ఈడీ నుంచి మళ్లీ కవితకు పిలుపు?

by samatah |   ( Updated:2023-06-13 14:28:31.0  )
ఈడీ నుంచి మళ్లీ కవితకు పిలుపు?
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసే చాన్స్ ఉన్నది. గత ఏడాది కాలంలో ఆమె వినియోగించిన మొబైల్ ఫోన్లలోని డేటాను రికవరీ చేయడంపై ఈడీ అధికారులు ప్రస్తుతం దృష్టి పెట్టారు. ఆమె తరఫున హాజరైన న్యాయవాది సోమా భరత్ సమక్షంలో ఫోన్లను ఓపెన్ చేస్తున్న అధికారులు అందులో ఉన్న డేటాతో పాటు డిలీట్ అయిన డేటాను రిట్రీవ్ చేస్తున్నట్టు ఈడీ వర్గాల సమాచారం. ఇందుకోసం సాంకేతికంగా ఫోరెన్సిక్ నిపుణుల నుంచి ఈడీ ఆఫీసర్లు సాయం తీసుకుంటున్నారు. డేటా రికవరీ కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్నారు. కవిత సమర్పించిన అన్ని ఫోన్లలోని డేటాను రికవరీ చేసిన తర్వాత దానిని విశ్లేషించి ఆమెకు మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చి ఎంక్వయిరీకి పిలవాలనుకుంటున్నట్టు ఆ శాఖ వర్గాల ద్వారా తెలిసింది.

రెండో రోజూ ఫోన్ల ఓపెన్

మంగళవారం ఐదున్నర గంటల కవిత తరఫున వచ్చిన న్యాయవాది సోమా భరత్ సమక్షంలో ఈడీ అధికారులు కవిత సమర్పించిన ఫోన్లలో మూడింటిలోని డేటాను మాత్రమే రిట్రీవ్ చేయగలిగినట్టు తెలిపారు. రెండో రోజున బుధవారం సైతం మరో రెండు ఫోన్లను ఓపెన్ చేసినట్టు తెలిసింది. మిగిలిన ఫోన్లనూ ఆయన సమక్షంలోనే తెరవాలనుకుంటున్నందున మరో రెండు రోజుల పాటు ఆయన ఈడీ ఆఫీసుకు రావాల్సి ఉంటుంది. కానీ అది ఎప్పుడన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. అన్ని ఫోన్లలోని డేటాను రికవరీ చేసిన తర్వాత వాటిని అధికారులు విశ్లేషించి అనంతరం వాటికి సంబంధించిన అంశాలపై కవితను ప్రశ్నించే చాన్స్ ఉన్నది. డేటాలో లిక్కర్ స్కామ్‌లో నిందితులు లేదా అనుమానితులుగా ఉన్నవారితో కవిత జరిపిన సంప్రదింపులు, డాక్యుమెంట్ల షేరింగ్, వాట్సాప్ ద్వారా జరిగిన సంభాషణలు, చాటింగ్ వివరాలు, హోటళ్లలో జరిగిన మీటింగుల్లో పాల్గొనడం తదితరాలపై కవిత నుంచి వివరాలను రాబట్టడం ఈడీ ఎజెండాగా ఉన్నట్టు తెలిసింది.

ఆ ఫోన్లలోని డేటాకు అనుగుణంగా కవితను ఎన్నిసార్లు విచారణకు పిలుస్తారు? ఎన్ని ప్రశ్నలు వేస్తారు? ఏయే అంశాలపై ఆమె నుంచి వివరణ కోరతారనే అంశంపై ఇప్పుడే ఒక అంచనాకు రాలేమని ఈడీ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఇప్పటివరకు నిందితులు, అనుమానితులు, సాక్షుల నుంచి పలు వివరాలు ఈడీ.. ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీలో మార్పులు చేర్పులపై వ్యాపారులు, సౌత్ గ్రూపునకు చెందిన సభ్యులతో జరిగిన సంప్రదింపులే కీలకమని ఈడీ భావిస్తున్నది. సౌత్ గ్రూపు ప్రమేయం విషయమే ఎక్కువ మంది చెప్పడంతో ఈ కేసు దర్యాప్తులో కవిత వాడిన మొబైల్ ఫోన్లలో ముఖ్యమైన డేటా ఉంటుందన్నది ఈడీ వాదన. ఆమె సమర్పించిన పది ఫోన్లలో మెమొరీ సైజుకు అనుగుణంగా రికవరీ ప్రక్రియకు సమయం పడుతుందని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. డేటాను ఫోన్ల నుంచి రికవరీ చేయడం ఒక ప్రాసెస్ అయితే దానిని కేటగిరీవారీగా వేరుచేసి అధ్యయనం చేయడం మరో ప్రక్రియ కావడంతో దానికి కొంత సమయం పట్టే చాన్స్ ఉందని తెలిపాయి. ఆ డేటాను స్టడీ చేసి పూర్తి స్థాయిలో విశ్లేషించిన తర్వాత కవిత నుంచి ఏయే వివరాలను రాబట్టాలదనేది డిసైడ్ అవుతుందని పేర్కొన్నాయి. ఈ కేసుకు సంబంధించి కవిత నుంచి వివరాలను తెలుసుకోవాలంటే కచ్చితంగా ఆమెను ఎంక్వయిరీకి పిలవక తప్పదని నొక్కిచెప్పాయి. అందుకోసం నోటీసులు ఎప్పుడు ఇవ్వాలనేది ఇన్వెస్టిగేషన్ అధికారులు డిసైడ్ చేస్తారని తెలిపాయి. అన్ని ఫోన్లలోని డేటాను రికవరీ చేసి స్టడీ చేసిన తర్వాత పిలుస్తారా.. లేక ఇప్పటివరకు సేకరించిన వాటిని విడివిడి టీమ్‌లు స్టడీ చేసేలా వర్క్ డివిజన్ చేసుకుని వెంటనే పిలుస్తారా? అనేది సంబంధిత అధికారులు నిర్ణయం తీసుకుంటారని తెలిపాయి. ఆమెను విచారించే ప్రక్రియపై ఇన్వెస్టిగేషన్ అధికారులు రూపొందించుకునే యాక్షన్ ప్లాన్‌కు అనుగుణంగా అధికారుల డెసిషన్ ఉంటుందని పేర్కొన్నాయి. ఫోన్లలో డేటా దొరికినట్లయితే ఆమెను ప్రశ్నించే ప్రక్రియ ఒక లాగ ఉంటుందని, దొరక్క పోతే మరోలా ఉంటుందని, కానీ ఆమెను ఎంక్వయిరీకి పిలవడం మాత్రం అనివార్యమన్న అభిప్రాయాన్ని ఆ వర్గాలు వ్యక్తం చేశాయి.

డాక్యుమెంట్లను సమర్పించిన బుచ్చిబాబు

లిక్కర్ స్కామ్ దర్యాప్తులో భాగంగా ఇప్పటికే కవిత వ్యక్తిగత మాజీ ఆడిటర్ బుచ్చిబాబును పలుమార్లు విచారణకు పిలిచి వివరాలను సేకరించిన ఈడీ అధికారులు.. ఆయనను బుధవారం మరోసారి పిలిచారు. గత విచారణ సందర్భంగా అడిగిన కొన్ని డాక్యుమెంట్లను తాజాగా ఆయన సమర్పించారు. సౌత్ గ్రూపులోని కొద్దిమందికి ఆర్థికపరమైన సలహాలు, సూచనలు ఇవ్వడానికి మాత్రమే తాను పరిమతమయ్యానే తప్ప ఇందులో తనకు వ్యాపార భాగస్వామ్యమో లేక లాభార్జనో లేదని ఈడీ అధికారులకు ఆయన ఇప్పటికే స్పష్టత ఇచ్చినట్టు తెలిసింది. ఒక ప్రొఫెషనల్ ఆడిటర్‌గా వారిని తాను క్లయింట్‌లుగా మాత్రమే భావించానే తప్ప లిక్కర్ వ్యాపారంలోకి ఒక బిజినెస్‌‌మెన్‌ అవతారమెత్తాలనే ఆలోచన తనకు లేదనే విషయాన్ని అధికారులకు ఆయన స్పష్టం చేసినట్టు తెలిసింది. వారితో తనకు ఉన్నది ప్రొఫెషనల్ సంబంధమే తప్ప బిజినెస్ రిలేషన్ కాదని నొక్కిచెప్పినట్టు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed