Etala Rajender: పేదల కంట నీరు ప్రభుత్వానికి మంచిది కాదు.. ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-09-27 06:04:21.0  )
Etala Rajender: పేదల కంట నీరు ప్రభుత్వానికి మంచిది కాదు.. ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మూసీ సుందరీకరణ (Moosi Beautification)లో భాగంగా నిర్వాసితుల గుర్తింపు సర్వే నగర వ్యాప్తంగా ఆందోళనలకు దారి తీస్తోంది. ఇప్పటికే పలుచోట్ల సర్వే కోసం వచ్చిన అధికారులను స్థానికులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. గత రెండు రోజుల నుంచి అధికారులు బృందాలుగా ఏర్పడి గోల్కొండ, ఇబ్రహీంబాగ్, లంగర్ హౌజ్ డిఫెన్స్ కాలనీ, పాతబస్తీ, చాదర్‌ఘాట్, శంకర్ నగర్, అంబర్‌పేట్, ముసారాంబాగ్, కొత్తపేట, మారుతీనగర్, సత్యానగర్, ఫణిగిరికాలనీ, ఇందిరానగర్, గణేష్‌పురి తదితర ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు నడుమ సర్వే చేస్తున్నారు. ఈ క్రమంలోనే హైడ్రా బాధితులంతా ఇవాళ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ (MP Etala Rajender)ను కలిశారు.

తమ నిర్మాణాలను కూల్చొద్దని, ఏళ్ల తరబడి అక్కడే ఉంటూ జీవనం సాగిస్తున్నామని బాధితులు వారి గొడును ఎంపీకి వెల్లబోసుకున్నారు. తమ విజ్క్షప్తులను ఎలాగైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ (Etala Rajender) మాట్లాడుతూ.. నిజాం సర్కార్ కంటే దారుణంగా, దుర్మార్గంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతలతో నిరుపేదలు గత రెండు నెలల నుంచి కంటి మీద కునుకు లేకుండా బతుకుతున్నారని ఫైర్ అయ్యారు. గతంలో సంజయ్ గాంధీ (Sanjay Gandhi) కూడా ఇలాగే నిరుపేదల ఇళ్లను నేలమట్టం చేయించాడని గుర్తు చేశారు. పేదల కంట నీరు ప్రభుత్వానికి కూడా మంచిది కాదని.. ఇళ్ల కూల్చివేతలపై మరోసారి ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఈటల అన్నారు.

Advertisement

Next Story