ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బిగ్ ట్విస్ట్.. MLC కవితపై సంచలన అభియోగాలు మోపిన ఈడీ!

by Satheesh |   ( Updated:2023-05-01 13:14:13.0  )
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బిగ్ ట్విస్ట్.. MLC కవితపై సంచలన అభియోగాలు మోపిన ఈడీ!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలను ఈడీ వెలుగులోకి తెచ్చింది. మాగుంట రాఘవరెడ్డి, అరుణ్ రామచంద్రన్ పిళ్ళై స్టేట్‌మెంట్లతో ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో దాఖలు చేసిన రెండు వేర్వేరు చార్జిషీట్లలో వీటిని ఈడీ ప్రస్తావించింది. సౌత్ గ్రూపులో ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉన్నట్లుగానే భూముల కొనుగోళ్ళలో ఆమె భర్త అనిల్ పాత్ర ఉన్నట్లు పేర్కొన్నది.

ఢిల్లీలో లిక్కర్ బిజినెస్ ద్వారా చేతులు మారిన డబ్బుతో, రాజకీయ పలుకుబడితో కిక్ బ్యాక్ ముడుపులు, భూముల కొనుగోళ్ళు జరిగినట్లు ఈడీ ఆరోపించింది. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ పెద్దలకు సౌత్ గ్రూపు ద్వారా ముట్టిన రూ. 100 కోట్లు హవాలా మార్గంలోనే వెళ్ళినట్లు పేర్కొన్నది. ఇటీవల దాఖలు చేసిన రెండు చార్జిషీట్లను స్పెషల్ కోర్టు సోమవారం పరిగణన (కాగ్నిజెన్స్)లోకి తీసుకున్న తర్వాత ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

మద్యం వ్యాపారంతో పాటు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అనేక కీలక అభియోగాలను ఈడీ ఈ చార్జిషీట్లలో వెల్లడించింది. మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు రాఘవ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, అరబిందో ఫార్మా ఫుల్‌టైమ్ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డిలతో కూడిన సౌత్ గ్రూప్ రూ. 100 కోట్ల ముడుపులు హవాలా రూపంలోనే ఇచ్చిందని పేర్కొన్నది.

ముడుపులు ఇచ్చి అనుకూలంగా మద్యం విధానం వుండేలా చూసుకుని హోల్‌సేల్, రిటైల్ వ్యాపారంలో సౌత్ గ్రూప్ భారీగా లబ్ది పొందిందని ఆరోపించింది. హవాలా రూపంలో నగదు బదిలీ, ముడుపులు చెల్లింపుతో పాటు వట్టినాగులపల్లిలో భూముల కొనుగోళ్ళ వ్యవహారాలను ఈడీ ప్రస్తావించింది. ఇందుకు సంబంధించి పలువురి మధ్య చోటుచేసుకున్న ముఖ్యమైన వాట్సాప్, సిగ్నల్, ఈ-మెయిల్, కాల్‌డేటా, హోటల్ రికార్డులను జత చేసింది.

అరుణ్ రామచంద్రన్ పిళ్ళై, బుచ్చిబాబు, మాగుంట రాఘవ తాజాగా వెల్లడించిన కీలక సమాచారాన్ని ఛార్జ్ షీటులో పొందుపరిచింది. వీటిల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనిష్ సిసోడియా, వైఎస్ఆర్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు రాఘవ, ఎమ్మెల్సీ కవితపై పలు కొత్త సంచలన అంశాలను వివరించింది. తొలిసారి ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ పేరును కూడా ప్రస్తావించింది.

ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో బినామీల పేర్లతో మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్సీ కవిత బిజినెస్ చేశారని ఆరోపించింది. ఎంపీ మాగుంట తరపున ప్రేమ్ రాహుల్ బినామీగా వ్యవహరించారని, కవితకు అరుణ్ రామచంద్రన్ పిళ్ళయ్ బినామీగా ఉన్నారని పేర్కొన్నది. ఇండో స్పిరిట్ కంపెనీలో ఎంపీ మాగుంట, ఎమ్మెల్సీ కవిత ప్రతినిధులుగా ప్రేమ్ రాహుల్, అరుణ్ రామచంద్రన్ పిళ్ళై ఉన్నారని వివరించింది.

ఇండో స్పిరిట్ కంపెనీలో తన తరఫున వాటాదారుడిగా అరుణ్ పిళ్ళైకు పెట్టుబడి డబ్బులను సమకూర్చింది ఎమ్మెల్సీ కవిత అని పేర్కొన్నది. ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో ఇండో స్పిరిట్ కంపెనీ దాదాపు రూ. 192 కోట్లు లాభాలు ఆర్జించిందని ఉదహరించింది. ఆ రూపంలో వచ్చిన లాభాలను వేరే చోట్ల ఇతర మార్గాల రూపంలో పెట్టబడులు పెట్టారని పేర్కొన్నది. ముడుపులు ఇచ్చి అక్రమంగా లబ్ది పొందడం, అక్రమ లబ్ది ద్వారా ఆర్థిక వ్యవహారాలు చట్ట విరుద్ధమని వ్యాఖ్యానించింది.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలతో ఎమ్మెల్సీ కవితకు ఒప్పందం కుదిరిందని ఆరోపించింది. మాగుంట శ్రీనివాస్ రెడ్డి, కవిత పలుమార్లు సమావేశమై ఢిల్లీ లిక్కర్ బిజినెస్ గురించి చర్చించారని కొన్ని ఆధారాలను చార్జిషీట్‌తో జతపరిచింది. మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు రాఘవపై కీలక అభియోగాలనే మోపింది. ఢిల్లీ మద్య వ్యాపారంలో భారీగా బిజినెస్ చేసేందుకు మాగుంట శ్రీనివాసులురెడ్డి ప్రయత్నాలు చేశారని ఆరోపించింది.

అరవింద్ కేజ్రీవాల్‌తో మాగుంట శ్రీనివాస్ రెడ్డి పలుమార్లు భేటీ అయ్యారని పేర్కొన్నది. లిక్కర్ స్కామ్ నిందితులు, పాత్రధారులు, సూత్రధారులతో మాగుంట శ్రీనివాసులురెడ్డి నడిపిన వ్యవహారాలకు సంబంధించి కీలక ఆధారాలను జతచేసింది. కీలక ప్రాంతంలో వ్యాపారం కోసం మాగుంట పెద్ద ఎత్తున లాబీయింగ్ చేశారని పేర్కొన్నది. ఢిల్లీలోని మాగుంట అధికారిక నివాసం, హోటళ్ళు, ఇతర ప్రాంతాల్లో జరిగిన సమావేశాల గురించి ప్రస్తావించింది.

కవితపై సంచలన అభియోగాలు

లిక్కర్ స్కామ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు ముట్టిన ముడుపులన్నీ కవిత ఇచ్చినవేనని ఈడీ ఆరోపించింది. ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో వచ్చిన లాభాలతో కవిత అరుణ్ పిళ్ళై ద్వారా హైదరాబాద్‌లో భూములు కొన్నారని, ఆయన తన భార్య పేరు మీద గతేడాది అక్టోబరులో రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపించింది. భూముల కొనుగోలుకు పిళ్ళై బ్యాంకు అకౌంట్ల ద్వారానే నగదు లావాదేవీలు జరిగాయన్నది. హైదరాబాద్‌లో కవిత మూడు ఆస్తులు కొనుగోలు చేశారని ఆరోపించింది.

తనకు వున్న రాజకీయ పలుకుబడి కారణంగా తక్కువ రేటుకు కవిత భూములు దక్కించుకున్నారన్నది. ఈడీ ఛార్జిషీటులో కవితతో పాటు ఆమె భర్త అనిల్ కుమార్ పేరును కూడా ప్రస్తావించింది. ఫీనిక్స్ గ్రూపునకు చెందిన ఎన్‌గ్రోత్ కాపిటల్ అనే కంపెనీ నుంచి ఈ భూములను కొనుగోలు చేసినట్లు పేర్కొన్నది. ఈ కంపెనీలో ఫీనిక్స్ సీఓఓగా వ్యవహరిస్తున్న శ్రీహరితో పాటు ఆ సమయంలో కవిత భర్త అనిల్ కూడా వ్యాపార భాగస్వామిగా ఉన్నట్లు తెలిపింది.

ఈడీ ఛార్జిషీటులో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఫీనిక్స్ పేరు ప్రస్తావించింది ఈడీ. లిక్కర్ లాభాలతో భూములు కొనేందుకు కవితకు ఫీనిక్స్ కంపెనీకి చెందిన శ్రీహరి సహకరించారని పేర్కొన్నది. భూముల కొనుగోలు సంబంధించిన విషయాలను పిళ్ళై, బుచ్చిబాబు వారి వాంగ్మూలాల్లో పేర్కొన్నారన్నది. ఈ ఛార్జీషీట్లలో మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాఘవ, కవిత, శరత్ చంద్రారెడ్డి తదితరులతో పాటు అరుణ్ రామచంద్రన్ పిళ్ళై, బుచ్చిబాబు, అభిషేక్ బోయిన్ పల్లి, మరికొందరు తెలుగు వ్యక్తులు, సంస్థల పేర్లను కూడా ప్రస్తావించింది.

కవిత భర్త ఆర్ అనిల్ కుమార్, కవిత సన్నిహితుడు సృజన్ రెడ్డి, కవిత సన్నిహితుడు వెన్నమేని శ్రీనివాసరావు, ముత్తా గౌతమ్, ఫీనిక్స్ కంపెనీకి చెందిన శ్రీహరి, తక్కళ్ళపల్లి లుపిన్ , జీఎంఆర్ కంపెనీకి చెందిన నాగేశ్వర్ రావు , రవిశంకర్ చిట్టి, దండు రాజేష్, రవివర్మ రాజు, కేవీఎస్‌పీ రాజు, అనిల్ రాజు తదితరుల పేర్లను పేర్కొన్నది. ఫీనిక్స్ గ్రూపు, ఎన్ గ్రోత్ క్యాపిటల్, క్రియేటివ్ డెవలపర్స్, ఆంధ్ర ప్రభ పబ్లికేషన్స్, ఇండియా హెడ్ లాంటి కంపెనీలను కూడా ప్రస్తావించింది.

Read more:

సీఎం కేసీఆర్ పాలనలో దేశానికే దిక్సూచిగా తెలంగాణ : మంత్రి హరీష్ రావు

Advertisement

Next Story

Most Viewed