అడ్డదారులు తొక్కిన డీఎస్సీ అభ్యర్థులు.. ఫేక్ సర్టిఫికెట్లతో టీచర్ ఉద్యోగాలు!

by Shiva |   ( Updated:2025-02-11 05:42:30.0  )
అడ్డదారులు తొక్కిన డీఎస్సీ అభ్యర్థులు.. ఫేక్ సర్టిఫికెట్లతో టీచర్ ఉద్యోగాలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తొలి ఏడాదిలో 11 వేల టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయగా.. అందులో కొందరు అనర్హులు నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి ప్రభుత్వ కొలువులు కొట్టేసినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం సైతం ధ్రువీకరించినట్టు తెలిసింది. దీంతో దొడ్డిదారిన టీచర్ ఉద్యోగాలు సాధించిన వారి భరతం పట్టేందుకు ప్రభుత్వ ఆదేశాలతో విద్యాశాఖ అడుగులు వేస్తున్నది. పలువురు అనర్హులు దొడ్డిదారిన ప్రభుత్వ వర్గాలను మాయచేసి ఉద్యోగాలు పొందినట్టు తృటిలో ఉద్యోగాలు మిస్సయిన డీఎస్సీ అభ్యర్థులు పెద్దఎత్తున ఆరోపించారు.

వారికి ఒంట్లో వణుకు..

బోగస్ సర్టిఫికెట్లతో టీచర్ కొలువులను దక్కించుకున్న వారిలో వణుకు మొదలైనట్టు టాక్. గతేడాది రాష్ట్ర సర్కార్ మెగా డీఎస్సీ ద్వారా 11వేల టీచర్ ఉద్యోగాలను భర్తీ చేసింది. 60 రోజుల్లోనే ఈ ప్రక్రియను వేగంగా పూర్తిచేసింది. క్షేత్ర స్థాయిలో అధికారులు అభ్యర్థుల ధ్రువ పత్రాలను పరీశీలించకుండా ఉద్యోగాలు ఇచ్చారని విద్యాశాఖ, డీఎస్సీ బోర్డుపై ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.

ఇంటెలిజెన్స్ నివేదికలతో గుట్టురట్టు

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయడంలో నిర్లక్ష్యం చేసిన విషయం తెలిసిందే. దీంతో, రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలను భర్తీ చేసింది. అందులో ప్రభుత్వ టీచర్ కొలువులు 11వేలు ఉన్నాయి. చాలా జిల్లాల్లో అర్హులకు వచ్చిన ర్యాంకుల ప్రకారం ఉద్యోగాల భర్తీ జరగలేదని, పలువురు డీఎస్సీ అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు అందాయి. కొన్ని చోట్ల డీఎస్సీ అభ్యర్థులు ఆయా జిల్లాల కలెక్టర్లను నిలదీసిన ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ప్రభుత్వ వర్గాలు జోక్యం చేసుకున్నాయి. మెగా డీఎస్సీలో చాలామంది ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాల్లో చేరినట్టు ఇంటెలిజెన్స్ నివేదికలు ప్రభుత్వానికి చేరాయి. దీంతో విద్యాశాఖ అధికారులు అప్రమత్తమై.. గత రెండు, మూడు నెలలుగా డిపార్ట్‌మెంటల్ విచారణ చేపట్టారు. కొత్తగా టీచర్ ఉద్యోగాల్లో చేరిన వారి వద్దకు వెళ్లి.. వారి సర్టిఫికెట్లను పరిశీలిస్తున్నారు.

నకిలీ బోనాఫైడ్‌తో వెలుగులోకి..

మెగా డీఎస్సీలో కొందరు ఫేక్ స్పోర్ట్ సర్టిఫికెట్స్ పెట్టి ఉద్యోగాలు పొందితే, మరికొందరు నకిలీ బోనాఫైడ్‌లతో జాబ్స్ దక్కించుకున్నారని తేలినట్టు సమాచారం. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఎక్కువగా నకిలీ బోనాఫైడ్ సర్టిఫికెట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇక మరికొందరైతే డీఎడ్, బీఎడ్ ధ్రువపత్రాలు సైతం నకిలీవి సృష్టించి వాటితో ఉపాధ్యాయ కొలువులను సంపాదించారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు చేసేవారు సైతం ఫేక్ సర్టిఫికెట్లతో టీచర్ కొలువును దక్కించుకున్నారు. వీరే కాదు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లలోనూ కొన్ని బోగస్ ఉన్నట్లు విద్యాశాఖ అధికారుల దృష్టికి రావడంతో క్షేత్ర స్థాయిలో అధికారులు రంగంలోకి దిగి అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తున్నారు. ఈ బాధ్యతలను జిల్లాలో ఉండే డిప్యూటీ డీఈఓలు, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్ అధికారులకు విద్యాశాఖ అప్పగించింది. ఇప్పటికే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన వారి సర్టిఫికెట్లను హైద్రాబాద్‌కు పిలిపించుకుని విద్యాశాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. బోనాఫైడ్, డీఎడ్, బీఎడ్ సర్టిఫికెట్ల విషయంలో కూడా ఆయా స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లి ఎంక్వయిరీ చేస్తున్నారు. వారు చదివే సమయంలో ఆ స్కూల్ వుందా? లేదా.. ఉంటే దానికి అనుమతి ఉందా? లేదా అని వివరాలను సేకరిస్తున్నారు. ఎక్కడైనా చిన్న అనుమానం వచ్చినా.. కొత్తగా ఎంపికైన టీచర్లను వెంటనే పక్కన పెడుతున్నారు. ఈ ప్రక్రియ అంతా స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం అధికారులు రహస్యంగా చేపడుతున్నారు.

ఎంఈఓలు, హెడ్ మాస్టర్ల సస్పెన్షన్..

డీఎస్సీ-2024 ఎఫెక్ట్ ఇప్పటికే విద్యాశాఖ అధికారులపై పడింది. టీచర్ ఉద్యోగాల భర్తీ టైంలో సర్టిఫికెట్లను సరిగ్గా పరిశీలన చేయలేదని ఆరోపణలు రావడంతో ఖమ్మం, హైదరాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లోని ఎంఈవోలను, హెడ్ మాస్టర్‌లను ఆయా జిల్లా కలెక్టర్లు సస్పెండ్ చేశారు. అక్కడితో ఆగకుండా కొత్తగా నియమితులైన ప్రతి టీచర్‌కూ సంబంధించిన సర్టిఫికెట్లను రహస్యంగా పరిశీలిస్తున్నారు. దీంతో టీచర్లకు, విద్యాశాఖ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఇప్పటికైనా అనర్హులను గుర్తించి వారి స్థానంలో అర్హులైన వారిని భర్తీ చేసి అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

Next Story