John Wesley: వారిని సంతృప్తి పరుస్తామని చెప్పి ముష్టి వేశారు

by Gantepaka Srikanth |
John Wesley: వారిని సంతృప్తి పరుస్తామని చెప్పి ముష్టి వేశారు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై సీపీఐ(ఎం) తెలంగాణ(CPIM Telangana) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ(John Wesley) స్పందించారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. బడా కార్పొరేట్ల ప్రయోజనాలను కాపాడే బడ్జెట్‌గా ఉంది. సామాన్య ప్రజలకు నేరుగా లబ్ధి కల్పించేందుకు ఎటువంటి ప్రసంగమూ, పథకం లేదు. వేతన జీవులను పెద్దఎత్తున సంతృప్తి పరుస్తామని చెప్పి ముష్టి వేసినట్లు ఊరట కల్పించారు. దేశ ప్రజల (కార్పొరేట్లు) బడ్జెట్ అని ప్రధాని మోడీ గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉన్నది. ప్రజా వ్యతిరేకంగా వున్న బడ్జెట్ను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెల్పాలని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిస్తున్నది.

రాష్ట్రంలో ఇద్దరు బీజేపీ(BJP) మంత్రులు, 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పటికీ రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టలేకపోయారు. రాష్ట్ర విభజన హామీలు గాలికొదిలేశారు. ఆదిలాబాద్‌లో సీసీఐ ఫ్యాక్టరీలు, రాష్ట్రంలో విమానాశ్రయాల ఏర్పాటుకు రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐఎఫ్ఎం, హైస్పీడ్ రైల్వే ట్రాక్లకు నిధుల ఊసే లేదు. రాబోయే ఢిల్లీ, బిహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయా రాష్ట్రాలకు మాత్రమే నిధులు కేటాయించారు. రు.50,65,345 కోట్లతో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో రూ.12,76,338 కోట్లు, అనగా 25.2 శాతం వడ్డీల చెల్లింపుకే కేటాయించారు. వ్యవసాయ రంగానికి కన్నా రు.10వేల కోట్లు తగ్గించారు. ఎరువుల సబ్సిడీకి రు.11వేల కోట్లు తగ్గించారు. ప్రధాని మోడీ దేశంలో 25 కోట్ల మందిని దారిద్రరేఖకు ఎగువకు తెచ్చామని చెబుతూనే, 2029 వరకు 80 కోట్ల మందికి 5 కిలోల చొప్పున రేషన్ షాపుల ద్వారా ఉచిత బియ్యం పంపిణీ చేస్తామన్నారు.

ఉపాధి హామీ పథకానికి 2023-24లో 89,154 కోట్లు ఖర్చు చేయగా, ప్రస్తుత బడ్జెట్లో రూ.86వేల కోట్లు మాత్రమే కేటాయించారు. దళిత, గిరిజనులకు బడ్జెట్‌లో చేసిన కేటాయింపులతో ఎవరికీ ఉపయోగం లేదని అన్నారు. ఈ వర్గాలకు కేటాయించిన నిధులను నోడల్ ఆఫీసర్ ద్వారా ఆవాసాలు, రహదారులు, తాగునీరు, విద్య, వైద్య సౌకర్యాలు కల్పించినచో ఆ వర్గాల్లో కొంతమేరకైనా అభివృద్ధి జరుగుతుంది. దళితులకు 16శాతం కేటాయించాల్సి ఉండగా.. 5శాతం నిధులు మాత్రమే కేటాయించారు.

గిరిజనులకు 7శాతం నిధులు కేటాయింపునకు బదులు 2శాతం కేటాయించారు. విద్య, వైద్య రంగాలకు చాలా స్వల్పంగా కేటాయింపులు 3శాతానికి లోపే కేటాయింపులు ఉన్నాయి. పారిశ్రామిక రంగం ఉత్పత్తికి బడ్జెట్ కేటాయింపులు పెంచాలి. కార్పొరేట్లకు పన్ను రాయితీలు, బ్యాంకుల అప్పుల ఎగవేతకు అవకాశం కల్పిస్తూ తయారు చేసిన ఈ బడ్జెట్‌ను పారిశ్రామిక, వ్యవసాయ అభివృద్ధికి అనుకూలంగా తీర్చిదిద్దాలి. వలసలను, ఆత్మహత్యలను నిరోధించే విధంగా బడ్జెట్ను రూపొందించాలని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్రకమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు జాన్ వెస్లీ ప్రకటించారు.





Next Story

Most Viewed