‘గొర్రెల స్కాంలో సోమేష్ కుమార్ పాత్ర.. విచారణ చేయాల్సిందే’

by GSrikanth |
‘గొర్రెల స్కాంలో సోమేష్ కుమార్ పాత్ర.. విచారణ చేయాల్సిందే’
X

దిశ, తెలంగాణ బ్యూరో: గొర్రెల స్కాంలో సోమేష్ కుమార్ పాత్రపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేయాలని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ డిమాండ్ చేశారు. వాణిజ్య పన్నుల విభాగం బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలోనే జీఎస్‌టీ వసూళ్లలో సుమారు వెయ్యి కోట్ల గోల్‌మాల్ జరిగిందని, విచారణ జరుగకుండా సోమేశ్ కుమార్ అడ్డుకుంటున్నారని వార్తలొస్తున్నాయని దానిపైనా దర్యాప్తు చేయాలన్నారు. గాంధీభవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గొర్రెల కొనుగోలు దారులకు సొమ్ము చెల్లించకుండా బ్రోకర్లకు, బినామీలకు చెల్లించారనే ఆరోపణలపై రవి, ఆదిత్య, రఘుపతి రెడ్డి, గణేష్ అనే నలుగురు అధికారులను అరెస్టు చేయడం గత ప్రభుత్వంలో జరిగిన అవినీతికి నిదర్శనం అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలోని పశుసంవర్థక శాఖ బాగోతాలపై సమగ్ర విచారణ జరిపి, దోషులను శిక్షించాలన్నారు. 2017 నుంచి 18 సెప్టెంబర్ 2021 వరకు రూ.1,538.59 కోట్లు ఖర్చు చేయగా, అందులో వందల కోట్ల దుర్వినియోగం జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు.

కాగ్ రిపోర్టులో కూడా అవినీతి ఉదంతాలు బయటపడ్డాయన్నారు. 16,835 యూనిట్లకు సంబంధించి అసలుకు లెక్కలే లేవని, వాటి విలువ సుమారు రూ.142.69 కోట్లు ఉంటుందన్నారు. లబ్దిదారులకు సంబంధించిన ఫైళ్ళు లేవని, చనిపోయినవారిని కూడా లబ్దిదారులుగా చూపారని మండిపడ్డారు. కాగ్ రిపోర్టు ప్రకారం 2,37,657 గొర్రెల సరఫరా జరిగిందనేది ఫేక్ అన్నారు. మాసాబ్ టాంక్‌లోని పశు సంవర్ధక శాఖ కార్యాలయం నుంచి ముఖ్యమైన ఫైళ్లు చోరీకి గురయ్యాయని, దీనికి ముఖ్య సూత్రధారి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పీఏగా పేర్కొనడం జరిగిందని అతడిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో కీలక వ్యక్తి అయిన మొబిన్ ను అరెస్టు చేస్తే సూత్రధారులెవరో, వారి వెనుకు ఉన్ననాయకులెవరో బయటపడుతుందన్నారు. చెరువుల్లో చేపలు పెంచాలనే లక్ష్యంతో లక్షలాది చేపపిల్లలను కొనుగోలు చేసి చెరువుల్లో, కుంటల్లో వదిలారని, వాటిలో కూడా మోసాలు జరిగినట్లు తెలుస్తోందన్నారు. ప్రభుత్వం స్పందించి గొర్రెలు, చేపలపై లెక్కలు తేల్చాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed