గులాబీ తోటలో ఆధిపత్య పోరు .. నేతల స్వరాల్లో మార్పు దేనికి సంకేతం!

by Nagaya |   ( Updated:2022-12-07 12:51:37.0  )
గులాబీ తోటలో ఆధిపత్య పోరు .. నేతల స్వరాల్లో మార్పు దేనికి సంకేతం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఓ వైపు నుంచి బీజేపీ ఎదురుదాడి రోజు రోజుకు తీవ్రతరం అవుతుంటే మరో వైపు పార్టీ నేతల స్వరాల్లో వస్తున్న మార్పు సర్వత్రా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. రెండో దఫా అధికారంలో కొనసాగుతున్న టీఆర్ఎస్ లో పార్టీ అధినేత కేసీఆర్ దే ఫైనల్ డిసిషన్. ఆయన గీసే గీతను దాటేందుకు పార్టీలో ఎవరూ సాహసించరనేది టాక్. ఇన్నాళ్లు ఇదే జరుగుతూ వచ్చింది. పదవులు రాకున్నా, అవమానాలు జరిగినా ఓపిక వహించిన గులాబీ నేతలు ఎక్కడా పార్టీ లైన్ దాటలేదు. ఒక వేళ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన పరిస్థితే వస్తే ఏకంగా ఆ పార్టీకి రాజీనామా చేసి వచ్చేశారే తప్పా పార్టీలో కొనసాగుతూనే కేసీఆర్ కు వ్యతిరేకంగా కామెంట్స్ వ్యక్తం అయిన ఘటనలో చాలా అరుదు.

అయితే వచ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆలోపే కేసీఆర్ ముందస్తుకు వెళ్తాడని బీజేపీ, కాంగ్రెస్ నేతలు పదే పదే ప్రస్తావిస్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ముందస్తు ఆలోచన లేదని పూర్తి కాలం తమ ప్రభుత్వం ఉంటుందని చెప్పుకొస్తున్నారు. రాజకీయాల్లో నేతల మాటలకు గ్యారెంటీ లేదన్న చందంగా ముందస్తు విషయంలో కేసీఆర్ వ్యాఖ్యలను నమ్మలేమని ఆయన తప్పకుండా ముందస్తుకే వెళ్తారనే ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతోంది. ఇదిలా ఉంటే ఎన్నికలకు సమయం దగ్గరకు వస్తున్నాకొద్ది పార్టీ నేతల స్వరాల్లో వస్తున్న మార్పులు ఆసక్తిగా మారుతున్నాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే గనుక అది మొదటికే మోసం తప్పదనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం పార్టీలో రెండు రకాల నాయకులు తరచూ మీడియా ముందుకు వస్తున్నారు. వారిలో ఓ రకం తమకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కేసీఆర్ ను విడిచేది లేదని చెప్పేవాళ్లు.

తాజాగా అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. చావనైనా చస్తా కానీ కేసీఆర్ ను వదిలి వెళ్లబోయేది లేదని పోచారం చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఇటీవల మంత్రి మల్లారెడ్డి సైతం ఇలాంటి కామెంట్సే చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా టీఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టేది లేదని అన్నారు. వీరితో పాటు అనేక మంది ఎమ్మెల్యేలు, మంత్రులు కేసీఆర్ పట్ల విధేయతను నిత్యం చూపుతూనే ఉన్నారు.

ఇంతవరకు బాగానే ఉన్నా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్ పక్షాన ఉంటానని వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే కొల్లాపూర్ టీఆర్ఎస్ లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ నియోజకవర్గంలో ఆత్మీయ సమావేశం పేరుతో జూపల్లి నిర్వహించిన కార్యక్రమం టీఆర్ఎస్ పార్టీలో కాకరేపుతోంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ నాయకులు హాజరు అయ్యారనే ప్రచారం జరుగుతోంది. దీంతో గత కొంత కాలంగా పార్టీ వైఖరిపట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న జూపల్లి తప్పు ఎవరు చేసినా తప్పేనని అది అధికార పార్టీ నాయకులైనా ప్రతిపక్ష పార్టీ నాయకులైనా ప్రశ్నించాల్సిందేనన్నారు. దీంతో ఆయన పార్టీ మార్పు విషయంలో త్వరలో ఓ నిర్ణయం తీసుకోబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.

అలాగే ఆయన మాదిరిగానే ఉమ్మడి ఖమ్మంలో మరో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పరిస్థితి ఉంది. ఆయనకు అక్కడ టీఆర్ఎస్ పార్టీలో పొసగడం లేదు. ఇలా ఎక్కడైతే పార్టీలో ఇన్నాళ్లు అసంతృప్తిగా ఉన్న నేతలంతా ఒక్కొక్కరుగా స్వరం పెంచడం టీఆర్ఎస్ లో హాట్ టాపిక్ అవుతోంది. ఓ వైపు కేసీఆర్ కోసం చావడానికైనా సిద్ధం అనే వ్యాఖ్యలు వినిపిస్తుంటే మరో వైపు తప్పు చేస్తే ఎవరినైనా నిలదీయాల్సిందే అంటున్న సొంత పార్టీ నేతల తీరు పార్టీని ఏ తీరం చేర్చుతుందో అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంలో కేసీఆర్, కేటీఆర్ ఎలా రియాక్ట్ అవుతారనేది ఉత్కంఠగా మారుతోంది.

Read more:

జగిత్యాల టీఆర్ఎస్ నాయకుల తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ... కేసీఆర్ ఆగ్రహం?

సీఎంనైనా నిలదీస్తా: మాజీమంత్రి Jupally Krishna Rao సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story

Most Viewed