లు సమాచారం.
అగ్రనేతలతో లాబీయింగ్ మొదలు
పార్టీ రాష్ట్ర నాయకత్వంలో కీలక నేతలతో టికెట్ కోసం ఆయా నియోజకవర్గాల నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ పార్టీ చేరికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్‌తో పాటు పలువురు పార్టీ సీనియర్లతో టికెట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే వారితో పాటు మరికొందరు కీలక నేతలను కలిసి తమ అభ్యర్థిత్వాలను ఖరారు చేయాలని పార్టీపై ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం.