TTDP: చంద్రబాబుతో నాగం జనార్ధన్ రెడ్డి భేటీ.. టీడీపీలోకి మాజీ మంత్రి రీఎంట్రీ ఖాయమేనా?

by Prasad Jukanti |   ( Updated:2025-03-13 10:14:54.0  )
TTDP: చంద్రబాబుతో నాగం జనార్ధన్ రెడ్డి భేటీ.. టీడీపీలోకి మాజీ మంత్రి  రీఎంట్రీ ఖాయమేనా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో (Chandrababu Naidu) బీఆర్ఎస్ (BRS) సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి (Nagam Janardhan Reddy) భేటీ అయ్యరు. ఇవాళ విజయవాడ వెళ్లిన నాగం జనార్ధన్ రెడ్డి ఏపీ అసెంబ్లీలో సీఎం చాంబర్ లో చంద్రబాబు నాయుడిని కలిశారు. గతంలో టీడీపీలో (TDP) తనతో కలిసి సుదీర్ఘ కాలం పాటు పని చేసిన నాగం జనార్ధన్ రెడ్డిని చంద్రబాబు ఆప్యాయంగా పలకరించారు. ఆరోగ్యం, కుటుంబ యోగక్షేమాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పలు పాత ఘటనలను గుర్తు చేసుకున్నారు. పలు అంశాలపై చర్చించించుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఓబులాపురం మైనింగ్ అంశంలో తెలుగుదేశం నేతలు చేసిన ఉద్యమాలపై నాడు కేసులు నమోదు అయ్యాయి. ఆ కేసుల విచారణలో భాగంగా విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టుకు నాగం ఇవాళ హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా టీడీపీ అధినేతతో సమావేశం కావడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాశంగా మారింది.

మళ్లీ టీడీపీలోకి నాగం?

టీడీపీతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన నాగం జనార్ధన్ రెడ్డి తెలుగు దేశంలో అత్యంత కీలక నేతగా మారారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో 2012లో టీడీడీపీ రాజీనామా చేసి 'తెలంగాణ నగారా సమితి' ని ఏర్పాటు చేశారు. 2013లో బీజేపీలో (BJP) చేరారు. 2018 లో ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ (Congress) లో చేరారు. 2023 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ అసెంబ్లీ టికెట్ ఆశించినప్పటికి అవకాశం దక్కలేదు. దీంతో 2023 అక్టోబర్ 31ల బీఆర్ఎస్ గూటికి చేరారు. అయితే జాతీయ స్థాయిలో ఎన్డీయే కూటమిని మరింత పటిష్ఠం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ భావిస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో కూడా ఎన్డీయే కూటమి ప్రయోగం అమలు చేస్తారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నది. అయితే ఇప్పటికే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మళ్లీ యాక్టివ్ చేసేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేయడం, ఇప్పటికే రెండు దఫాలుగా టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ కావడం ఆసక్తిగా మారింది. గతంలో టీడీపీలో పని చేసిన తీగల కృష్ణాగౌడ్ వంటి వారు తిరిగి టీడీపీలో చేరేందుకు సిద్ధం అవుతున్నారు. మాజీ మంత్రి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మల్లారెడ్డి సైతం టీడీపీలో చేరుతారనే ప్రచారం ఈటీవల జోరుగా జరిగింది. ఈ క్రమంలో చంద్రబాబుతో నాగం జనార్ధన్ రెడ్డి భేటీ కావడం రాజకీయంగా హాట్ టాపిక్ అవుతున్నది. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే నాగం తిరిగి టీడీపీలోకి (TTDP) వచ్చే ఆలోచన ఏమైనా ఉందా లేక క్యాజువల్ గానే తన మాజీ బాస్ తో భేటీ అయ్యారా అనేది కాలమే సమాధానం చెప్పనుంది.



Next Story