‘ద‌గాకోర్ ద‌యాక‌ర్‌’.. చార్జ్‌షీట్‌లో మంత్రి ఎర్రబెల్లి అవినీతి చిట్టా బయటపెట్టిన కాంగ్రెస్..!

by Satheesh |   ( Updated:2023-09-23 07:59:46.0  )
‘ద‌గాకోర్ ద‌యాక‌ర్‌’.. చార్జ్‌షీట్‌లో మంత్రి ఎర్రబెల్లి అవినీతి చిట్టా బయటపెట్టిన కాంగ్రెస్..!
X

దిశ‌, తెలంగాణ బ్యూరో: మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావుపై కాంగ్రెస్ పార్టీ చార్జిషీట్ విడుద‌ల చేసింది. దందాలు, దౌర్జన్యాలు చేస్తున్న ద‌గాకోర్ ద‌యాక‌ర్‌రావు అంటూ చార్జిషీట్‌లో విమ‌ర్శించింది. ద‌యాక‌ర్‌రావుపై తొమ్మిది అంశాల‌తో కూడిన చార్జిషీట్‌ను శుక్రవారం కాంగ్రెస్ పార్టీ త‌న ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. చెన్నూరు రిజర్వాయర్‌ను పూర్తి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ రూ.360 కోట్ల నిధుల‌ను కేటాయిస్తూ మంత్రి ఎర్రబెల్లి రూ.700 కోట్లకు పెంచి రూ.250 కోట్ల కమీషన్ కొట్టేసిండ‌ని ఆరోపించింది. ద‌యాక‌ర్‌రావు క‌మీష‌న్లు అడుగుతుండ‌టంతో అభివృద్ధి ప‌నులు చేసేందుకు కూడా కాంట్రాక్టర్లు ముందుకు రావ‌డం లేద‌ని పేర్కొంది.

పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోని 76 సర్వే నంబర్‌లో ఉన్న ఒక పట్టా భూమిని 56గా మార్చి దాదాపు 50 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారని ఆ పార్టీ పేర్కొంది. దయాకర్ రావు చేసిన అనేక అక్రమాలలో ఇదొకటి అని కాంగ్రెస్ తన ఛార్జిషీట్‌లో పేర్కొంది. నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీలకు నిధులివ్వాలని సర్పంచులు వేడుకోగా మందు బాటిళ్లు అమ్ముకోండని అహంకారం చూపిస్తుండ‌ని పేర్కొంది. మంత్రి కమీషన్ల కారణంగా తొర్రూర్ మండలంలో తాగునీటి ప్రాజెక్టుల పనులు ముందుకు సాగ‌డం లేద‌ని, ప్రజలు తాగునీటికి ఇబ్బందులు ప‌డుతున్నార‌ని పేర్కొంది. అర్హులకు కాకుండా 30% కమీషన్లతోనే తన అనుచరులకే దళిత బంధు మంజూరు చేశార‌ని, పాలకుర్తి మండలంలో 100 పడకల ఆసుపత్రి, డిగ్రీ కళాశాల నిర్మాణ ప్రతిపాదనలను ప్రస్తావిస్తూ దయాకర్‌రావు ఆసక్తి చూపకపోవడంతో అవి కాగితాలపైనే మిగిలిపోయాయని చార్జిషీట్‌లో పేర్కొన్నారు.

2018లో దళితులకు మంచుప్పుల గ్రామంలో 2బిహెచ్‌కె ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చినా పూర్తి చేయకపోవడాన్ని కూడా మంత్రి తప్పుబట్టారు. అలాగే రాయపర్తి మండలంలో మంత్రి, అతని తమ్ముడి కోళ్ల ఫామ్ కారణంగా చెరువులు కలుషితమ‌వుతున్నాయ‌ని, మత్సకారులు, ప్రజలు నానా అవస్థలు పడుతున్నాయ‌ని ఆరోపించింది. మంత్రి దౌర్జన్యాలను ప్రశ్నిస్తే పోలీసులు అక్రమ కేసులు బ‌నాయిస్తూ అధికరమదంతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ ఆరోపించింది. ఇక 2018లో డబుల్ బెడ్రూం ఇళ్లకు శంకుస్థాపన చేసి ఇప్పటి వరకు పూర్తి చేయలేద‌ని, మంచుప్పులలో దళితులకు కేటాయించిన డబుల్ బెడ్రూం ఇళ్లు అధ్వానంగా ఉన్నాయ‌ని పేర్కొంది. కొడకండ్ల మండలంలో టెక్స్టైల్ ఇప్పిస్తనని చెప్పి నిండా ముంచాడ‌ని విమ‌ర్శించింది.

Advertisement

Next Story

Most Viewed