6 నెలల్లో ఎన్నికల కోడ్.. ఇక రెగ్యులరైజేషన్ లేనట్లేనా?

by Sathputhe Rajesh |   ( Updated:2023-03-18 02:39:57.0  )
6 నెలల్లో ఎన్నికల కోడ్.. ఇక రెగ్యులరైజేషన్ లేనట్లేనా?
X

మొత్తం 91,142 ఖాళీలు ఏర్పడ్డాయి అధ్యక్ష.. ఈ ఉద్యోగాలకు ఈ రోజు నుంచే నోటిఫై చేస్తరు అధ్యక్ష.. ఇందులో గతంలో హైకోర్టుకు పోయి రెగ్యులరైజేషన్ ప్రతిపాదించినమో అవి.. 11,103 మంది ఉన్నరు అధ్యక్ష.. వాళ్ల ఏజ్ అయిపోతావుంది పాపం.. ఉద్యోగం కదా పర్మనెంట్ కాకపోతదా అని ఆశతో జాయిన్ అయినారు. వాళ్లను వదిలేస్తే పాపం బజారున పడతరు. హైకోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది. ఈ 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తా ఉన్నం అధ్యక్ష..

- సీఎం కేసీఆర్ (9 మార్చి, 2022 అసెంబ్లీలో)

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ప్రభుత్వ కొలువులు ఇప్పట్లో భర్తీ అయ్యే అవకాశాలు కనిపించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ తప్పిదాలు, టీఎస్‌పీఎస్సీ వైఫల్యాల కారణంగాలే ఇందుకు కారణమని చర్చ జరుగుతున్నది. లీకైన పేపర్లపై విచారణలు, కమిషన్‌లోని లోటు పాట్లు సవరణకు కనీసం మరో మూడు నెలల సమయం పట్టనుంది. ఈలోపు ఎన్నికల షెడ్యూల్ వస్తే ఉద్యోగాల భర్తీ పక్రియకు బ్రేకులు పడతాయని టాక్. ఇక కొత్త ఉద్యోగాల భర్తీ కొత్త సర్కారులోనే జరుగుతుందనే చర్చలు నిరుద్యోగుల మధ్య సాగుతున్నాయి.

ఎన్ని పోస్టులు భర్తీ చేశారు?

తెలంగాణలో 91 వేల పైచిలుకు ఖాళీలు ఉన్నాయని, వాటిని భర్తీ చేయబోతున్నామని ఏడాది క్రితం సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. కానీ అందులో ఎన్నింటికి నోటిఫికేషన్ ఇచ్చారు? ఎంత మందికి పోస్టింగ్ ఇచ్చారన్నదే ప్రశ్న. వాస్తవానికి 2018 తర్వాత టీఎస్‌పీఎస్సీ ద్వారా జారీ చేసిన నోటిఫికేషన్లలో ప్రభుత్వం కేవలం మూడు ముగ్గురికి మాత్రమే పోస్టింగ్ (కాళోజీ యూనివర్సిటీలో) ఇచ్చింది. మిగతా పోస్టులన్నీ 2018 ఎన్నికల ముందు నాటివే కావడం గమనార్హం.

ప్రకటనలపై ఉన్న శ్రద్ధ భర్తీలో ఏది?

రాష్ట్ర ఏర్పాటు నుంచి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై అనేక వివాదాలు నెలకొన్నాయి. మొదటి సారి ప్రభుత్వం ఏర్పాటు చేశాక లక్ష ఉద్యోగాలు భర్తీ చేశామని పాలకులు పదేపదే చెప్పుకునే ప్రయత్నం చేశారు. కానీ కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యూలరైజ్, ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీ, విద్యుత్ సంస్థల్లో జరిగిన రిక్రూట్‌మెంట్‌నూ తమ ఖాతాలో వేసుకున్నారని విమర్శలు ఉన్నాయి. రెండో దఫా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత డాక్టర్ల ఉద్యోగాల భర్తీ మినహా మిగతా వాటిని ప్రభుత్వం భర్తీ చేయలేదు.

గతేడాది మార్చిలో జరిగిన బడ్జెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ 80 వేల పైచిలుకు (కాంట్రాక్ ఉద్యోగులు మినహా) ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు. కానీ ఇంతవరకు ముందడుగు పడలేదు. తాజాగా టీఎస్‌పీఎస్సీ‌లో క్వశ్చన్ పేపర్ లీక్ వ్యవహారంతో ప్రభుత్వం ఇరుకున పడింది. దీంతో గతంలో జరిగిన నియామకాలపైనా అనుమానాలు తలెత్తుతున్నాయి.

సెప్టెంబరు‌లో ఎన్నికల షెడ్యూలు!

ప్రస్తుతం సర్వీస్ కమిషల్‌లో జరిగిన తప్పిదాలను చక్కదిద్దే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. ఇప్పటి వరకు జారీ చేసిన నోటిఫికేషన్లకు పరీక్షలు నిర్వహించాలి. ఆ పేపర్లను వాల్యూవేషన్ చేయాలి. ఆ తర్వాత ఫలితాలను ప్రకటించాలి. ఈ పక్రియ పూర్తవడానికి కనీసం మూడు నెలల సమయం పడుతుంది. ఆగస్టు చివరిలోపు ఫలితాలను ప్రకటించి, సెలక్ట్ అయిన వారికి నియామక పత్రాలు అందించాలి. సెప్టెంబర్‌లో ఎన్నికల షెడ్యూల్ జారీ కానుండటంతో నియామకాల్లో ఆలస్యం జరిగితే ఎన్నికల కోడ్ సమయంలో అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం కుదరదు. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే నియామకాలు జరిగే ఛాన్స్ ఉంది.

అటకెక్కిన క్రమబద్ధీకరణ

11 వేల పైచిలుకు కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని గతేడాది అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించినా.. ఈ ప్రక్రియకు ఇంకా ముందడుగు పడలేదు. దీంతో ఇప్పటికే వారిని రెగ్యులర్ చేయలేదు. దీంతో చాలా మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు తమను క్రమబద్ధీకరించాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed