జగన్‌తో దోస్తీ తెలంగాణకు నష్టం: ఎంపీ చామల కిరణ్

by Mahesh |
జగన్‌తో దోస్తీ తెలంగాణకు నష్టం: ఎంపీ చామల కిరణ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ హయంలోనే కృష్ణా, గోదావరి నదీ జలాలు ఏపీ తరలిపోయాయని భువనగిరి ఎంపీ చామల కిరణ్​కుమార్​రెడ్డి అన్నారు. జగన్​తో బీఆర్ఎస్​చేసిన దోస్తీ తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. అనాడు రోజా ఇంటికెళ్లి చేపల పులుసు తిని తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా, గోదావరి నీటిని ఏపీ తరలించుకుపోతుంటే.. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యల పట్ల ఎంపీ చామల కిరణ్ కుమార్​రెడ్డి కౌంటర్​ఇచ్చారు. నీచమైన రాజకీయాల గురించి కవిత మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. నీచమైన రాజకీయాలు ఎవరు చేస్తున్నారో?.. యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసునన్నారు. కేసీఆర్​ఫ్యామిలీ డైవర్షన్ పాలిటిక్స్ అందరికీ తెలిసిపోయిందని విమర్శించారు.

కవిత లిక్కర్ సామ్రాజ్య కేసులు రోజుకొకటి బయటకు వస్తున్నాయని, ఇప్పటివరకు ఢిల్లీలోనే బయటపడ్డ బాగోతం ఇప్పుడు కేరళలో కూడా వెలుగులోకి వస్తున్నాయన్నారు. కవిత లిక్కర్ దందాలు దేశవ్యాప్తంగా ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో? రోజు కూడా బయటపడుతూనే ఉన్నాయని చామల పేర్కొన్నారు. ఆ స్కామ్​ల డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా.. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. ‘‘అసలు నీళ్ల విషయంలో మీ అయ్య చేసినంత అన్యాయం తెలంగాణకు ఇంకెవరూ చేయలేదని, కృష్ణాలో.. పోతిరెడ్డిపాడు ఒక్క పెద్దది కావడానికి కారణమే మీ అయ్యా” అని కవితను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా 40 వేల క్యూసెక్కుల నుంచి 90 వేల క్యూసెక్కుల పెరిగింది బీఆర్ఎస్​ హయాంలోనే అని గుర్తుంచుకోవాలని సూచించారు.

అంతేకాదు రోజుకు రెండు టీఎంసీలు తీసుకెళ్లడం కోసం జగన్ రాయలసీమ ఎత్తిపోతల పథకం స్టార్ట్ చేస్తే నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించారని ఆరోపించారు. ‘‘రాయలసీమ ఎత్తిపోతల పథకం కోసం ఏకంగా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌నే వాయిదా వేసిన ఘనత మీ అయ్యది” అని ఎంపీ కిరణ్​కుమార్​రెడ్డి ఘాటుగా విమర్శించారు. ‘‘రోజా ఇంటికి వెళ్లి చేపల పులుసు తిని రాయలసీమను రతనాలసీమ చేస్తానని చెప్పింది నీ అయ్యా కాదా?.. ఇలా ఏ విధంగా చూసినా కృష్ణా నీటిలో దక్షిణ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది మీ అయ్యనే” అని ఆరోపించారు. ఇక గోదావరి విషయంలో ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని, గోదావరిపై కట్టిన కాళేశ్వరం మూడేళ్లకే మునిగి పోయిందన్నారు. లక్ష కోట్లు పెట్టి ఖర్చు చేసి గోదావరి నీటి పాలు చేశారన్నారు. నీళ్ల విషయంలో తీవ్ర అన్యాయం చేసింది కేసీఆర్​ యేమని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.


Next Story