Seethakka: ఎన్ కౌంటర్ చేసినా మార్పు రాలే.. అత్యాచార ఘటనలపై మంత్రి సీతక్క సెన్సేషనల్ కామెంట్స్

by Prasad Jukanti |
Seethakka: ఎన్ కౌంటర్ చేసినా మార్పు రాలే..  అత్యాచార ఘటనలపై మంత్రి సీతక్క సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తే దానిపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే మహిళలు తిరుగుబోతులు అనేలా కొంతమంది యూట్యూబ్ చానెళ్లలో దుష్ప్రచారం చేస్తున్నారని మంచి చెడు అనేది వ్యక్తిగత ప్రవర్తన ఆధారంగా ఉంటుందని మండిపడ్డారు. ప్రతిపక్షాలకు మహిళలంటే ఎందుకు ఆక్రోశం అని ప్రశ్నించారు. ఇందంతా మహిళా లోకం ఆలోచన చేయాలన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన స్త్రీనిధి సర్వసభ్య సమావేశానికి మంత్రి సీతక్క హాజరయ్యారు. స్త్రీనిధి అంటే మహిళల ఆర్థిక భద్రత అని, మహిళా సంఘాలు చురుకుగా పని చేయాలన్నారు. సమాజం సంతోషంగా ఉండాలంటే మహిళల ఆర్థిక ప్రగతి అవసరం అని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన అని అందువల్లే కోటి మంది మహిళలను లక్షాధికారులను చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారని చెప్పారు. స్త్రీనిధి సభ్యులు చేసే ఉత్పత్తులను విక్రయించుకునేందుకు శిల్పారామంలో మార్కెటింగ్ కోసం స్టాల్స్ ఏర్పాటు, అమ్మ ఆదర్శ పాఠశాలలు, స్కూల్స్ యూనిఫామ్స్ బాధ్యత మహిళా సంఘాలకు ఇచ్చిందని గుర్తు చేశారు. గతంలో అభివృద్ధి అంతా ఒకే ప్రాంతానికి పరిమితం అయిందని విమర్శించారు.

‘మార్పు’ స్పెషల్ డ్రైవ్:

మహిళ భద్రత పెద్ద సవాలుగా మారిందని బయటకు వెళ్లిన మహిళ సురక్షితంగా ఇంటికి చేరుతుందనే నమ్మకం లేకుండా పోయిందన్నారు. కోల్ కతా మెడికోపై జరిగిన ఘటనను గుర్తు చేశారు. అన్ని చోట్ల పోలీసుల చేత భద్రత అనేది వీలు పడకపోవచ్చని అటువంటి తరుణంలో మహిళల రక్షణ విషయంలో మహిళా సంఘాలు యాక్టివ్ గా పనిచేసే అవసరం ఉందన్నారు. ఈ సమాజంలో ఆర్థిక భద్రతతో పాటు సామాజిక రక్షణ అవసరం అని అందువల్ల 'మార్పు' అనే పేరుతో ఒక స్పషల్ డ్రైవ్ ను ప్రవేశపెట్టబోతున్నామని చెప్పారు. దీని ద్వారా మహిళల రక్షణపై అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడినందుకు మన రాష్ట్రంలోనూ రెండు మూడు ఎన్ కౌంటర్లు జరిగాయని అయినా మార్పు రాలేకపోయిందన్నారు. అందువల్ల మహిళలను గౌరవించడం మన ఇంటి నుంచే, తరగతి గది నుంచే అవగాహన కల్పించే బాధ్యత స్త్రీనిధిలో సభ్యులుగా ఉన్న 64 లక్షల మంది సభ్యులపై ఉందన్నారు.

Advertisement

Next Story