‘దిశ’ సక్సెస్‌కు కారణం అదే.. వార్షికోత్సవంలో ఎండీ మోహన్‌రావు

by GSrikanth |
‘దిశ’ సక్సెస్‌కు కారణం అదే.. వార్షికోత్సవంలో ఎండీ మోహన్‌రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా సమయంలో డిజిటల్ ప్లాట్‌ఫారంతో ఉనికిలోకి వచ్చిన ‘దిశ’ మూడేండ్ల కాలంలోనే ప్రధాన మీడియా సంస్థలకు దీటుగా నిలిచిందని, సుమారు 130 మంది సిబ్బంది, 400 మందికి పైగా రిపోర్టర్ల సమిష్టి కృషితోనే ఇది సాధ్యమైందని ప్రశాంతి మీడియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మోహన్‌రావు వ్యాఖ్యానించారు. అనేక పత్రికా సంస్థలు ‘దిశ’ను అనుసరించడం గర్వంగా ఉందని, వినూత్నంగా ప్రారంభించిన డైనమిక్ ఎడిషన్ల విధానం సరికొత్త చరిత్రను సృష్టించిందన్నారు. ‘దిశ’లో నెలకొన్న ప్రజాస్వామిక పని వాతావరణం కూడా విజయానికి కారణమన్నారు. ‘దిశ’ మూడో వార్షికోత్సవం సందర్భంగా సిబ్బందిని ఉద్దేశిస్తూ చేసిన ప్రసంగంలో ఆయన పై వ్యాఖ్యలు చేశారు.


అంతర్జాతీయ మహిళా దినోత్సవ కానుకగా ఇక పైన ‘దిశ’లోని మహిళా ఉద్యోగులందరికీ ప్రతి నెలా అదనంగా ఒక స్పెషల్ (నెలసరి) లీవ్‌ మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. కరోనా సమయంలో మీడియా సంస్థలతో పాటు అనేక వ్యాపార, వాణిజ్య కంపెనీలు, పరిశ్రమలు ఉద్యోగులను తొలగిస్తే ‘దిశ’ మాత్రం అందుకు భిన్నంగా ఉద్యోగాలు కోల్పోయిన జర్నలిస్టులకు సంస్థలో అవకాశం కల్పించడమే కాకుండా.. క్రమం తప్పకుండా నిర్దిష్ట తేదీకే వేతనాలు కూడా చెల్లిస్తున్నదని గుర్తుచేశారు. అతి తక్కువ కాలంలోనే ప్రజల గుర్తింపు పొందిన ‘దిశ’పై సోషల్ మీడియా వేదికగా కొద్దిమంది వ్యక్తులు, కొన్ని సో-కాల్డ్ సంస్థలు విషం చిమ్మాయని గుర్తుచేశారు. కాసే చెట్లకే రాళ్లు పడతాయనే తీరులో వాటికి ప్రాధాన్యం ఇవ్వకుండా ‘వాస్తవం వైపే గమ్యం.. గమనం’ నినాదంతో పయనిస్తున్నామన్నారు.

ఎడిటర్ మార్కండేయ మాట్లాడుతూ.. వివిధ మీడియా సంస్థల్లో తక్కువ అనుభవం ఉండి చిన్న స్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టులను తర్ఫీదు చేసుకున్నామని, మూడేండ్ల కాలంలో వారే ఇప్పుడు ఆయా విభాగాలకు హెచ్ఓడీలుగా పనిచేస్తున్నారని గుర్తుచేశారు. వ్యక్తులపై కాకుండా వ్యవస్థపై ఆధారపడి నడిచేలా ‘దిశ’ను తీర్చిదిద్దడమే తమ ‘సక్సెస్ మంత్ర’ అని గుర్తుచేశారు. భవిష్యత్తులో మరిన్ని మైలురాళ్లను అధిగమిస్తామని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల అభిమానాన్ని పొందేందుకు కష్టపడతామని తెలిపారు. ఆ తర్వాత ‘దిశ’లో పనిచేస్తున్న సిబ్బంది వారి అనుభవాలను వివరించారు. ఈ కార్యక్రమంలో బ్యూరో చీఫ్ విశ్వనాధ్, అసిస్టెంట్ ఎడిటర్ హరీశ్‌, సెంట్రల్ డెస్క్ ఇన్‌చార్జి మహేశ్, నెట్‌వర్క్ ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్, డిజిటల్ హెడ్ కిరణ్‌కుమార్, ఎడిట్ పేజీ ఇన్‌చార్జి రాజశేఖరరాజు, నేషనల్ డెస్క్ ఇన్‌చార్జి స్వామి, ఫీచర్స్ ఎడిటర్ సుజిత, డైనమిక్ డెస్క్ ఇన్‌చార్జి శ్రీకాంత్, వెబ్‌సైట్ ఇన్‌చార్జి నాగయ్య, చీఫ్ ఆర్టిస్ట్ బాలు, ఐటీ ఇన్‌చార్జి అనుకరణ్, అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ సురేశ్ శర్మ, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story