Dasoju Sravan: హైడ్రా గ్యాంగ్‌తో రాక్షస పాలన సాగించొద్దు.. దాసోజు శ్రవణ్ ఫైర్

by Ramesh N |
Dasoju Sravan: హైడ్రా గ్యాంగ్‌తో రాక్షస పాలన సాగించొద్దు.. దాసోజు శ్రవణ్ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి హైడ్రా గ్యాంగ్‌తో కలిసి రాక్షస పాలన సాగించొద్దని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ (Dasoju Sravan Kumar) ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి రాక్షస పాలనలో (Hydra) హైడ్రా జులుం.. అంటూ ఆయన ఎక్స్ ఖాతా ద్వారా తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ అవుట్‌డోర్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలాపూర్ చౌరస్తా వద్ద అనుమతులు ఉన్న హోర్డింగులను హైడ్రా అధికారులు అక్రమంగా తొలగిస్తూ, వేలాది కుటుంబాల జీవనాధారాన్ని సర్కార్ నాశనం చేస్తోందని ఆరోపించారు. హైకోర్టు శనివారాలు, ఆదివారాల్లో హోర్డింగ్ తొలగింపులు చేయరాదని స్పష్టంగా ఆదేశించినా, హైడ్రా అధికారులు కోర్టు ధిక్కరిస్తూ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పెద్ద పెద్ద బిల్డర్స్ చెరువుల్లో ఆకాశహర్మ్యాలు కడుతుంటే తలూపని ప్రభుత్వం, పేద మధ్య తరగతి ప్రజలపై తన అధికార ప్రతాపాన్ని చూపించడం ఎంతవరకు న్యాయం? అని ప్రశ్నించారు.

హోర్డింగ్ యజమానులు, వ్యాపారులు హైడ్రా అధికారులపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, తొలగించిన హోర్డింగ్ మెటీరియల్‌ను అవి అమ్ముకుంటున్నారని సంచలన విషయాన్ని బయటపెట్టారని తెలిపారు. ఇదంతా వ్యాపారుల రక్తాన్ని పీల్చే కుట్ర కాదా? అని ప్రశ్నించారు. ఈ వ్యాపారం మీద లక్షలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని, హోర్డింగ్ కార్మికులపై హైడ్రా అధికారులు దాడులు చేశారని వ్యాపారులు తీవ్రంగా మండిపడుతున్నట్లు వెల్లడించారు. ఈ అక్రమాలను తక్షణమే ఆపకుంటే, రేపటి నుంచే రాష్ట్ర వ్యాప్త నిరసనలు, ధర్నాలు నిర్వహించేందుకు వ్యాపారులు సిద్ధమవుతున్నారని తెలిపారు. ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజలపై చేస్తున్న జులుం ప్రయత్నాన్ని ఆపాలని పేర్కొన్నారు.

Next Story

Most Viewed