- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Dharani: ‘ధరణి’ ఓవర్ లోడ్..! నెల రోజులుగా సతాయిస్తున్న పోర్టల్

దిశ, తెలంగాణ బ్యూరో: ధరణి పోర్టల్ నెల రోజులుగా సతాయిస్తున్నది. స్లాట్స్ బుక్ కావడం లేదు. డేటా సెర్చ్ చేస్తే వేరే వివరాలు వస్తున్నాయి. రిజిస్ట్రేషన్లు వెరీ స్లో అయ్యాయి. దీనికి కారణాలేమిటి? అసలు ధరణి పోర్టల్‌ను ప్రొఫెషనల్‌గానే బిల్డ్ చేశారా? తాము మాత్రమే మెయింటేన్ చేసేటట్లుగా రూపొందించారా? మరెవరికీ టెక్నికల్ ఇష్యూస్ సాల్వ్ చేసే వెసులుబాటు లేకుండా చేశారా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. ఈ సాఫ్ట్‌వేర్‌ను టెర్రాసిస్ అనే విదేశీ కంపెనీ తయారు చేయగా.. మరొకరు మెయింటేన్ చేసేందుకు వీలు లేకుండా రూపొందించారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
అన్ ప్రొఫెషనల్ పోర్టల్
ఒకాయన వంద గజాల్లో సకల సదుపాయాలతో ఇంటిని నిర్మించాడు. తర్వాత పిల్లలకు పెళ్లిళ్లు, కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగిపోతుండడంతో అదనపు గదులు, అంతస్తుల మీద అంతస్తులు నిర్మించుకుంటూ పోయాడు. దీంతో గదులు ఇరుకుగా మారాయి. గాలి, వెలుతురు లేదు. డ్రైనేజీ క్లియర్ కావడం లేదు. ఫలితంగా కుటుంబ సభ్యులంతా వివిధ రోగాలతో ఆస్పత్రి పాలయ్యారు. కుటుంబం పెరిగినప్పుడు అదనంగా స్థలాన్ని కొని వేరే ఇండ్లు నిర్మించాలి. కానీ అదే స్థలంలో అందరికీ నివాసం కల్పించాలనుకోవడం పెద్ద పొరపాటు. సరిగ్గా ధరణి పోర్టల్ సృష్టికర్తలు చేసింది అదేనని ఓ ఐఏఎస్ అధికారి అభిప్రాయపడ్డారు. ఐదారు మాడ్యూళ్లతో మొదలు పెట్టిన పోర్టల్‌ను 35కు పెంచారు. ఫైళ్ల సంఖ్య పెరిగింది. అనవసరపు డేటా పేరుకుపోయింది. దీంతో పోర్టల్ స్లో అయ్యింది. ధరణి పోర్టల్ ప్రొఫెషనల్‌గా రూపొందించినది కాదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు సాఫ్ట్‌వేర్ ఒక సంస్థ నుంచి మరొక సంస్థ తీసుకోవడానికి కనీసం ఆరు నెలలు పడుతుంది. ఒక టీమ్ మరో టీమ్‌కు ట్రాన్స్‌ఫర్ చేసేందుకు మూడు నెలలు.. తీసుకున్న టీమ్ మెయింటెయిన్ చేసేటప్పుడు పాత టీమ్ పర్యవేక్షించాలి. అది కూడా ప్రైవేటు సంస్థ నుంచి ప్రభుత్వ రంగ సంస్థకు బదిలీ చేయడంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డీల్ చేసే విధానంలో అనేక లోపాలు తలెత్తుతున్నాయి. అందుకే ధరణి పోర్టల్ వెరీ స్లో అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఓ సంస్థ రూపొందించిన వెబ్‌పోర్టల్‌ను మరో సంస్థ నడపడం కష్టమనే అభిప్రాయం నెలకొన్నది.
సెక్యూరిటీ ఆడిట్‌తో..
టెర్రాసిస్ నుంచి ఎన్ఐసీకి డేటా బదిలీ అయ్యింది. ఆ తర్వాత పోర్టల్ కొంత కాలం బాగానే పని చేసింది. కానీ డిసెంబర్ 27వ తేదీ నుంచి పోర్టల్‌లో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. స్లాట్స్ బుక్ కావడం లేదు. ఒక సర్వే నంబర్ కొడితే మరొక సమాచారం వస్తుంది. ఒక ఊరి డేటాని సెర్చ్ చేస్తుంటే మరో జిల్లా వివరాలు దర్శనమిస్తున్నాయి. దీంతో సెక్యూరిటీ ఆడిట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఆధార్ ఎన్‌క్రిప్షన్ చేశారు. దాంతో లోపాలు బయటపడ్డాయని తెలుస్తున్నది. సీసీఎల్ఏలో సీఎమ్మార్వో ప్రాజెక్టు డైరెక్టర్ మందా మకరంద్ నేతృత్వంలో బృందం 24 రోజుల పాటు అవిరాళంగా కృషి చేసింది. టెక్నికల్ ఇష్యూస్‌ని రీసాల్వ్ చేసేందుకు చాలా కష్టపడింది. టెర్రాసిస్ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన సమస్యలను ఎన్ఐసీ టీమ్‌తో సాల్వ్ చేయించడం చాలా కష్టతరమైందని అధికారులు చెబుతున్నారు. మొదట సర్వర్ ప్రాబ్లమ్ అనుకున్నారు. కానీ పాయింట్ టు పాయింట్ మూడు రోజులు రీసెర్చ్ చేస్తే.. సీపీయూ ఇష్యూగా తేలింది. అప్లికేషన్స్, డేటా బేస్, కోడ్, టెక్నికల్ సైడ్, ఓఎస్.. లో తలెత్తిన సమస్యలు. మల్టిపుల్ ఆప్టిమైజేషన్ జరగలేదు. లక్షలాది కోడింగ్ లైన్స్, లక్షలాది టేబుల్స్, అనవసరపు టేబుల్స్, కోడింగ్స్‌తోనే భారంగా మారింది. ఇదంతా సెక్యూరిటీ ఆడిట్ ద్వారానే స్పష్టమైందని సమాచారం. ధరణి పోర్టల్ వైఫల్యానికి, స్లో కావడానికి, స్లాట్స్ బుక్ కాకపోవడానికి వంద కారణాలు ఉన్నాయని సీసీఎల్ఏ వర్గాలు అంటున్నాయి. వీటన్నింటినీ సాల్వ్ చేసేందుకు అవిరాళంగా కృషి చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
స్లో కావడానికి అనేక కారణాలు
* పోర్టల్‌లో అవసరానికి మించిన టేబుల్స్ ఉన్నాయి. 500 టేబుల్స్‌తో సరిపోయే స్థానంలో 4,500 వరకు వేశారు.
* డేటా బేస్ ప్రొసీడింగ్స్ సంఖ్య 7 నుంచి 8 వేల వరకు పెంచారు.
* మూడు లక్షల కోడింగ్ లైన్స్ అనుకున్న చోట 30 లక్షలు వినియోగించారు.
* జావా 1.8 వర్షన్‌ను వాడారు. మార్కెట్‌లో 1.23 వెర్షన్ వాడుతున్నారు. అంతేకాకుండా మల్టిపుల్ వర్షన్స్ వాడడంతో గందరగోళం నెలకొన్నది.
* ఐదారు మాడ్యూళ్ల స్థాయిలోనే రూపొందించిన పోర్టల్‌లో ఒక్కో సమస్య ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో సంఖ్యను పెంచారు. 35 మాడ్యూళ్లకు చేర్చారు.
* సాఫ్ట్‌వేర్ డేటా సామర్థ్యం కంటే అధికంగా లోడ్ అయ్యింది. అందుకే ధరణి పోర్టల్ ఓవర్ లోడ్ అయ్యింది. దీంతో వెబ్ సైట్‌లో ఒకటి అడిగితే మరొక సమాచారం వస్తున్నది. స్లాట్స్ బుక్ కావడం లేదు. అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. ఒకటి పరిష్కరిస్తే మరొక ఇష్యూ తలెత్తుతున్నది.
ఆశించిన స్థాయిలో అందని టెర్రాసిస్ సహకారం
ధరణి పోర్టల్‌ను చక్కదిద్దేందుకు సీసీఎల్ఏ సీఎమ్మార్వో పీడీ మంద మకరంద్ నేతృత్వంలో ఎన్ఐసీ బృందం తీవ్రంగా కృషి చేస్తున్నది. అప్లికేషన్స్ ఎన్‌క్రిప్షన్స్, బ్లోటింగ్ ఆఫ్ అప్లికేషన్స్ పర్ఫార్మెన్స్ పెంచుతున్నారు. అయితే టెర్రాసిస్ నుంచి సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌కి సరైన సపోర్ట్ లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అగ్రిమెంట్‌కి భిన్నంగా వ్యవహరించడం లేదు కానీ.. చాలా రోజుల పాటు సర్వర్ ఇష్యూగానే చూపించారు. వైఫల్యాలకు స్పష్టత లభించిన తర్వాత పరిష్కార మార్గాలను వెతకడానికి సరైన సహకారం అందడం లేదని తెలిసింది. ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత దీనిపై పని చేసేందుకు, ఇష్యూస్ రీసాల్వ్ చేసేందుకు టెర్రాసిస్ నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందడం లేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైతే ధరణి పోర్టల్ మనుగడ సాగించేందుకు ప్రయత్నిస్తున్నారు. రానున్న రోజుల్లో ఎలాంటి సాఫ్ట్‌వేర్ ఇష్యూస్ తలెత్తుతాయోనన్న ఆందోళన అధికారుల్లో నెలకొన్నది. ఏదైనా వెబ్‌పోర్టల్‌లో సమస్య తలెత్తితే రాత్రిం బవళ్లూ కష్టపడాల్సి వస్తుంది. ప్రతి నిమిషం ఇంపార్టెంట్. అందుకే వెంట వెంటనే పరిష్కరించేందుకు టీమ్స్ ప్రయత్నిస్తున్నాయి.