అధిక డిమాండ్​ ఉన్నా.. నాణ్యమైన విద్యుత్తు సరఫరా : డిప్యూటీ సీఎం భట్టి

by Ramesh Goud |
అధిక డిమాండ్​ ఉన్నా.. నాణ్యమైన విద్యుత్తు సరఫరా : డిప్యూటీ సీఎం భట్టి
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ రోజు రోజుకు పెరుగుతున్నదని, ఊహించని రీతిలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ అవసరాలను తీర్చడానికి ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు సంస్కరణలు చేపట్టి కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అసెంబ్లీలో విద్యుత్ పద్దులపై జరిగిన చర్చ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. 2021 నాటికి 13668 మెగావాట్ల పిక్ డిమాండ్ ఉండగా 2021-22 నాటికి 14160 మెగావాట్ల పిక్ డిమాండ్ కు చేరుకున్నదన్నారు. 2022-23 నాటికి 15,497 మెగావాట్ల పిక్ డిమాండ్ కు పెరిగింది.

ఈ సంవత్సరం మార్చి నెలలో 17,162 మెగావాట్ల పిక్ డిమాండ్ కు పెరిగినప్పటికీ ముందస్తుగా తీసుకున్న చర్యలు తీసుకున్నామని తెలిపారు. అలాగే, సంస్కరణల వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా, కరెంటు ట్రిప్పు కాకుండా, కరెంటు కట్ లేకుండా, నిరంతరంగా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నామని ఆయన చెప్పారు. 2029-30 నాటికి గరిష్ట డిమాండ్ 24,215 మెగావాట్లు, 2034-35 నాటికి 31,809 మెగావాట్ల గరిష్ట డిమాండ్ ఉంటుందని కేంద్రం నుంచి వచ్చిన అంచనాలను దృష్టిలో పెట్టుకొని విద్యుత్ ఉత్పత్తి, ట్రాన్స్ మిషన్, డిస్కంల బలోపేతానికి అనేక కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు. రాజస్థాన్ లో విద్యుత్ శక్తి ఉత్పత్తికి సింగరేణి ఆధ్వర్యంలో సోలార్, థర్మల్ పవర్ ప్లాంట్ లు ఏర్పాటు చేయడానికి అక్కడి ప్రభుత్వంతోపాటు, హైడల్ పవర్ ఉత్పత్తి చేయడానికి మరో పొరుగు రాష్ట్రంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ చేసుకోవడం జరిగిందన్నారు.

2021 నాటికి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తి అందుబాటులోకి రావాల్సి ఉండగా పర్యావరణ అనుమతులు రాకపోవడంతో అనుకున్న సమయం నాటికి ఉత్పత్తి రాలేదన్నారు. కాంగ్రెస్​అధికారంలోకి రాగానే పర్యావరణ అనుమతుల కోసం అక్కడి కలెక్టర్ ద్వారా పబ్లిక్ హియరింగ్ తీసుకొని పర్యావరణ అనుమతులు తెచ్చి యూనిట్ 2 ప్రారంభించి ఉత్పత్తిని అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు. వైటి పి ఎస్ కు సింగరేణి నుంచి బొగ్గు రవాణా చేయడానికి కావలసిన వ్యవస్థ కూడా లేకపోవడంతో కాంగ్రెస్​అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాలెండర్ ఫిక్స్ చేసి ప్రతి వారం సమీక్ష చేసి రైల్వే పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి బొగ్గు సరఫరా చేసే రైలు ప్రారంభించామని స్పష్టం చేశౄరు. పీక్ అవర్ లో జల విద్యుత్ ను పెంచుకోవడానికి రివర్స్ పంపింగ్ ద్వారా విద్యుత్ ఉత్పత్తికి చర్యలు చేపట్టి రాష్ట్రానికి కావలసిన విద్యుత్ అవసరాలు తీర్చుతున్నామన్నారు.

శంకర్ పల్లి లో బ్యాటరీ విద్యుత్ నిలువలు పెంచడానికి టెండర్లు పిలిచాం. 500 మెగావాట్లు బ్యాటరీ విద్యుత్ ఉత్పత్తి నిలువలు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రాష్ట్రంలో ఒక కోటి 94 లక్షల 61వేల 511 విద్యుత్ కనెక్షన్లు ఉండగా 29 లక్షల 14 వేల 692 వ్యవసాయ కనెక్షన్లకు ఉచితంగా అందిస్తున్న కరెంటు కు సంబంధించి 11,500 కోట్ల రూపాయలను డిస్కములకు చెల్లించామని చెప్పారు. స్వయం సహాయక సంఘాల మహిళలతో వెయ్యి మెగావాట్లు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి సెర్ఫ్- ఎనర్జీ శాఖల మధ్యన ఎంఓయూ చేశామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని రైతులకు పంట తో పాటు పవర్ తో కూడా ఆదాయం రావాలని వ్యవసాయ పంపుసెట్లకు సోలార్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ, దేవాదాయ ధర్మాదాయ శాఖ లో ఖాళీగా ఉన్న భూములను గుర్తించి అక్కడ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం.రాష్ట్రంలో స్పిన్నింగ్ మిల్స్, పౌల్ట్రీ ఫార్మ్, సెలూన్ షాపులకు, ఇస్త్రీ షాపులకు, గణేష్ మండపాలకు సరఫరా చేస్తున్న విద్యుత్తు సంబంధించిన డబ్బులను లెక్క కట్టి ఆర్థిక శాఖ నుంచి విద్యుత్ సంస్థలకు చెల్లించామన్నారు.

Next Story