- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
రావిరాల విలవిల.. అన్నీ కోల్పోయి రోడ్డునపడ్డ కుటుంబాలు
దిశ, నెల్లికుదురు : ఆకస్మాత్తుగా ముంచెత్తిన వరదలతో మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రావిరాల గ్రామం విలవిలలాడుతోంది. ఇటీవల కురిసిన వర్షాలతో రావిరాల గ్రామం ఎగువ భాగంలో ఉన్న చెరువులు మత్తళ్లు దుంకడం, తెగిపోవడంతో గ్రామాన్ని వరదలు ముంచెత్తాయి. ఒక్కసారిగా ఊరంతా సంద్రంలా మారింది. నడిరాత్రి ఊరిపై వరదలు ముంచెత్తడంతో ఎటు పోవాలో అర్థం కాక చెట్టుకొకరు, పుట్టకొకరు అన్నట్లుగా జనమంతా చెల్లాచెదురయ్యారు. చిన్న నాగారం శివారులోని మర్రికుంట, మద్దెల కుంట, ఎర్రకుంట, రాజుల కొత్తపల్లి, కొత్త కుంట తదితర చెరువులు, కుంటలు తెగి రావిలాల గ్రామ చెరువులోకి భారీగా వరద చేరింది. దీంతో చెరువు మత్తడి పోయడంతో వరద ఒక్కసారిగా గ్రామంపై విరుచుకుపడింది. అదే జలప్రళయం మరో గంట కొనసాగితే గ్రామంలో ప్రజలు శవాలు గుట్టలుగా మారే పరిస్థితి నెలకొనేది. అదృష్టవశాస్తూ రావిరాల చెరువు కట్ట తెగడంతో గ్రామ ప్రజలు బతికి బయటపడ్డారు. గ్రామంలోని ఇండ్లపైన దాబాల పైకి ఎక్కి జనం ప్రాణాలు రక్షించుకున్నారు.
ఆగని గ్రామస్తుల కన్నీటి ధార..!
వరదలు గ్రామంలో జలప్రళయం సృష్టించి వెళ్లడంతో ఇంకా ఆ షాక్ నుంచి రావిరాల వాసులు కోలుకోలేకపోతున్నారు. వందకు పైగా ఇళ్లు పూర్తిగా నీట మునిగిపోగా.. 35 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరో 70 ఇళ్ల వరకు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కష్టార్జితంతో సంపాదించుకున్న సొమ్ము, ఆభరణాలు, విద్యార్థుల సర్టిఫికెట్లు, భూపత్రాలు, పశువులు వరదలో కొట్టుకుపోయాయి. పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. ఏం చేద్దామన్న చేతిలో చిల్లిగవ్వలేదు. దిక్కుతోచని స్థితిలో తెలిసిన బంధు, మిత్రుల వద్ద ఆర్థిక సాయం పొందుతున్నారు. కానీ విధి తమను కోలుకోలేని దెబ్బతీసిందంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. పిల్లల చదువులెట్లా..? చేసిన అప్పులు ఎట్లా తీర్చాలి..? ఆడపిల్లల పెళ్లిలెట్లా చేయాలి? మమ్మల్ని ఆదుకునేదెవరు? మా బతుకులను పట్టించుకునేదెవరంటూ శోకిస్తున్నారు. వరద తమను సర్వనాశనం చేసి కట్టుబట్టలతో వీధుల్లో నిలబెట్టేసిందంటూ బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు.
ప్రజాప్రతినిధుల వైఖరిపై ఆగ్రహం..
వరదలతో సర్వం కోల్పోయిన తమను ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని రావిరాల వరద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితులను పరామర్శించడానికి వచ్చిన మంత్రి సీతక్క నిరాశ్రయులకు తక్షణ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, తక్షణ సహాయం అందిస్తామని చెప్పినా నేటికీ సాయం అందలేదని వాపోతున్నారు. ఇటీవల గ్రామానికి వచ్చిన మాజీ ఎంపీ కవిత, బీజేపీ నాయకుడు జాటోత్ హుస్సేన్ నాయక్ మినహా తమకు ఎవరూ సాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ తమ పరిస్థితిపై పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది నిత్యావసరాలు, దుప్పట్లను పంపిణీ చేశారని చెబుతున్నారు. ప్రభుత్వం తక్షణమే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తక్షణ సాయం చేసి గృహాలు మంజూరు చేయాలని వరద బాధితులు వేడుకుంటున్నారు.
ఇల్లు కోల్పోయా.. కొరుకొప్పుల ప్రమీల, రావిరాల
భారీ వరద రావడంతో నాకున్న ఒక ఒక్క ఇల్లును పూర్తిగా కోల్పోయా. వంట చేసేందుకు నిత్యావసర సరుకులు కూడా లేవు. ప్రభుత్వం ఇల్లు ఇప్పించి తక్షణ ఆర్థిక సాయం అందజేసి ఆదుకోవాలి.
ప్రభుత్వం ఆదుకోవాలి.. చిప్ప నరసమ్మ, బాధితురాలు
నా ఇల్లు పూర్తిగా వరదలో కొట్టుకపోయింది. తినడానికి తిండి గింజ కూడా లేదు. విధి మమ్మల్ని వీధిపాలు చేసింది. ఇంట్లోని వస్తువులన్నీ కొట్టుకుపోయాయి. మాలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. ప్రభుత్వం దయతలచి మమ్మల్ని ఆదుకోవాలి. ఇల్లు, ఆర్థిక సాయం అందిస్తేనే మా బతుకులు నిలబడుతాయి.
తక్షణ సాయం అందజేయాలి.. రాస యాకిరెడ్డి, రావిరాల
వరదలతో గ్రామస్తుల బతుకులు తలకిందులయ్యాయి. ఆర్థికంగా చితికిపోయాం. వందలాది మంది బతుకులు ఆగమయ్యాయి. జీవితాన్ని మళ్లీ మొదటి నుంచి ఆరంభించాలి. ప్రభుత్వం నుంచి తక్షణ ఆర్థిక సాయం అందజేయాలి. గ్రామంలో వరదల నివారణకు చర్యలు చేపట్టాలి. వరద నష్టాల నుంచి ప్రజలను కోలుకునే విధంగా ప్రభుత్వం ఆర్థికంగా సాయం అందించి ఆదుకోవాలి.