డైరెక్టర్ ఆఫ్ ‘పాలిటిక్స్’.. కొత్తగూడెంలో కంటిన్యూగా పొలిటికల్ కామెంట్స్ చేస్తున్న డీహెచ్!

by GSrikanth |   ( Updated:2023-03-27 23:30:17.0  )
డైరెక్టర్ ఆఫ్ ‘పాలిటిక్స్’.. కొత్తగూడెంలో కంటిన్యూగా పొలిటికల్ కామెంట్స్ చేస్తున్న డీహెచ్!
X

‘కొత్తగూడెం నియోజకవర్గానికి కొత్త నాయకత్వం అవసరం’ అంటూ డీహెచ్ శ్రీనివాస రావు ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిళ్లలో చర్చనీయాంశంగా మారాయి. సర్కారును ప్రశంసిస్తూనే.. స్థానిక నాయకత్వం సరిగా లేదన్నట్టు మాట్లాడుతుండడంపై అధికార పార్టీ నేతల నుంచి విమర్శలు వస్తున్నాయి. అధికారి అయి ఉండి రాజకీయ నేతలా మాట్లాడుతుండడంపై నాయకులతోపాటు ఆఫీసర్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, వచ్చే ఎన్నికల్లో పొలిటికల్ ఎంట్రీ కోసమే డీహెచ్ ఇలా మాట్లాడుతున్నారనే ప్రచారం జరుగుతుండగా, ఆయన వ్యాఖ్యలను ప్రభుత్వ పెద్దలు సైతం ఖండించకపోవడం ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: డీహెచ్ శ్రీనివాస రావు ఇప్పుడు వరుసగా పొలిటికల్ కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ యాక్టివిటీ పెంచారు. ఇది ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు సంకేతమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాజకీయాల్లోకి వస్తానని శ్రీనివాసరావు ఇప్పటి వరకు ఎక్కడా ప్రత్యక్షంగా చెప్పలేదు. అయితే ఆయన చేస్తున్న కామెంట్లు, టీవీ చర్చలు, ఇంటర్వ్యూల్లో వెలిబుచ్చే అభిప్రాయాలు పరోక్షంగా దీన్నే సూచిస్తున్నాయి.

తీవ్ర విమర్శలు

అధికారి హోదాలో ఉండి, రాజకీయ నేతగా మాట్లాడుతుండడంపై రాజకీయ, అధికార వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇటీవల కొత్తగూడెం లో డీహెచ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ‘కొత్తగూడెం నియోజకవర్గం సరిగ్గా అభివృద్ధి చెందలేదనే బాధ ఉన్నది. ఇక్కడ కొత్త నాయకత్వం అవసరం. ప్రజల తీర్పు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తుంది. యుద్ధం మొదలైంది. చూసుకుందాం.’ అంటూ డీహెచ్ చేసిన వ్యాఖ్యలు ఖమ్మం జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి. ఒక అధికారి హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటని స్థానిక రాజకీయ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా అధికార పార్టీ నుంచే ఎక్కువగా విమర్శలు వస్తుండడం గమనార్హం.

స్థానిక నేతలను కించపరిచేలా..

డీహెచ్ ఓ వైపు సర్కారును ప్రశంసిస్తూనే కొత్తగూడెం లీడర్లకు పరోక్షంగా చురకలు అంటిస్తున్నారు. దీంతో డీహెచ్ వ్యాఖ్యలు స్థానిక నాయకత్వాన్ని కించపరిచేలా ఉన్నాయని స్థానిక ఎమ్మెల్యే వనమా వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది సిట్టింగ్ ఎమ్మెల్యేతోపాటు, పార్టీకి సైతం నష్టం చేకూరుస్తాయని పేర్కొంటున్నారు. రాజకీయ నేతగా వచ్చి మాట్లాడితే ఎలాంటి సమస్య ఉండదని, కానీ అధికారి హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేమిటని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వం అండ ఉన్నదా?

బీఆర్ఎస్ టికెట్టుపై కొత్తగూడెం నుంచి పోటీ చేయాలని శ్రీనివాస రావు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తున్నది. అందుకోసమే మెల్లమెల్లగా గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతున్నది. జీఎస్సార్ ట్రస్ట్ పేరుతో కొత్తగూడెం సెగ్మెంట్ లో నిత్యం సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. గతంలో ఆఫీసర్ హోదాలో సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కగా, ఇది వివాదస్పదమైంది. ఇప్పుడు తాజాగా ‘అన్ని నియోజకవర్గాల కంటే సిద్దిపేట అభివృద్ధిలో బెస్ట్. మంత్రి హరీశ్ రావు చేసిన అభివృద్ధిలో 50 శాతం కొత్తగూడెం లో జరిగినా నియోజకవర్గం ఎప్పుడో డెవలప్ అయ్యేది. స్థానిక లీడర్ల నిర్లక్ష్యంతోనే కొత్తగూడెం వెనకబడింది. అంటూ కామెంట్ చేశారు.

‘మంత్రి కేటీఆర్ గ్రేట్. హైదరాబాద్‌లో ఐటీ ఇండస్ట్రీలను తీసుకువచ్చి లక్షలాది మందికి ఉపాధి కల్పించారు. దీంతో ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతున్నది.’ అని పేర్కొన్నారు.. ‘మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ లను ఆదర్శమైన నేతలుగా భావిస్తాను.’ అని డీహెచ్ చేసిన వ్యాఖ్యలు సోమవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో మిగతా బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. తాము పని చేయకుండానే ప్రభుత్వ కార్యక్రమాలు స్పీడ్గా జరుగుతున్నాయా? అంటూ కొందరు నేతలు ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. అయితే ఆఫీసర్ హోదాలో యాక్టివిటీస్ చేస్తున్నా, స్థానిక లీడర్లను ఇబ్బందులు పెట్టేలా కామెంట్లు చేస్తున్నా ప్రభుత్వం మౌనంగా ఉంటుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీహెచ్ కు సర్కార్ అండ ఉన్నదనే చర్చ జరుగుతున్నది.

Advertisement

Next Story