దేశ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ వెంటనే రాజీనామా చేయాలి: CPI డిమాండ్

by Satheesh |
దేశ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ వెంటనే రాజీనామా చేయాలి: CPI డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: పెంచిన వంట, వాణిజ్య గ్యాస్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని.. లేకుంటే ప్రజాగ్రహం తప్పదని సీపీఐ జాతీయ, రాష్ట్ర నాయకులు హెచ్చరించారు.గ్యాస్ రేటు పెంపును నిరసిస్తూ సీపీఐ హైదరాబాద్ జిల్లా సమితి హైదరాబాద్, సత్యనారాయణ రెడ్డి భవన్ నుంచి హిమాయత్ నగర్ వై జంక్షన్ వరకు గురువారం ప్రదర్శన నిర్వహించింది. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్ పాషా, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావులు మాట్లాడుతూ.. ప్రధాని మోడీ ప్రభుత్వం కొంతమంది కార్పొరేట్లకు అనుచిత ప్రయోజనాలు కల్పించేందుకు దేశ సామాన్య ప్రజలపై మోయలేని భారాలను వేస్తూ వివక్షాపూరిత విధానాలు అనుసరిస్తుందని ఆరోపించారు.

వంట గ్యాస్ రూ.50, వాణిజ్య గ్యాస్ రూ. 350 లకు పెంచి ప్రధాని మోడీ ప్రజలను కష్టాల్లోకి నెట్టివేశాడని ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వం సామాన్యుల ప్రజల గృహ బడ్జెట్‌ను దెబ్బతీస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజలను దోపిడి చేసి, తన కార్పోరేట్‌ మిత్రులకు దోచిపెడుతున్న ప్రధాని జాతికి క్షమాపణ చెప్పాలని.. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ప్రదర్శనలో సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఎస్. బోస్, ఈటి. నరసింహ, ఎన్. బలమల్లేష్, ఎం. బాల నరసింహ, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఎస్. ఛాయాదేవి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

నేడు సీపీఐ రాష్ట్ర వ్యాప్త ధర్నాలు..

వంట గ్యాస్‌ సిలెండర్‌ ధరను 50 రూపాయల చొప్పున పెంచడం మూలంగా పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరుగుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని అన్నారు. పేద ప్రజలను దోపిడి చేసి, తన కార్పోరేట్‌ మిత్రులకు దోచిపెడుతున్న ప్రధాని మోడీ జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్రూడాయిల్‌ ధర పెరుగుతున్నదని దానికి అనుగుణంగానే చమురు ధరలు పెంచుతున్నట్లు చెబుతున్న నరేంద్రమోడీ.. 2014లో బ్యారెల్‌ క్రూడాయిల్‌ ధర 98 డాలర్లు ఉన్నప్పుడు పెట్రోల్‌ రూ. 66, డీజిల్‌ రూ. 50 గ్యాస్‌ సిలెండర్‌ రూ. 410 ఉన్నదన్నారు. ఇప్పుడు క్రూడాయిల్‌ తక్కువ ధరలో అంటే 82.5 డాలర్లుంటే గ్యాస్‌ సిలెండర్‌ ధర రూ. 1155, పెట్రోల్‌ రూ. 109, డీజిల్‌ రూ. 97 ఉన్నదని తెలిపారు.

ఇప్పుడు క్రూడాయిల్‌ ధరలు తగ్గినా కాని పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ సిలెండర్‌ ధరలు పెంచడంలో పరమార్థం ప్రధానికే తెలియాలని, ఆనాడు క్రూడాయిల్‌ ధర ఎక్కువగా ఉన్నప్పుడు చమురు ధరలు, గ్యాస్‌ సిలెండర్‌ ధరలు తక్కువగా వున్నాయని వివరించారు. గ్యాస్‌ సిలెండర్‌ పెంపుదలకు నిరసనగా నేడు అన్ని జిల్లా, మండల, పట్టణ కేంద్రాల్లో సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కూనంనేని తెలిపారు.

Advertisement

Next Story