రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకంపై CM రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

by Sathputhe Rajesh |
రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకంపై CM రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో నిర్వహించిన ‘హెల్త్‌ కేర్‌ డిజిటలీకరణ’ అంశంపై ప్రసంగించిన సీఎం రేవంత్‌ రెడ్డి, తెలంగాణలోని నాలుగు కోట్ల మంది ప్రజానీకానికి డిజిటల్‌ హెల్త్‌ కార్డులు రూపొందిస్తున్నామని ప్రకటించారు. అత్యుత్తమ వైద్యసేవలకు, సాఫ్ట్‌వేర్‌ సేవలకు హైదరాబాద్‌ రాజధాని.

అయితే నాణ్యమైన వైద్య సేవలు పొందడం చాలా ఖర్చుతో కూడుకున్నది కావడంతో, ప్రజలందరికీ ఉత్తమ వైద్య సేవలు అందించాలనేదే తమ లక్ష్యమని వెల్లడించారు. ఇప్పటికే రాజీవ్‌ ఆరోగ్యశ్రీ కింద పేదలకు రూ.10 లక్షల వరకూ ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అత్యుత్తమ సాంకేతికత సాయంతో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. డిజిటల్‌ ఆరోగ్య కార్డుల డేటా భద్రత, ప్రైవసీని కాపాడుతామని తెలిపిన సీఎం, ప్రపంచ వ్యాక్సిన్లు, ఔషధాల్లో 33 శాతం హైదరాబాద్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా 2006లో దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ స్కీమ్‌ను ప్రారంభించారు. ఈ స్కీమ్ ప్రజల్లో ఎంతో ఆదరణ లభించింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో స్కీమ్ పరిధిలో వైద్యం సేవలు అందించేవారు. తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం కూడా ఈ పథకాన్ని కొనసాగించింది.

ఈ పథకంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. వైద్యానికి ప్రభుత్వం భరించే ఖర్చు రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచింది. ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఆరోగ్యశ్రీలో కొన్ని మార్పులు చేయనుంది. అయితే ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం పథకం కింద ఒక్కో కుటుంబానికి ఉచిత సేవలను రూ. 10 లక్షలకు పెంచారు. తాజాగా పేదలందరికీ ఉచిత హెల్త్ కార్డులు ఇవ్వనున్నట్లు రేవంత్ రెడ్డి తాజాగా ప్రకటించారు. మరోవైపు ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా డిజిటల్ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద ప్రస్తుతం దాదాపు 90.1 లక్షల కుటుంబాల లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో భాగంగా దాదాపు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుంచి దాదాపు 18 లక్షల మంది లబ్ధి పొందినట్లు సమాచారం. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి నాలుగు కోట్ల మందికి డిజిటల్ హెల్త్ కార్డులని హామీ ఇచ్చారు.


Next Story

Most Viewed