ఒప్పందం ప్రకారం 2 ఎమ్మెల్సీలు ఇవ్వాల్సిందే.. CPI నేత కూనంనేని కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
ఒప్పందం ప్రకారం 2 ఎమ్మెల్సీలు ఇవ్వాల్సిందే.. CPI నేత కూనంనేని కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్సీ సీట్లపై సీపీఐ తెలంగాణ(CPI Telangana) కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు(Kunamneni Sambasiva Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పొత్తులో భాగంగా ఒక ఎమ్మెల్యే.. రెండు ఎమ్మెల్సీలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. హామీ మేరకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల్లో తమకు ఒకటి ఇప్పుడు కేటాయించాలి.. తర్వాత మరో ఎమ్మెల్సీ ఇవ్వాలని కూనంనేని సాంబశివ రావు డిమాండ్ చేశారు. ఈ అంశంపై త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని కలుస్తామని అన్నారు.

స్థానిక సంస్థల ఎన్నిక(Election of local bodies)ల్లో బలంగా ఉన్న చోట పోటీ చేస్తామని కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తే ముందుకూ వెళ్తామని తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇచ్చామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం(Congress Govt)లోకి వచ్చిన వెంటనే కుల గణన, ఎస్సీ వర్గీకరణ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపట్టడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి పోకడకు వెళ్లకుండా ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మావోయిస్టులను ఎన్ కౌంటర్ పేరుతో చంపేస్తున్నారని, దీనిపై న్యాయ విచారణ జరిపించాలని ఎమ్మెల్యే కూనంనేని కోరారు.

అంతకుముందు గాంధీ భవన్‌లో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌(Mahesh Kumar Goud)తో కూనంనేని సాంబశివ రావు, చాడ వెంకట్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీల కేటాయింపుపై సుదీర్ఘంగా చర్చించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే వీరు భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఇదిలా ఉండగా.. సీపీఐ పార్టీ తరపున సీనియర్ నేత చాడ వెంకట్ రెడ్డి ఎమ్మెల్సీ ఆశిస్తున్నారు.

మరోవైపు.. తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. ఎమ్మెల్యే కోటా కింద ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 3న నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 20న ఎన్నికలు.. అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ఇందులో ఏ పార్టీకి ఎన్ని దక్కే అవకాశం ఉందనే అంశంపై చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేల సంఖ్యా బలం ప్రకారం ఈ ఐదు స్థానాల్లో అధిక సీట్లు అధికార కాంగ్రెస్‌ దక్కించుకోనుంది.

Next Story

Most Viewed