ప్రభుత్వ పథకాల అమలుపై నేటి నుంచి ఫీల్డ్ సర్వే

by M.Rajitha |
ప్రభుత్వ పథకాల అమలుపై నేటి నుంచి ఫీల్డ్ సర్వే
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపికకు అవసరమైన గ్రామసభలను పకడ్బందీగా, జవాబుదారీతనంగా నిర్వహించాలని ఆమె సూచించారు. పథకాల అమలు కోసం గురువారం నుంచి ఫీల్డ్ సర్వే నిర్వహించాల్సి ఉందన్నారు. బుధవారం ఆమె టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లకు, కార్యదర్శులకు సీఎస్ దిశానిర్దేశం చేశారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు సంబంధించి ఈనెల 21 నుంచి గ్రామసభలు నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసే ఈ నాలుగు పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాలు...గ్రామసభల ఆమోదం పొందవలసి ఉంటుందన్నారు. పై పథకాలను ఈనెల 26న ప్రారంభించడానికి సీఎం రేవంత్‌రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెప్పారు. రైతు భరోసాకు సంబంధించిన భూముల వివరాలను రెవెన్యూ శాఖ ద్వారా వ్యవసాయ శాఖకు పంపించినట్టు సీఎస్ తెలిపారు.

సాగుయోగ్యం కాని భూములు పరిశీలించాలి

సాగు యోగ్యం కాని భూములను క్షేత్ర స్థాయిలో రెవెన్యూ, వ్యవసాయ శాఖలు పరిశీలించాలని సీఎస్ సూచించారు. వాటి వివరాలను గ్రామ సభల్లో చదవి వినిపించాలని నిర్దేశించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు ... ఉపాధిహామీ పథకంలో కనీసం 20 రోజులపాటు పనిచేసి ... భూమిలేని వ్యవసాయ కూలీల కుటుంబాల జాబితాను గ్రామ సభల్లో ప్రకటించాలన్నారు. రేషన్ కార్డుల మంజూరుకు రూపొందించిన లబ్ధిదారుల ముసాయిదాకు గ్రామసభల ఆమోదం లభించేలా చూడాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులోనూ పారదర్శకత పాటించాలని సీఎస్ నిర్దేశించారు.

పంచాయతీలు, వార్డుల వారీగా సభలు

గ్రామాల్లో పంచాయతీల వారీగా, పట్టణాల్లో వార్డుల వారీగా సభలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో లబ్ధిదారుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ...లబ్ధిదారుల ఎంపిక, డేటా ఎంట్రీ తదితర అంశాలపై క్షేత్రస్థాయి పరిశీలన అవసరమన్నారు. వాటిపై జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. నాలుగు పథకాల అమలు కోసం రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక పకడ్బందీగా అమలయ్యేందుకు సంబంధిత కార్యదర్శులు ప్రత్యేక పర్యవేక్షణ జరపాలని సీఎస్ ఆదేశించారు. టెలీ కాన్ఫరెన్స్‌లో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి డీఎస్ చౌహాన్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, హౌసింగ్ కార్యదర్శి బుద్ధప్రకాష్, పంచాయతీ‌రాజ్ శాఖ కార్యదర్శి లోకేష్‌కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ వివిధ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.

పథకాల అమలుకు ప్రత్యేక కార్యక్రమాలు

16వ తేదీ నుంచి 20 వరకు బృందాల ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన

16వ తేదీ నుంచి 20వ తేదీవరకు లబ్ధిదారుల జాబితా తయారీ

21వ తేదీ నుంచి 24 వరకు ప్రజా పాలన, గ్రామ సభలు, డేటా ఎంట్రీ

25వ తేదీ లోపు జిల్లా ఇంచార్జి మంత్రులతో లబ్ధిదారుల జాబితా ఆమోదం

26 నుంచి నిధుల మంజూరు, మంజూరు పత్రాల జారీ


Advertisement
Next Story

Most Viewed