CM Revanth Reddy: తెలంగాణ పోటీ అమరావతితో కాదు.. జపాన్ టూర్ లో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

by Prasad Jukanti |   ( Updated:2025-04-19 07:42:58.0  )
CM Revanth Reddy: తెలంగాణ పోటీ అమరావతితో కాదు.. జపాన్ టూర్ లో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణలో పెట్టుబడులు పెరగాలి, పరిశ్రమలు పెరగాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచాలనేదే మా ప్రభుత్వ ఉద్దేశమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగంలో సాధించాల్సినంత ప్రగతి సాధించామని ఇప్పుడు పరిశ్రమలను తెచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జపాన్ పర్యటనలో (Japan Tour) ఉన్న ఆయన ఇవాళ జపాన్ తెలుగు సమాఖ్య (Japan Telugu Samakhya) ఏర్పాటు చేసిన ‘తెలుగు వెలుగు పండుగ సంబరాలు’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ పోటీ అమరావతి(Amaravati), బెంగళూరు, ముంబయి, చెన్నైతో కాదని, లండన్, టోక్యో వంటి అభివృద్ధి చెందిన నగరాలతోనేనని అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో మీ అందరి సహకారం అవసరమని, ఎవరికి చేతనైనంత వారు చేయగలిగింది చేస్తే ప్రపంచంతోనే మనం పోటీ పడొచ్చని పిలుపునిచ్చారు. తెలంగాణలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేసుకోబోతున్నామని, ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను అభివృద్ధి చేసుకుందామన్నారు.

మూసీ ప్రక్షాళనకు అడ్డుపడుతున్నరు..

టోక్యోలో అభివృద్ధి చేసిన రివర్ ఫ్రంట్ పరిశీలించామని రేవంత్‌రెడ్డి అన్నారు. నీరు, మన సంస్కృతికి, అభివృద్ధికి ప్రతీక అని అన్నారు. మూసీ నది ప్రక్షాళనకు కొంతమంది అడ్డుపడుతున్నారని విమర్శించారు. ఢిల్లీలో కాలుష్యంతో అన్ని సంస్థలకు సెలవులు ఇస్తున్న పరిస్థితి ఉన్నదని, కేవలం కాలుష్యంతో ఢిల్లీ స్థంభించే పరిస్థితి ఉంటే మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే హైదరాబాద్‌లో మూసీ ప్రక్షాళన చేయాలని తాను చెబుతున్నానని, మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్స్ తెలంగాణ పురోగతికి అత్యంత కీలకమైన అంశాలు కాబోతున్నాయన్నారు. సొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ఉన్న ఆనందం ఏమిటో మీకు తెలుసని మీ ఆలోచనలను రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోవాలని పిలుపునిచ్చారు.



Next Story

Most Viewed