ధరణి కష్టాలు.. హైదరాబాద్ వరకు రావాల్సిందేనా!

by Javid Pasha |
ధరణి కష్టాలు.. హైదరాబాద్ వరకు రావాల్సిందేనా!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘గోరుతో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చిండు’ అనే సామెత ధరణి ఆప్షన్లకు సరిగ్గా సరిపోతుంది. ఈ పోర్టల్ భూ సమస్యలను మరింత జఠిలం చేసింది. అన్నదాతలకు అనవసర కష్టాలను తెచ్చిపెట్టింది. చిన్న చిన్న సమస్యల పరిష్కారానికే హైదరాబాద్ దాకా వెళ్లాల్సిన దుస్థితి నెలకొన్నది. లెక్కలేనన్ని సార్లు సీసీఎల్ఏ వరకు వెళ్లినా, అధికారులు, మంత్రులకు మొరపెట్టుకున్నా ప్రాబ్లమ్స్ సాల్వ్ కాక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.

‘మీ సేవా కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. ఎవరినీ కలవాల్సిన అవసరం లేదు. అధికారులు పరిశీలించి పరిష్కరిస్తారు.’ ధరణి పోర్టల్ గురించి సీఎం కేసీఆర్ పదేపదేచెబుతున్న మాటలివి. కానీ వాస్తవానికి పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నది. ప్రతి రోజు హైదరాబాద్ లోని సీసీఎల్ఏ కార్యాలయానికి వచ్చే బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. ధరణి పోర్టల్ రాకముందు తహశీల్దార్ పని చేయకపోతే ఆర్డీవో దగ్గరికి, ఆర్డీవో కూడా వినకపోతే జాయింట్ కలెక్టర్ కి చెప్పుకునే వాళ్లు. ఇప్పుడేమో తహశీల్దార్ రిపోర్ట్ కోసం మండల కేంద్రానికి, ఆ రిపోర్ట్ ఆమోదించాలని కలెక్టర్ ను కలిసేందుకు జిల్లా కేంద్రానికి, అప్ డేట్ చేయండంటూ హైదరాబాద్ లోని సీసీఎల్ఏకు రావాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఇలా సమస్యల పరిష్కారానికి సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వనపర్తి, రంగారెడ్డి, మేడ్చల్, మహబూబాబాద్, సిద్దిపేటతోపాటు మరికొన్ని జిల్లాల రైతులు ఎక్కువ సంఖ్యలో సీసీఎల్ఏ ఆఫీసుకు వస్తున్నట్లు తెలుస్తున్నది. గ్రామ స్థాయిలో వీఆర్వో, తహశీల్దార్ చేతిలో పరిష్కారమయ్యే సమస్యలను హైదరాబాద్ వరకు తీసుకురావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఎంత కాలం తిరగాలి?

నల్లగొండ జిల్లాకు చెందిన ఓ రైతు భూమి వివరాల్లో ఓ సర్వే నంబరు మిస్ చేశారు. ఇందులో రైతు తప్పు ఒక్క శాతం కూడా లేదు. డేటా సవరించాలంటూ ఆ రైతు కొన్ని నెలలపాటు తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగి రిపోర్ట్ ను కలెక్టర్ కు పంపించేలా చేశాడు. ఆ తర్వాత కలెక్టరేట్ చుట్టూ తిరిగీతిరిగీ ఆమోదింపజేసుకున్నాడు. అయినా వివరాలు అప్ డేట్ కాకపోతే అధికారులను మళ్లీ కలిశాడు. దీంతో హైదరాబాద్ లోని సీసీఎల్ఏలో పెండింగ్ లో ఉందని చెప్పారు. అయితే ఎవరిని కలవాలి? ఎక్కడ కలవాలి? ఏం తీసుకెళ్లాలి? ఇదేం తెలియక ఆ రైతు అయోమయానికి గురవుతున్నాడు. వంద కిలోమీటర్ల దూరంలోని సీసీఎల్ఏకు వెళ్లాల్సిందేనా? ఇలా ఎంత కాలం తిరగాలని బాధిత రైతు ప్రశ్నిస్తున్నాడు. ఇది ఒక్క నల్లగొండ జిల్లాకు చెందిన రైతు సమస్య మాత్రమే కాదు. సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వనపర్తి, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల నుంచి అనేక మంది సీసీఎల్ఏ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. వ్యవసాయం చేసుకొని జీవించే సామాన్య రైతు హైదరాబాద్ కి వచ్చి సంబంధిత సెక్షన్ అధికారి, జూనియర్/సీనియర్ అసిస్టెంట్, సీసీఎల్ఏని కలవడం సాధ్యమేనా? ఇది సాధ్యం కాకపోవడంతోనే మధ్యవర్తులను ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తున్నది.

పెండింగ్ కి అర్థమేమేటి?

తహశీల్దార్ నివేదిక ఆధారంగా కలెక్టర్ ఆమోదిస్తున్నారు. ఆ తర్వాత సీసీఎల్ఏ కార్యాలయంలో పెండింగ్ ఎందుకు పెడుతున్నారనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మేం సొంతూర్లకు వెళ్తే మా ఫైల్ సీసీఎల్ఏలో పెండింగ్ ఉంది. కాస్త పెద్ద సారుకి చెప్పండంటూ పదుల సంఖ్యలో జనం వస్తున్నారని ఓ రెవెన్యూ అధికారి ‘దిశ’తో అన్నారు. కలెక్టర్ అప్రూవ్ చేసిన తర్వాత అక్కడ ఎందుకు పెండింగ్ పెడుతున్నారో, ఆ విషయం ఎవరికి చెప్పాలో మాకు కూడా అర్థం కావడం లేదని చెప్పారు. అధికారి హోదాలో ఉండి కూడా తాము కూడా సాయం చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ దగ్గరే పూర్తి కావాల్సిన పనికి రైతులను హైదరాబాద్ దాకా ఎందుకు రప్పిస్తున్నారో, ఫైళ్లు ఎందుకు స్వీకరిస్తున్నారో మాక్కూడా అర్థం కావడం లేదని రెవెన్యూ అసోసియేషన్ నేత ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. నెలల తరబడి పెండింగ్ కి అర్థమేమిటో ఉన్నతాధికారులే చెప్పాలన్నారు.

కేంద్రీకృత పాలన

ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్, ఆటోమెటిక్ మ్యుటేషన్, పట్టాదారు పాసు పుస్తకాల జారీ ప్రక్రియ అరగంటలోనే పూర్తవుతుంది. గతంలోనైతే ఈ పని నెలలు పట్టేదంటూ గొప్పతనాన్ని లెక్కలు నిమిషాలను కట్టి ప్రకటనలు చేస్తున్నారు. అదే ఘనకీర్తిగా దశాబ్ది ఉత్సవాల్లోనూ విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే గతంలో ఏ దరఖాస్తు ఎన్ని రోజుల్లో ఎవరి స్థాయిలోనే పూర్తయ్యేది? ఇప్పుడు ఎలాంటి సమస్య పరిష్కారానికి ఎన్ని నెలలు పడుతుంది? ఆ రైతు ఎవరెవరిని ఎన్నిసార్లు కలిశారు? ఊరి నుంచి హైదరాబాద్ దాకా ఎందుకొచ్చారు? అని ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పడం లేదు. ధరణి పోర్టల్ సృష్టించిన సమస్యల పరిష్కారం ఎన్ని రోజుల్లో చేస్తున్నారో బాధిత రైతులను అడిగితే వాళ్ల గోస తెలుస్తుంది. దరఖాస్తు సమర్పించిన నాటి నుంచి డేటా అప్ డేట్ వరకు ఎన్ని నెలలు/సంవత్సరాలు పట్టింది? ఎవరెవరు ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నారు? వివరాలు బయటికి తీస్తే ధరణి పోర్టల్ పనితీరు, ఘనకీర్తి స్పష్టమవుతుందని ధరణి భూ సమస్యల వేదిక అభిప్రాయపడింది. సమస్యల పరిష్కారానికి ఎంత కాలం పడుతుందని సీఎం కేసీఆర్ ఒక్కసారి కూడా ఆరా తీయకపోవడం పట్ల విమర్శలు వస్తున్నాయి. అన్ని శాఖలపై రివ్యూ చేసే సీఎం దీనిపై మాత్రం వచ్చిన డ్యాష్ బోర్డు వివరాలను వెల్లడించకపోవడం గమనార్హం. ఇకనైనా కలెక్టర్ స్థాయిలోనే సమస్యలను పరిష్కరించే వ్యవస్థను రూపొందించాలని రెవెన్యూ అధికారులు కోరుతున్నారు.

అపరిష్కృతంగా టీఎం 33

ధరణి పోర్టల్ సృష్టించిన సమస్యలకు పరిష్కారం లభించేటట్లు లేదు. గ్రామీణ ప్రాంతాల్లో దరఖాస్తుల పరిశీలన మందకొడిగా సాగుతున్నది. ధరణి పోర్టల్ లోని టీఎం 33 మాడ్యూల్ కింద 2.50 లక్షలకు పైగానే అప్లికేషన్స్ వచ్చినట్లు సమాచారం. జిల్లా స్థాయిలో కలెక్టర్లు పరిశీలించి సీసీఎల్ఏ కార్యాలయానికి సంబంధిత ఫైల్స్ అన్నీ పంపిస్తున్నారు. అయితే కొన్ని నెలల నుంచి ఈ అప్లికేషన్ల పరిశీలన నిలిపివేస్తున్నట్లు తెలుస్తున్నది. సీసీఎల్ఏ కార్యాలయంలో వీటికి సంబంధించిన ఏ ఫైల్ ఓపెన్ చేయడం లేదు. దాంతో ప్రతి రోజూ హైదరాబాద్ నాంపల్లిలోని సీసీఎల్ఏ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో ధరణి పోర్టల్ బాధితులు డాక్యుమెంట్లు, ఇతర పత్రాలు పట్టుకొని వస్తున్నారు. జిల్లాల్లో రైతుల పాస్ బుక్ డేటా కరెక్షన్ టీఎం 33 ఫైల్స్ ఎప్పుడు క్లియర్ చేస్తారో సీసీఎల్ఏ కమిషనర్, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed