- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పెట్టుబడి కవితదే.. ఈడీ చార్జిషీట్‌లో సంచలన విషయాలు!
ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో ఈడీ గత నెల చివర్లో రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టుకు సమర్పించిన సప్లిమెంటరీ చార్జిషీట్‌లో సంచలన విషయాలను తెరపైకి తీసుకొచ్చింది. ఇందులో కవిత వ్యక్తిగత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు, ఇండో స్పిరిట్ కంపెనీలో ఆమె తరఫున బినామీగా ఉన్న అరుణ్ పిళ్లయ్ పలు సందర్భాల్లో ఇచ్చిన స్టేట్‌మెంట్లను ఉదహరించింది. ఇండో స్పిరిట్స్ కంపెనీలో కవిత తరఫున అరుణ్ పిళ్లయ్ వ్యాపార భాగస్వాగా ఉన్నారని, ఇందుకు అవసరమైన పెట్టుబడిని సైతం కవితే సమకూర్చారని ఈడీ ఆ చార్జిషీట్‌లో పేర్కొన్నది. అందులోని లాభాలు తన ఖాతాలోకి రాకుండా నేరుగా పిళ్లయ్ బ్యాంక్ ఖాతాలోకే వెళ్లేలా ఎమ్మెల్సీ ముందు జాగ్రత్త తీసుకున్నారని ప్రస్తావించిన ఈడీ.. ఆప్ నేతలకు చేరిన వందకోట్లు హవాలా రూపంలోని తరిలాయని, దానిని బోయినపల్లి అభిషేక్ సమన్వయం చేశారని స్పష్టం చేసింది.
దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై దర్యాప్తు చేస్తున్న ఈడీ గత నెల 27న ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టుకు సప్లిమెంటరీ చార్జిషీట్ సమర్పించింది. అందులో పలు సంచలన విషయాలను తెరపైకి తెచ్చింది. ఇండో స్పిరిట్స్ కంపెనీలో కవిత తరఫున అరుణ్ పిళ్లయ్ వ్యాపార భాగస్వామి అయ్యారని, ఇందుకు అవసరమైన పెట్టుబడిని సైతం కవితే సమకూర్చారని ఈడీ పేర్కొన్నది. ఇండో స్పిరిట్స్ కంపెనీ అధినేత సమీర్ మహేంద్రును, కవితను పలుమార్లు ఫేస్‌టైమ్ మొబైల్ యాప్ ద్వారా కనెక్ట్ చేసింది, హైదరాబాద్‌లో వారిద్దరి మధ్య ఫిజికల్ మీటింగ్‌ను సమన్వయం చేసింది పిళ్లయ్ అని ఈడీ స్పష్టం చేసింది. సిసోడియా తరపున విజయ్ నాయర్, కవిత తరపున పిళ్లయ్ మీడియేషన్ చేశారని, వీరిద్దరూ తరచూ కలుసుకునేవారని పేర్కొన్నది.
ఈడీ గత నెల 27న సమర్పించిన సప్లిమెంటరీ చార్జిషీట్‌లో ఈ అంశాలన్నింటినీ పేర్కొనగా స్పెషల్ కోర్టు సోమవారం పరిగణన (కాగ్నిజెన్స్)లోకి తీసుకున్నది. కవితకు వ్యక్తిగత ఆడిటర్‌గా పనిచేసిన బుచ్చిబాబు, ఇండో స్పిరిట్స్ కంపెనీలో ఆమె తరఫున బినామీ వ్యాపార భాగస్వామిగా ఉన్న పిళ్లయ్ పలు సందర్భాల్లో ఇచ్చిన స్టేట్‌మెంట్‌లను ఈడీ తన చార్జిషీట్‌లో పేర్కొన్నది. అడ్వాన్స్ కిక్ బ్యాక్స్ రూపంలో సౌత్ గ్రూపు నుంచి రూ. 100 కోట్ల ముడుపులు వెళ్లిన తర్వాతనే ఎమ్మెల్సీ కవితకు ఇండో స్పిరిట్స్ కంపెనీ రూపంలో ఢిల్లీ లిక్కర్ బిజినెస్‌లోకి యాక్సెస్ లభించిందని పేర్కొన్నది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు ముట్టిన రూ.100 కోట్లు పూర్తిగా హవాలా మార్గంలోనే సౌత్ గ్రూపు నుంచి వెళ్లాయని, వాటిని బోయిన్‌పల్లి అభిషేక్ సమన్వయం చేశారని పేర్కొన్నది. ఢిల్లీ డిప్యూటీ సీఎం (మాజీ) మనీశ్ సిసోడియాతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు పొలిటికల్ అండర్‌స్టాండింగ్ ఉన్నదంటూ బుచ్చిబాబు ఇచ్చిన స్టేట్‌మెంట్ (ఫిబ్రవరి 23)ను ఈడీ ఉదహరించింది. పాలసీలో మార్పులు, వ్యాపారంలో లాభాలు అనే ప్రాతిపదికన పరస్పర ప్రయోజనాలే వీరి మధ్య కీలకమని పేర్కొన్నది.
ఆప్ పెద్దలపై ఒత్తిడి
ఎక్సయిజ్ పాలసీలో అనుకూలమైన నిబంధనలు పెట్టి లాభాలు ఆర్జించడానికి సహకారం అందించాలని ఆప్ పెద్దలపై సౌత్ గ్రూపు ఒత్తిడి తెచ్చిందని, దానికి ప్రతిఫలంగా అడ్వాన్సుగానే కిక్‌బ్యాక్ రూపంలో రూ.100 కోట్లను అందించిందని, ఇందులో బోయిన్‌పల్లి అభిషేక్ సమన్వయకర్తగా వ్యవహరించారని ఈడీ పేర్కొన్నది. పిళ్లయ్ తన స్టేట్‌మెంట్ (2022 నవంబరు 20)లో ఈ విషయాన్ని పేర్కొన్నారని ఉదహరించింది. ఆ తర్వాతనే ఢిల్లీలోని ఓబెరాయ్ మెయిడెన్స్ హోటల్‌లో కవిత, విజయ్ నాయర్ మధ్య చర్చలు జరిగాయని, అందులో దినేశ్ అరోరా కూడా పాల్గొన్నారని ఈడీ తెలిపింది. కిక్ బ్యాక్‌ల గురించే ఈ మీటింగ్‌లో చర్చ జరిగిందని పేర్కొన్న ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. ఇందుకు సంబంధించిన ఆధారాలను హోటల్ యాజమాన్యం నుంచి స్వీకరించినట్టు కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌లో పేర్కొన్నది. కానీ ఎంత శాతం చొప్పున లాభాలు ఇండో స్పిరిట్స్ కంపెనీ నుంచి వస్తాయన్నదానిపై ఆ సమావేశంలో నిర్ణయం జరగలేదని, రూ.100 కోట్ల కిక్‌బ్యాక్ డీల్ కుదిరింది మాత్రం ఈ మీటింగ్‌లోనే అని పిళ్లయ్ గతేడాది ఫిబ్రవరి 16న ఇచ్చిన స్టేట్‌మెంట్‌లోని అంశాలను ఈడీ ప్రస్తావించింది. ఈ చర్చల తర్వాతనే ఇండో స్పిరిట్స్ కంపెనీలో తన తరఫున పిళ్లయ్ వ్యాపార భాగస్వామిగా ఉంటారంటూ ఆ కంపెనీ యజమాని సమీర్ మహేంద్రుకు కవిత క్లారిటీ ఇచ్చారని తెలిపింది. ఢిల్లీ లిక్కర్ వ్యాపారం గురించి ఎంపీ మాగుంటతో పాటు ఆయన కుమారుడు రాఘవ, వ్యాపార సన్నిహితులు నాగరాజారెడ్డితో తాను, బుచ్చిబాబు కలిసి చర్చలు జరిపినట్టు కూడా పిళ్లయ్ తన వాంగ్మూలం (అక్టోబరు 2, 2022)లో పేర్కొన్నారని ఈడీ గుర్తుచేసింది. ఆ తర్వాతనే ఎంపీ మాగుంట ఢిల్లీ వెళ్లి సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో మాట్లాడారని, బిజినెస్‌లోకి ఎంటర్ కావడానికి సంసిద్ధత వ్యక్తం చేశారని, కేజ్రీవాల్ సైతం స్వాగతం పలికారని ఈడీ వివరించింది.
చర్చల్లో బుచ్చిబాబుదే కీ రోల్
సౌత్ గ్రూపులోని ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల మధ్య ఇండో స్పిరిట్స్ కంపెనీలో వాటాలు ఎంత కావాలన్న అంశం మీద చర్చలు జరిగాయని, వీరిద్దరూ ఏప్రిల్ 2021లోనే ఢిల్లీలో ముఖాముఖిగా లిక్కర్ వ్యాపారం గురించి మాట్లాడుకున్నట్లు ఈడీ పేర్కొన్నది. ఆ కంపెనీ డీల్ అంశంలో ప్రొఫెషనల్ ఆడిటర్‌గా డాక్యుమెంటేషన్ వర్క్ చేసింది బుచ్చిబాబేనని పేర్కొన్నది. ఇండో స్పిరిట్స్ యజమాని సమీర్ మహేంద్రు, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ మాగుంట, ఆయన కుమారుడు రాఘవ తదితరుల మధ్య బిజినెస్ చర్చల్లో కీలక భూమిక పోషించింది కూడా బుచ్చిబాబేనని, ఆయన తన స్టేట్‌మెంట్లలో సైతం దీన్ని స్పష్టం చేశారని ఈడీ పేర్కొన్నది. హవాలా మార్గంలో డబ్బు లావాదీవేలు జరగడం మొదలు లెక్కల్లోకి రాకుండా ఆస్తులను పోగేసుకోవడం వరకు అన్నింటా మనీ లాండరింగ్ చట్ట ఉల్లంఘనలు జరిగినట్టు ఆ చార్జిషీట్‌లో పలు ఉదాహరణలను ఇస్తూ కోర్టుకు వివరించింది. కవితకు బినామీ అని పేర్కొంటున్న పిళ్లయ్‌ను అరెస్టు చేయడం, ఆమెకు గతంలో వ్యక్తిగత ఆడిటర్‌గా పనిచేయడం మాత్రమే కాక సౌత్ గ్రూపు నిర్వహించే లిక్కర్ వ్యాపారంలో లాభాలు వచ్చేందుకు సహకరించిన బుచ్చిబాబును ఈ కేసులో నిందితుడిగా చేర్చడం వరకు ఈడీ దర్యాప్తు ప్రక్రియను పరిశీలిస్తే తదుపరి టార్గెట్ ఎవరనేది చర్చనీయాంశమైంది.
లిక్కర్ స్కామ్‌కు కవిత భూముల కొనుగోలుకు సంబంధం లేదు : బుచ్చిబాబు
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భూ లావాదేవీలకు ఢిల్లీ మద్యం కుంభకోణంతో సంబంధం లేదని బుచ్చిబాబు వివరణ ఇచ్చారు. తాను ఈడీ అధికారులకు ఇచ్చిన స్టేట్‌మెంట్లలో 2019లో జరిగిన భూముల క్రయ విక్రయాల గురించే చెప్పానని, అవన్నీ ఆమె తన భర్తతో కలిపి చేసిన లావాదేవీలని వివరించారు. అరుణ్ రామచంద్ర పిళ్లయ్ కొనుగోలు చేసిన భూములతో కవితకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టత ఇచ్చారు. అరుణ్ పిళ్లయ్ వట్టినాగులపల్లిలో 2022 జూన్-నవంబరు మధ్య కొనుగోలు చేశారని తెలిపారు.