బీజేపీలో ఉన్నా హైడ్రాకు నా మద్దతు.. ఎంపీ కొండా సెన్సేషనల్ కామెంట్స్

by Prasad Jukanti |   ( Updated:2024-08-26 10:12:18.0  )
బీజేపీలో ఉన్నా హైడ్రాకు నా మద్దతు.. ఎంపీ కొండా సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు ప్రభుత్వం హైడ్రా పేరుతో గొప్ప నిర్ణయం తీసుకుందని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్వహించిన సర్వేలో హైడ్రా చేస్తున్న అక్రమ నిర్మాణాల కూల్చివేతలను 78 శాంత మంది సమర్ధిస్తే కేవలం 22 శాతం మందే తప్పుపట్టారని చెప్పారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. హైడ్రా ఏర్పాటు మంచి నిర్ణయం అని అందువల్లే తాను బీజేపీలో ఉన్నా మద్దతు ఇస్తున్నానన్నారు. హైడ్రా కూల్చివేతల వేనుక ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు లేవన్నారు. అదే నిజమైతే జన్వాడలోని కేటీఆర్ ఫామ్ హౌస్ నే తొలుత కూల్చేవారని చెప్పారు. పార్టీలకు అతీతంగా అక్రమ నిర్మాణాల కూల్చివేత జరుగుతున్నదని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ బడా నాయకుడికి చెందిన అక్రమ నిర్మాణాన్ని సైతం హైడ్రా కూల్చివేసిందన్నారు. హైడ్రా పనితీరుకు మద్దతు ఇస్తూనే మూడు లోపాలను, ఒక సవరణను హైడ్రా గుర్తించాలన్నారు. హైడ్రా చేపట్టిన కూల్చివేతలు చేపట్టిన అక్రమ నిర్మాణాల నిందితులు ఎవరో గుర్తించాలి. స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన బిల్డర్లను శిక్షించి వాటి శిథిలాల తొలగింపుకు అయ్యే ఖర్చును బిల్డర్ల నుంచే వసూలు చేయాలన్నారు. బాధితుల్లో చాలా మంది పేద, మధ్యతరగతి ప్రజలే ఉన్నందున వారికి పరిష్కార మార్గం హైడ్రానే చూపించాలన్నారు. ఈ నిర్మాణాలకు పర్మిషన్లు ఇచ్చిన అధికారులపై తప్పకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే దేవాలయ భూముల విషయంలోనూ హైడ్రా ఇదే తరహాలో పని చేయాలని ప్రతిపాదించారు.

జన్వాడ ఆ ఫామ్ హౌస్ ఎవరిదో అందరికీ తెలుసు:

ధనికులు, సామాన్యులు అనే తేడా లేకుండా సినిమా స్టార్ల అక్రమ కట్టడాలు సైతం కూల్చివేస్తూ హైడ్రా పర్యావరణాన్ని రక్షిస్తున్నదన్నారు. మంచి చేస్తే పార్టీలకు అతీతంగా స్వాగతిస్తామని హైడ్రాను బీజేపీకి చెందిన ఈటల రాజేందర్, రఘునందన్ రావు, కాటిపల్లి వెంకటరమణారెడ్డిలు ముక్తకంఠంతో ప్రశంసిస్తున్నామన్నారు. కొంత మంది నాయకులు తమ ఆక్రమణల విషయం వదిలేసి పక్క పార్టీలో ఉన్న నాయకులకు చెందిన నిర్మాణాలను కూల్చాలని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎవరిది తప్పు ఉంటే వారి నిర్మాణాలను కూల్చివేస్తారని ఎదుటి వారిది కూడా రేపో మాపో తొలగిస్తారని ముందు మన ఆక్రమణల గురించి మాట్లాడారని హితవు పలికారు. హైడ్రా మంచి పని చేస్తున్నప్పుడు అడ్డుకోవడం మంచిది కాదని, అందరం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే సమయంలో లోపాలను మాత్రం తప్పక ఎత్తిచూపాలన్నారు. తమ పార్టీ నేతలు హైడ్రా ప్రయత్నానికి మద్దతు ఇస్తూనే లోపాలను సరిదిద్దుకోవాలని సూచిస్తున్నామన్నారు. జన్వాడ ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో లేదని కానీ జీవో 111 పరిధిలో ఉందన్నారు. వాటర్ చానెల్ ను పూడ్చి అక్కడ నిర్మాణం చేపట్టారని అందువల్ల దాన్ని కూల్చితే కూల్చే అవకాశాలున్నాయన్నారు. హైడ్రా వెనుక రాజకీయ కక్ష్య సాధింపే అయితే సీఎం రేవంత్ రెడ్డి జన్వాడ ఫామ్ హౌస్ నే కూల్చేవారన్నారు. జన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్ తో ఆయన బినామిదో అనేది పబ్లిక్ కు తెలుసన్నారు.

Advertisement

Next Story