‘‘జీవో 46 రద్దు చేస్తే ప్రతి కానిస్టేబుల్ అభ్యర్థికి అన్యాయం’’

by Satheesh |   ( Updated:2023-08-02 10:09:08.0  )
‘‘జీవో 46 రద్దు చేస్తే ప్రతి కానిస్టేబుల్ అభ్యర్థికి అన్యాయం’’
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలకు చెందిన కొంత మంది కానిస్టేబుల్ అభ్యర్థులు జీవో 46 ద్వారా కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేస్తే తాము తీవ్రంగా నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ జీవోను రద్దు చేయాలని కొన్ని రోజులుగా కొంతమంది కానిస్టేబుల్ అభ్యర్థులు దుష్ప్రచారం చేస్తున్నారని పోలీస్ అభ్యర్థులు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం 46 ప్రకారమే కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ కానిస్టేబుల్ అభ్యర్థులు హైదరాబాద్‌లో ఆందోళనకు దిగారు. ర్యాలీగా వచ్చిన అభ్యర్థులు ట్యాంక్ బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా నిర్వహించారు.

2018 నోటిఫికేషన్ ఆధారంగా నియమాకాలు చేపడితే అన్ని జిల్లాలకు చెందిన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. అన్ని జిల్లాల అభ్యర్థులకు సమన్యాయం జరుగుతుందని భావించి.. ప్రభుత్వం 2022లో ఇచ్చిన నోటిఫికేషన్‌లో జీవో 46ను ప్రవేశపెట్టిందన్నారు. ఈ జీవో నెం 46 వల్ల 33 జిల్లాలకి న్యాయపరమైన రేషియో జరుగుతుందని, ఉత్తర తెలంగాణకి వంద శాతం, దక్షిణ తెలంగాణకి వంద శాతం ప్రకారం రేషియో ఇవ్వడం వల్ల రాష్ట్రంలో ప్రతీ ఒక్క అభ్యర్థికి న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. జీవో 46ను రద్దు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు చెందిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ ధర్నాలో కానిస్టేబుల్ అభ్యర్థులు రమేష్, శరత్, భాను నాయక్, సతీష్ పలువురు అభ్యర్థులు పాల్గొన్నారు.

Advertisement

Next Story