CM Revanth Reddy: ‘హెచ్‌సీయూ భూముల వ్యవహారంపై ఏం చేద్దాం?’ మంత్రులతో రేవంత్ రెడ్డి సమీక్ష

by Prasad Jukanti |
CM Revanth Reddy: ‘హెచ్‌సీయూ భూముల వ్యవహారంపై ఏం చేద్దాం?’  మంత్రులతో రేవంత్ రెడ్డి సమీక్ష
X

దిశ, డైనమిక్ బ్యూరో/శేరిలింగంపల్లి : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) సమీపంలోని కంచ గచ్చిబౌలి (Kancha Gachibowli) భూములపై విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక సమీక్ష (CM Revanth Reddy Review) నిర్వహించారు. ఇవాళ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో (Command Control Centre) మంత్రులతో భేటీ అయి హెచ్‌సీయూ భూముల వ్యవహారంపై చర్చించారు. విద్యార్థుల ఆందోళనకు రాజకీయ పార్టీల మద్దతుతో ఎలా ముందుకు వెళ్దామనే విషయాన్ని మంత్రులతో సీఎం డిస్కస్ చేసినట్టు తెలుస్తోంది. 400 ఎకరాల భూములపై సర్వహక్కులు ప్రభుత్వానివేనంటూ 2004లోనే నాటి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రేవంత్ సర్కార్ నిన్న వెల్లడించింది. వర్సిటీ, ప్రభుత్వం మధ్య పరస్పర అవసరాల కోసం భూమార్పిడి అగ్రిమెంట్ చేసుకోగా అందులో యూనివర్సిటీ అధికారులు చేసిన సంతకాలతో కూడిన పత్రాలను ప్రభుత్వం విడుదల చేసింది. అయినా టీజీఐఐసీకి అప్పగించిన భూముల విషయంలో హెచ్‌సీయూ రిజిస్ట్రార్ ప్రభుత్వానికి విరుద్ధమైన ప్రకటన చేయడం వెనుక ఏం జరుగుతోందనే అంశంపై సీఎం చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

విద్యార్థి సంఘాల ఆందోళన.. ఉద్రిక్తత..

మరోవైపు హెచ్‌సీయూలో విద్యార్థుల ఆందోళన మరింత ఉధృతంగా సాగుతోంది. భూములను వేలం వేయవద్దంటూ నిరసన తెలుపుతున్న విద్యార్థులకు ఇవాళ పలు రాజకీయ పార్టీలు మద్దతు పలకడంతో వివాదం మరింత ముదురుతోంది. యూనివర్సిటీ బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునివ్వగా వారికి మద్దతుగా బీజేవైఎం, సీపీఐ, సీపీఎం నేతలు కదలివచ్చారు. ఒక్కసారిగా భారీ సంఖ్యలో ఆయా పార్టీల నాయకులు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విద్యార్థులు మెయిన్ గేట్ వద్ద ప్లకార్డులు పట్టుకుని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గేట్ నుంచి బయటకు వచ్చేందుకు యత్నించగా, మరోవైపు నాయకులు యూనివర్సిటీలోకి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు నాయకులను అరెస్ట్ చేసి ఆయా పోలీసు స్టేషన్లకు తరలించారు. విద్యార్థులకు మద్దతుగా వచ్చిన చీకోటి ప్రవీణ్‌, బీజేపీ మహిళా మోర్చా నాయకులను అరెస్టు చేశారు. హెచ్‌సీయూ భూముల వేలానికి వ్యతిరేకంగా ఉస్మానియా యూనివర్సిటీలోనూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. కాగా హెచ్ సీయూ విద్యార్థుల ఆందోళనకు మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ మద్దతు తెలిపారు.

బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అడ్డగింత..

హెచ్‌సీయూ సందర్శనకు బయలుదేరిన బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలను అనుమతి లేదంటూ పోలీసులు అరెస్టు చేశారు. హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, పాల్ సూర్యనారాయణను అరెస్ట్ చేసి పార్టీ కార్యాలయం వద్ద వదిలిపెట్టారు. అలాగే బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డిని గృహ నిర్బంధం చేశారు.

బీఆర్ఎస్ నేతల ఇళ్ల వద్ద పోలీసులు..

హెచ్‌సీయూ ఆందోళనల నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల ఇళ్ల వద్ద ముందస్తుగా పోలీసులు మోహరించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిటెండ్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్‌రావుతో పాటు పలువురు నేతల ఇళ్ల వద్ద బలగాలను పెట్టారు.

అధికారులు, కార్మికులపై దాడి : డీసీపీ

సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంపై మాదాపూర్ డీసీపీ వినీత్ కీలక ప్రకటన చేశారు. సోషల్ మీడియా ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. పని జరుగుతుండగా హెచ్‌సీసీయూ విద్యార్థులు, ఇతరులు అక్కడికి చేరుకుని అధికారులు, కార్మికులపై కర్రలు, రాళ్లతో దాడి చేశారని చెప్పారు. టీజీఐఐసీ ఆధ్వర్యంలో కంచ గచ్చిబౌలి సర్వే నెంబర్ 25లో ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు.

హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం..

కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి వివాదంపై తాజాగా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. భూములను జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని కోరుతూ ‘వట’ ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థ తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. పిల్‌ను కోర్టు రేపు విచారణ చేపట్టనుంది.



Next Story