- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తప్పిదాలను ఒప్పుకోని KCR.. BRSకు ‘ధరణి’ షాక్!
దిశ, తెలంగాణ బ్యూరో: భూ పరిపాలనలో అద్భుతమంటూ సీఎం కేసీఆర్ కీర్తించిన ‘ధరణి’ పోర్టల్ ఎన్నికల్లో కీలకంగా మారింది. లక్షలాది మంది ఇబ్బందులు పడుతుంటే గొప్పదంటూ బీఆర్ఎస్ చేసిన ప్రచారం బెడిసికొట్టింది. 33 మాడ్యూళ్లు రూపొందించినా గాడిన పడలేదు. మూడున్నరేండ్లయినా సమస్యల పరిష్కారం కొలిక్కిరాలేదు. కొత్త సమస్యలకు స్వాగతం పలుకుతూనే ఉన్నారు.
అధికారాన్ని కేంద్రీకృతం చేయడం ద్వారా సామాన్యుడి సమస్య పరిష్కారానికి ఏండ్లు పడుతుంది. ఏ తప్పు చేయని పట్టాదారు అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. రూ.లక్షల్లో ఖర్చవుతోంది. ఊళ్లోనే పరిష్కారమయ్యే సమస్య కోసం హైదరాబాద్ దాకా రావాల్సి వచ్చేది. అయినా ధరణి పోర్టల్ గొప్పదంటూ సీఎం కేసీఆర్ పదేపదే వల్లెవేశారు. ప్రతి సభలోనూ ధరణి పోర్టల్ ప్రస్తావన తీసుకురావడమే దెబ్బ తీసింది.
ఏ మంత్రీ, ఏ ఎమ్మెల్యే అభ్యర్థి ఇది సక్సెస్ అంటూ చెప్పలేదు. క్షేత్ర స్థాయిలో లక్షలాది మంది సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిసినా గులాబీ బాస్ మాత్రం లెక్క చేయలేదు. ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పినా ఖాతరు చేయలేదు. ప్రతి సభలోనూ ధరణి పోతే హక్కులు పోతాయని, పటేల్ పట్వారీ వ్యవస్థ వస్తుందంటూ అభూత కల్పనలను ప్రచారం చేశారు. రైతుబంధు రాదంటూ హెచ్చరించారు.
మరోవైపు కాంగ్రెస్, బీజేపీ ధరణి వైఫల్యాలను ఓటర్ల ముందుంచి ఓట్లు రాబట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి. లీఫ్స్, తెలంగాణ సోషల్ మీడియా ఫోరం, ధరణి భూ సమస్యల వేదిక వంటి అనేక సంస్థలు ధరణి లోపాలను ఎండగట్టాయి. వాటికి పరిష్కార మార్గాలను చూపినా బీఆర్ఎస్ అధినేత ఖాతరు చేయలేదు. తాను ఏదైతే చెప్పాలనుకున్నారో.. అదే స్టాండ్ మీద ఉన్నారు. అదే కేటీఆర్ మాత్రం ప్రచారం ఆఖరున ధరణి పోర్టల్‌లో లోపాలు ఉన్నాయని, పరిష్కరిస్తామని ప్రకటించారు.
భూ పరిపాలన అంటే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ మాత్రమే కాదన్న వాస్తవాన్ని గుర్తించకుండా కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని రూపొందించడంతోనే బీఆర్ఎస్ పార్టీకి రైతుల్లో గ్రాఫ్ పడిపోయింది. దానికి తోడు డేటా అప్‌లోడ్ ప్రక్రియలో అధికారులు, సిబ్బంది, సాంకేతిక లోపాల కారణంగా తలెత్తిన సమస్యలన్నింటినీ పట్టాదారుల తప్పిదాలుగా భావించారు. స్వచ్ఛందంగా పరిష్కారం చూపాల్సిన ప్రభుత్వం రైతుల కాళ్లు అరిగేలా తిప్పించుకున్నారు.
మూడున్నరేండ్లుగా అపరిష్కృతంగా సమస్యలను ఉంచడం ద్వారా ఎన్ని కష్టాలు పడుతున్నారన్నది క్షేత్రస్థాయి పరిశీలనలోనే తెలుస్తుంది. అయితే బీఆర్ఎస్ నేతలెవరూ ఆ ప్రక్రియకు పూనుకోలేదు. ఒకటీ రెండు మంత్రివర్గ కమిటీలు వేసి చేతులు దులిపేసుకున్నారు. వారిచ్చిన సిఫారసులను సీఎం కేసీఆర్ ఏనాడూ పట్టించుకోలేదు. దాని పర్యవసానమే నేటి ఫలితాలుగా దర్శనమిస్తున్నాయి.
ముందే హెచ్చరించిన మంత్రులు
ఇన్నాండ్లుగా ధరణి పోర్టల్ అద్భుతమన్నారు. ఇంతటి ఘనమైన సాంకేతిక నైపుణ్యం కలిగిన రెవెన్యూ వ్యవస్థ మరెక్కడా లేదన్న అధినేత మాటను ధిక్కరించలేకపోయారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. డిజిటలైజేషన్‌లో అనేక లోపాలు తలెత్తాయి. పైగా పోర్టల్‌లో సమస్యల పరిష్కారానికి సరైన మార్గాలే లేవు. నెలల తరబడి తిరుగుతున్నా కనీసం తప్పు పడిన విస్తీర్ణాన్ని సవరించడానికి అవకాశాల్లేవు.
చాలా కాలంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు భూ సమస్యలు పరిష్కరించండంటూ జనం మొత్తుకున్నారు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీలు రాజకీయంగా అస్త్రశస్త్రాలుగా వాడుతున్నాయి. దాంతో ఇటీవల సీఎం కేసీఆర్‌ను కలిసిన కొందరు మంత్రులు ధరణి పోర్టల్ వైఫల్యాలను వివరించారు. ధరణి పోర్టల్ ముందు కన్నా ఇప్పుడే సమస్యలు అనేకం పెరిగినట్లు బాస్‌కు ఏకరవు పెట్టారు.
ధరణి పోర్టల్ చిక్కులు పార్టీకి చుట్టుకుంటుందని తేల్చిచెప్పినట్లు తెలిసింది. ఇలాగైతే రానున్న రోజుల్లో పార్టీకి గ్రామాల్లో కష్టమవుతుంది. మెరుగైన భూ పరిపాలనను తీసుకొచ్చామని చెప్పుకునేందుకు అవకాశం లేదని, ఎవరూ ట్యాంపరింగ్ చేయలేని వ్యవస్థను రూపొందించామని చెప్పుకోవడానికి వీల్లేకుండాపోయింది. అనేకాంశాలపై సీఎం కేసీఆర్‌కు మంత్రులు ముందుగానే వివరించారు.
అయితే కొందరు ఉన్నతాధికారులు మూడున్నరేండ్లుగా ధరణి పోర్టల్ ద్వారా అద్భుతమైన సేవలందుతున్నాయని తప్పుడు రిపోర్టులు సమర్పించారన్న ఆగ్రహం ఉన్నది. అంతా బాగుంటే లక్షలాదిగా దరఖాస్తులు ఎందుకొస్తున్నాయన్న విషయాన్ని గులాబీ బాస్‌కు చెప్పకుండా దాచారు. ఇన్నేసి వైఫల్యాల మధ్య అద్భుతమని స్వయంగా కీర్తించిన సీఎం కేసీఆర్ ‘ధరణి’ ఫలితాలపై ప్రభావాన్ని చూపించిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఖండించని బీఆర్ఎస్
భూ కబ్జాలకు, అక్రమాలకు ధరణి పోర్టల్ పునాది రాయి వేసిందంటూ కాంగ్రెస్, బీజేపీలు రాజకీయంగా వాడుకుంటున్నాయి. ప్రతి సభ, సమావేశంలోనూ రూ.లక్ష కోట్ల భూ దందా చేశారంటూ ఆరోపణలు చేశాయి. ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాతే భూ పరిపాలన బాగుందంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేయలేకపోయారు.
వాళ్లల్లోనే చాలా మంది ధరణి బాధితులుగా ఉన్నామని బహిరంగంగానే అంగీకరించారు. ఇంటర్ విద్యార్థుల చావుకు కారణమైన గ్లోబరీనా సంస్థకు కొన్నాళ్లు, తర్వాత ఐఎఫ్ఎల్ఎస్ సంస్థకు, ఆపై మరో కంపెనీకి ఇచ్చారని ప్రచారం జరిగింది. దేశంలోనే మేలైన ఎన్ఐసీ వంటి వ్యవస్థను ఎందుకు వాడుకోవడం లేదన్న ప్రజాసంఘాల ప్రశ్నలకు ఎవరూ సమాధానం ఇవ్వలేదు. సున్నితమైన ప్రజల డేటా తస్కరణకు గురైతే బాధ్యత ఎవరిదన్న అనుమానాలు ఉన్నాయి.
విదేశీ కంపెనీ చేతుల్లో ఆ డేటా ఎంత వరకు భద్రం అన్న చర్చ నడుస్తున్నది. రేపేదైనా అనుకోని సాంకేతిక సమస్య వచ్చి డేటా మానిపులేషన్, కరప్ట్ అయితే దానికి బాధ్యులు ఎవరు? మన దగ్గర స్టేట్ డేటా సెంటర్ ఏమైంది? ఇక్కడ సర్వర్లు సరిపోవా? ప్రపంచంలో ఐటీకి గుర్తింపు పొందిన హైదరాబాద్‌లో ఆ స్థాయి కంపెనీలు, నిర్వహణ ఏజెన్సీలు లేవా? అన్న ప్రశ్నలకు బీఆర్ఎస్ నుంచి ఒక్కదానికీ సమాధానం రాలేదు.
Read more : BRSకు దిమ్మదిరిగే షాక్.. ఆరుగురు ఎమ్మెల్యేల ఓటమికి కారణాలివే..!