ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలి : AISF

by samatah |   ( Updated:2023-03-31 14:35:23.0  )
ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలి : AISF
X

దిశ, తెలంగాణ బ్యూరో: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శి కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేద మధ్యతరగతి విద్యార్థులపై చిన్నచూపు చూస్తూ వారికి ఇవ్వాల్సిన ఫీజు బకాయిలు సకాలంలో ఇవ్వడం లేదన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుకుందని గత రెండు సంవత్సరాలకు సంబంధించిన నిధులు కూడా పూర్తిగా విడుదల చేయలేదని పేర్కొన్నారు.

దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ప్రైవేట్ కాలేజీల్లో సర్టిఫికెట్‌ల కోసం వెళ్తే ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్షిప్ బకాయిలు రాలేదని ఫీజులు కడితేనే సర్టిఫికెట్స్ ఇస్తామని ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు చెబుతున్నాయని ఆరోపించారు. దీని వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులు ఫీజులు కట్టలేక చాలా మంది పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విద్యాసంవత్సరానికి చెందిన ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్షిప్ బకాయిలను పెండింగ్‌లో ఉంచకుండా విద్యార్థులకు విద్యాసంవత్సరం పూర్తి అయ్యేలోపు విడుదల చేయాలని సూచించారు. దాదాపు ప్రస్తుత విద్యాసంవత్సరం వరకు 4వేల కోట్ల ఫీజు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకుండా రీయింబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed