Eatala Rajender: కేటీఆర్ విమర్శలు ఆ పూట వార్తల కోసమే.. ఈటల కౌంటర్

by Prasad Jukanti |   ( Updated:2025-02-01 13:22:40.0  )
Eatala Rajender: కేటీఆర్ విమర్శలు ఆ పూట వార్తల కోసమే.. ఈటల కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ నుంచి కాంగ్రెస్, బీజేపీ (BJP) లకు 16 మంది ఎంపీలు ఉన్నా బడ్జెట్‌లో రాష్ట్రానికి తీసుకువచ్చింది గుండు సున్నా.. అని కేటీఆర్ (KTR) చేసిన విమర్శలపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అవగాహన ఉన్నవారి గురించి ఏదైనా మాట్లాడగలం.. కానీ వార్తల కోసం మాట్లాడే వారి గురించి ఏం మాట్లాడుతామని విమర్శించారు. ఇవాళ ఢిల్లీలో ఈటల మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాల ఫలితాలను ప్రజలు అర్థం చేసుకుని దేశవ్యాప్తంగా పట్టం కడుతుంటే అది చూసి ఓర్వలేని వారు మాత్రమే బడ్జెట్‌పై (Union Budget 2025-26) విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, జల్ జీవన్ మిషన్ వంటి కార్యక్రమాలు అందరికీ ఉపయోగపడతాయని, స్పెషల్‌గా రాష్ట్రాలకు ఉండవని స్పష్టంచేశారు. కాంగ్రెస్ పట్ల ప్రజల్లో విపరీతమైన ద్వేషభావం కలుగుతోందని చెప్పారు. ప్రజల వ్యతిరేకత ఎమ్మెల్యేలకు అర్థం అవుతోంది కాబట్టే సొంత పార్టీలోని ఎమ్మెల్యేలు నిరనస తెలుపుతున్నారని చెప్పారు. అతి తక్కువ కాలంలో ప్రజల్లో తేలిపోయింది ఈ కాంగ్రెస్ (Congress) ప్రభుత్వమేనని ఎద్దేవా చేశారు. కూట్లె రాయి తీయనోడు ఏట్ల రాయి తీసిన చందంగా కాంగ్రెస్ పరిస్థితి ఉందన్నారు. బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్ తీరును చూసిన ప్రజలు ఇక బీజేపీని గెలిపించాలని చూస్తున్నారని తెలిపారు.

ఇది ప్రజల బడ్జెట్..

ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రజల బడ్జెట్ ప్రవేశపెట్టిందని ఈటల అన్నారు. పేదలు, మధ్యతరగతి ప్రజల గురించి ఆలోచిస్తున్న నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ అని కొనియాడారు. ఈ బడ్జెట్ యువతకు వరంగా మారుతుందన్నారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్రం పెట్టుబడి సాయం అందిస్తున్నదని గుర్తుచేశారు. ఈ దేశంలో గ్రీన్ ఎనర్జీ పెంచేందుకు విండ్, సోలార్ ఎనర్జీని సబ్సిడీలతో ప్రోత్సహిస్తోందని తెలిపారు. తెలంగాణలో బొగ్గుగనులు ఉన్న ప్రాంతాలు బొందల గడ్డగా మారిపోయాయని, భూగర్భజలాలు అడుగంటిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. భూకంపాలు వచ్చే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం, దేశ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని బొగ్గుతో తయారయ్యే ఎనర్జీని కాదని గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తే ప్రతిపక్షాలు స్వాగతించకపోవడం బాధాకరమని విమర్శించారు.


Next Story

Most Viewed