- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సందేశం

దిశ, వెబ్‌డెస్క్: గణతంత్ర దినోత్సవం(Republic Day) సందర్భంగా తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక సందేశం పంపించారు. ఈ మేరకు ఆదివారం వీడియో విడుదల చేశారు. ‘‘డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్(Ambedkar) ఈ దేశ ప్రజలకు అందించిన రాజ్యాంగం. 75 వసంతాలు పూర్తి చేసుకొని 76వ వసంతంలో అడుగుపెడుతున్న సందర్భంగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడ్డ ప్రజా పాలన, ఇందిరమ్మ రాజ్యం, ఈరోజు నాలుగు నూతన సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని మీ అందరికీ తెలియజేయడానికి సంతోషపడుతున్నాను.
మీ రేవంత్ అన్నగా మీ ఆశీర్వాదం తీసుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 13 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రజలకిచ్చిన గ్యారంటీలను ఒకటొకటిగా అమలు చేస్తూ, ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా రైతు భరోసా. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది.
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం కోసం ప్రజా పాలనలో నిరంతరం శ్రమిస్తూ ప్రజలతో మమేకమవుతూ ప్రజా పరిపాలన అందిస్తూ రైతు భరోసా నిరుద్యోగ సమస్య పరిష్కారం, అదే విధంగా వరికి బోనస్, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను ఈరోజు మనం అమలు చేసుకోవడమే కాకుండా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు, ఐదు వందల రూపాయల సిలిండర్‌ను ఈరోజు ఆడబిడ్డలకు అందజేస్తూ ఈ ప్రజాపాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం.
రాష్ట్రాన్ని చుట్టుముట్టిన సమస్యలను ఒకటొకటిగా పరిష్కరిస్తూ, ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం. దళితులు గిరిజనులు ఆదివాసీలు అదే విధంగా బలహీన వర్గాలు మైనారిటీలు మహిళలు. నిరుపేదలందరినీ కూడా ఆదుకోవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది.
మీ ఆశీర్వాదం. మీరు అండగా నిలబడబట్టి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం. ముఖ్యంగా ఎంతో మంది పేదలు, సంవత్సరాల కొద్ది నూతన రేషన్ కార్డుల కోసం ఎదురుచూడడం, అదే విధంగా రైతు కూలీలు మాకు భరోసాగా ఉండడం ద్వారా మేము కొంత ఆర్థిక ప్రయోజనం పొందాలి అని మా దృష్టికి తీసుకురావడంతో ఈరోజు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నూతన కార్యక్రమాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
రైతు భరోసాలో సంవత్సరానికి 12 వేల రూపాయలను ఈరోజు రైతుల ఖాతాలో వేసుకోవడం జరుగుతుంది. ఆనాడు ఆకాశమే హద్దుగా 2004 నుంచి 2014 వరకు ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇళ్లు మనం ఇచ్చుకోవడం జరిగింది. మళ్ళీ పది సంవత్సరాల తర్వాత ఈరోజు పేదల కళ్లల్లో వెలుగు చూడడానికి పేదలను ఒక ఇంటి వాళ్ళను చేయడానికి ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాలను కూడా తీసుకోవడం జరిగింది.
ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదలను, నిరుపేదలను, దళితులను, గిరిజనులను, ఆదివాసీలను, బలహీన వర్గాలను, మైనారిటీలను, మహిళలను. సంక్షేమ పథం వైపు నడిపించడమే కాకుండా మొదటి సంవత్సరంలోనే 50,153 ప్రభుత్వ ఉద్యోగాలను ఇవ్వడం ద్వారా తెలంగాణలో ఉన్న లక్షలాది నిరుద్యోగ యువకులకు ఈరోజు ఒక ఆనందాన్ని అందించడం జరిగింది.
విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, ఉద్యమకారులను ఆదుకోవడమే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి ఒక రాష్ట్ర గీతాన్ని, అదే విధంగా తెలంగాణ ప్రజలకు ఒక తెలంగాణ తల్లిని మనం అందించుకున్నాము. ఇంత మంచి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తూ మీరు అండగా నిలబడ్డందుకు మీకందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు’’ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.