దోపిడీకి మూసీ ప్రక్షాళనతో కాంగ్రెస్ భారీ స్కెచ్ : ఈటల

by Y. Venkata Narasimha Reddy |
దోపిడీకి మూసీ ప్రక్షాళనతో కాంగ్రెస్ భారీ స్కెచ్ : ఈటల
X

దిశ, వెబ్ డెస్క్ : గత బీఆర్ఎస్ పాలకులు మిషన్ భగీరథ, కాళేశ్వరం వంటి వాటితో దోచుకునిపోగా ఇక దబ్బులు ఎక్కడ ఉన్నాయని ఆలోచన చేసిన కాంగ్రెస్ పాలకులు లక్షా 50 వేల కోట్ల రూపాయలతో మూసీ ప్రక్షాళనను తెరమీదకు తీసుకొచ్చి దోపిడికి భారీ స్కెచ్ వేసుకొని రంగంలోకి దిగారని మాజీ మంత్రి, మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని గెలిపించింది ప్రజలకు బాగు చేస్తారని కానీ, ఏడిపిస్తాడని కాదన్నారు. ప్రజల కన్నీళ్లు చూసి నవ్వుతున్న రేవంత్ రెడ్డి ఒక సైకో... శాడిస్ట్ మెంటాలిటీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనది ప్రజలని ప్రేమించే మెంటాలిటీ కాదని.. దీనిమీద చర్చకు కూడా సిద్ధం అని సవాల్ విసిరారు. హైదరాబాద్ లో మురికి నిలయాల వంటి చెరువుల చెంతన..మూసీ పక్కన ఉండటం ఒక శాపమని..సామాన్యులకు దిక్కు లేక ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులను కాపాడటానికి కూడా పట్టా భూములను సేకరించాలని..బాధితులకు ప్రత్యామ్నాయం చూపించాలని డిమాండ్ చేశారు. అవేమీ లేకుండా కట్టుకున్న ఇళ్ళను కొలగొడతా అంటే న్యాయం అవుతుందా ? అని ప్రశ్నించారు. బిల్డర్లకు వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నా అని కొంతమంది అంటున్నారని..నా 25 ఏళ్ల రాజకీయ జీవితం కొట్లాటనే, అది పేదల కోసమే అన్నారు. చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి చివరికి కేసీఆర్ తో కూడా కొట్లాడానని చెప్పారు.

రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే పదవి చక్కగా చేయలేదని, ఎంపీగా గెలిపిస్తే మల్కాజ్ గిరిని పట్టించుకోలేదని, ఒక మంత్రిగా పనిచేసిన అనుభవం లేదని, చెరువు లంటే ఏంటో అవగాహన లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. ఫార్మాసిటీ కోసం 13 వేల ఎకరాల భూములు సేకరించారని, రింగ్ రోడ్డు కోసం, ప్రాజెక్టుల కోసం భూమిని సేకరిస్తున్నారన్నారని, నిర్వాసితులను పట్టించుకోకుండా వ్యవహరిస్తే గత పాలకులకు పట్టిన గతే పడుతుందన్నారు. చెరువుల పరిరక్షణ, మూసీ ప్రక్షాళన పేరుతో పేదలు, మధ్యతరగతి ప్రజల ఆస్తులను కూల్చివేస్తుంటే చూస్తూ ఊరుకోమన్నారు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎందుకు చేశామా అని మద్దతు ఇచ్చిన వారందరూ బాధపడుతున్నారని తెలిపారు. పట్టా భూముల్లో ఎవరైనా చెయ్యి పెడితే ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నానన్నారు. నిర్మాణాలకు పర్మిషన్లు ఇచ్చిన నాటి ముఖ్యమంత్రులను తప్పు చేశారని ముక్కు నేలకు రాయించాకే జనం ఇల్లు కూలగొట్టించాలని డిమాండ్ చేశారు. అనేక మంది సీఎంలను చూశామని..రేవంత్ రెడ్డిని కూడా చూస్తున్నామని..మంచి పనులు చేస్తే గుండెలో పెట్టుకుంటారన్నారు. జనం ఆస్తుల కూల్చివేత వంటి పిచ్చి పనులు చేస్తే బండకేసి కొడతారన్నారు. పీర్జాదిగూడలో మంచినీటి సమస్యలు డ్రైనేజీ సమస్యలు పరిష్కరించేందుకు నా వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story