కిషన్ రెడ్డి ముందంతా ముళ్లబాటే! ఈసారైనా నిరూపించుకునేనా?

by Prasad Jukanti |
కిషన్ రెడ్డి ముందంతా ముళ్లబాటే! ఈసారైనా నిరూపించుకునేనా?
X

దిశ, డైనమిక్ బ్యూరో:సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ తెలంగాణపై ఫోకస్ పెంచుతోంది. ఎక్కువ సీట్లు గెలుపే లక్ష్యంగా పార్టీ జాతీయ నాయకత్వం పావులు కదుపుతోంది. అసెంబ్లీ ఎన్నికలను చివరి నిమిషంలో లైట్ తీసుకున్న ఆ పార్టీ అధిష్టానం పార్లమెంట్ ఎన్నికల విషయంలో మాత్రం సీరియస్ గా వర్కౌట్ చేస్తోంది. అయితే తెలంగాణలో ‘డబుల్ డిజిట్’ సీట్లు సాధించడమే టార్గెట్ గా హైకమాండ్ ప్రణాళికలు రచిస్తుంటే రాష్ట్ర స్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఎంపీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల మాట అలా ఉంచితే రాష్ట్ర అధ్యక్షుడి గెలుపు విషయంలో సరికొత్త అనుమానాలు చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు పర్వాలేదు అనిపించినా పరిస్థితి మాత్రం చావు తప్పి కన్ను లొట్టబోయిందనేలా ఉందనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి సారథ్యంలో పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ పెద్దల ఆశలను కిషన్ రెడ్డి అందుకుంటారా లేదా అనేది ఉత్కంఠగా మారింది.

చుట్టూ ప్రత్యర్థి ఎమ్మెల్యేలే:

రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ముందుందంతా ముళ్లబాటే అనే చర్చ జరుగుతోంది. కేంద్ర మంత్రి హోదాతో పాటు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రబాద్ సెగ్మెంట్ గెలవడం ప్రెస్టేజ్ వ్యవహారం. అయితే ప్రస్తుతం ఇక్కడ సానుకూల పరిస్థితితులు లేవనే టాక్ వినిపిస్తోంది. గతంలో అంబర్ పేట అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన కిషన్ రెడ్డి ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి గెలవడం వెనుక ఓటమి సెంటిమెంట్ కలిసి వచ్చిందనే టాక్ ఉంది. కానీ ఈసారి కిషన్ రెడ్డి తన పనితీరుతోనే ఓట్లు అడగాల్సిన పరిస్థితి ఉండబోతున్నది. ఇదిలా ఉంటే సికింద్రబాద్ పార్లమెంట్ నియోజకర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే ఇందులో ఒక్కటి కూడా బీజేపీ ఖాతాలో లేవు. ఇక తన సొంత ఇలాకా అని చెప్పుకునే అంబర్ పేటలోనూ బీజేపీ క్యాండిడేట్ ను గెలిపించుకోలేకపోయారనే విమర్శలు కిషన్ రెడ్డిపై ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి ఉంటే అందులో జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నది కేవలం గోషామహల్ ఎమ్మెల్యే ఒక్కరే. దీంతో ఈసారి కిషన్ రెడ్డి గెలవడం అంతా ఈజీ కాదనే చర్చ జరుగుతోంది. ఈసారి తాను పోటీ చేసే స్థానంలో గెలవడంతో పాటు రాష్ట్రంలోని పార్టీ అభ్యర్థులను గెలిపించి తన నేతృత్వ సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడిందనే టాక్ వినిపిస్తోంది.

సిట్టింగ్ లతో కిరికిరి.. నాయకుల మధ్య ఆధిపత్య పోటీ:

పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ హవాతో నెగ్గుకురావొచ్చనే భావన బీజేపీలో ఉన్నప్పటికీ పార్టీలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాలు ఎక్కడ కొంప ముంచుతాయో అనే ఆందోళన క్యాడర్ ను వెంటాడుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీకి నలుగురు ఎంపీలు ఉండగా సిట్టింగ్ ల టికెట్ల విషయం కిరికిరిగా మారింది. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు టికెట్లు ఇవ్వొద్దని సొంత సెగ్మెంట్ లో నిరసనలు వ్యక్తం కావడం హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే ఎంపీ టికెట్ల కోసం పార్టీలో అప్పుడే నాయకుల మధ్య పోటీ పెరిగిపోయిందనే టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యేగా రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన ఈటల రాజేందర్ ఈసారి మల్కాజ్ గిరి టికెట్ కోసం గట్టి ప్రయత్నమే చేస్తున్నారనే ప్రచారం వినిపిస్తోంది. ఈ టికెట్ దక్కకపోతే ఈటల దారెటు అనేది సస్పెన్స్ గా మారింది. ఒకవేళ టికెట్ కేటాయిస్తే పక్కపక్కనే ఉండే కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో క్యాడర్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఆసక్తిగా మారింది. దీనికి తోడు పార్టీలో గ్రూప్ తగాదాలను పరిష్కరించేందుకు అధిష్టానం చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతూనే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మొదలైన ఆధిపత్య పోరు పొగ ఇంకా చల్లారడం లేదు. ఈ విషయంలో జాతీయ నాయకత్వం ఎన్ని సార్లు సర్ది చెప్పినా పైకి అవునంటూనే లోలోపల నో అంటున్నారు.

ఇక నేతల మధ్య ఆధిపత్యపోరుపై క్యాడర్ సైతం గుర్రుగా ఉందనే చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ నుంచి మొదలైన వలసలు త్వరలో మరోసారి కొనసాగుతాయనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే బండి సంజయ్ అధ్యక్షుడిగా పని చేసిన కాలంలో పార్టీ గ్రాప్ అమాంతం పెరిగింది. దుబ్బాక, హుజూరాబాద్ తో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటింది. ఆ తర్వాత కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక జీహెచ్ఎంసీ పరిధిలో పార్టీ బలహీనపడిందనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలో అందరిని సమన్వయం చేసుకుంటూ లోక్ సభ ఎన్నిక్లలో కిషన్ రెడ్డి పార్టీని ఏ మేరకు నెట్టుకు వస్తారు? తాను ఏ మేరకు నెట్టుకురాగలరు అనేది ఉత్కంఠగా మారింది.

Advertisement

Next Story