సెమీ కండక్టర్‌ల ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి: మంత్రి శ్రీధర్ బాబు

by Mahesh |
సెమీ కండక్టర్‌ల ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి: మంత్రి శ్రీధర్ బాబు
X

దిశ, తెలంగాణ బ్యూరో : సెమీ కండక్టర్‌ల ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్రం కూడా సహకరించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి శ్రీధర్ బాబు బుధవారం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ను ప్రత్యేకంగా కలిశారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో సెమీకండక్టర్ల తయారీకి ముందుకొచ్చే పరిశ్రమలకు కల్పిస్తున్న ప్రోత్సాహాకాలు, ఇతర అంశాలను ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. రాబోయే రోజుల్లో ఈ రంగంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలుస్తుందని తెలిపారు. ఏఐ, సైబర్ సెక్యూరిటీ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు.

పలు ప్రముఖ సంస్థలు తెలంగాణలో తమ డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తాయని, ఇలాంటి తరుణంలో డేటా భద్రత కీలకంగా మారిందన్నారు. అందుకే ‘నేషనల్ డిజాస్టర్ రికవరీ జోన్’ ఏర్పాటు చేయడం ఆవశ్యకమన్నారు. ఈ అంశంపై దృష్టి సారించాలని మంత్రి శ్రీధర్​బాబు విజ్ఞప్తి చేశారు. కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెమీ కండక్టర్ మిషన్ పురోగతిపై ఆయన అభినందనలు తెలిపారు. వచ్చే నెల 24న హైదరాబాద్ లో నిర్వహించనున్న బయో ఏషియా సదస్సుకు హాజరు కావాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను ఈ సందర్భంగా కోరారు.

Advertisement

Next Story