టీఆర్ఎస్‌లోకి దాసోజు శ్రవణ్!

by GSrikanth |   ( Updated:2022-10-21 07:18:50.0  )
టీఆర్ఎస్‌లోకి దాసోజు శ్రవణ్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న దాసోజు శ్రవణ్ ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి శుక్రవారం రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో సభ్యుడిగా ఉన్న ఆయన ఆగస్టు 7న ఢిల్లీలో బీజేపీలో చేరారు. రెండున్నర నెలల వ్యవధిలోనే ఆయన ఆ పార్టీని వీడారు. రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు రాజీనామా లేఖను పంపారు. మరికొన్ని గంటల్లో ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ప్రాథమిక సమాచారం. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో భారీ స్థాయిలో మద్యం, మాంసాన్ని ఓటర్లకు పంచిపెట్టడంతో పాటు విచ్చలవిడిగా డబ్బులు కుమ్మరిస్తున్నదనే ఆరోపణలు చేసి దశ దిశ లేని పార్టీలో కొనసాగలేనంటూ తన రాజీనామా లేఖలో దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు.

ప్రత్యామ్నాయ రాజకీయాలు చేస్తామని బీజేపీ చెప్పే మాటలతో ఆ పార్టీలో చేరానని, కానీ ప్రస్తుతం మునుగోడులో జరుగుతున్న తీరు జుగుప్సాకరంగా ఉన్నదని, సామాజిక బాధ్యతగా వ్యవహరించడంలేదని దాసోజు ఆ రాజీనామా లేఖలో ఆరోపించారు. ఆశలు, ఆశయాలతో చేరినా నాయకత్వ ధోరణులు, నిర్మాణాత్మక రాజకీయాలు లేకపోవడంతో తెలంగాణ సమాజానికి ఉపయోగకరంగా లేవని తొందర్లోనే తెలుసుకున్నానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడే సమయంలో నాయకత్వంపైనా, ఆలోచనపైనా ఇలాంటి కామెంట్లు చేసి బీజేపీలో చేరిన దాసోజు ఇప్పుడు ఆ పార్టీ నుంచి తప్పుకోడానికి ఇవే కారణాలను చూపారు. మరికొన్ని గంటల్లోనే ఆయన టీఆర్ఎస్‌లో చేరనున్నారు.

టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ పార్టీతో కొనసాగిన దాసోజు ప్రజారాజ్యం పార్టీ ఉనికిలోకి వచ్చిన తర్వాత అందులో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్ గూటికి, ఇటీవల బీజేపీ గూటికి చేరారు. ఇప్పుడు మళ్లీ టీఆర్ఎస్‌వైపే మొగ్గుచూపుతున్నారు..




Advertisement

Next Story

Most Viewed