CM Revanth Reddy: మీవాళ్లను మీరే ఓడగొట్టుకోకండి.. కురుమలకు సీఎం సూచన

by Prasad Jukanti |
CM Revanth Reddy: మీవాళ్లను మీరే ఓడగొట్టుకోకండి.. కురుమలకు సీఎం సూచన
X

దిశ, గండిపేట్/డైనమిక్ బ్యూరో: కురుమలు అత్యంత నమ్మకస్తులని, ఆ సామాజిక వర్గం నుంచి వచ్చిన దొడ్డి కొమురయ్య గొప్ప పోరాట యోధుడని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కొనియాడారు. రాష్ట్రంలోని కురుమలకు జనాభా దామాషా ప్రకారం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పార్లమెంట్‌లోనూ వారి ప్రాతినిధ్యం పెంచి శాశ్వతంగా రాజకీయాల్లో అవకాశం కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. కురుమలకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తే మీరంతా కలిసి కట్టుగా గెలిపించుకోవాలని, అప్పుడే భవిష్యత్తులో మీకు అవకాశాలు దక్కుతాయన్నారు. లేకుంటే కురుమలకు చాన్స్ ఇస్తే గెలిచే అవకాశం తక్కువ అనే నెపంతో పార్టీలు టికెట్ నిరాకరించే ప్రమాదం ఉందని సూచించారు. ఇవాళ సాయంత్రం హైదరాబాద్ కోకాపేట్‌లో నిర్మించిన దొడ్డి కొమురయ్య కురుమ భవనాన్ని (inauguration of Kuruma Bhavan) సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కురుమలు అడిగిన డిమాండ్లను నెరవేస్తామన్నారు. భవిష్యత్‌లో రాజకీయ, ఆర్థిక, సంక్షేమ పథకాల్లో మీ కోటా మీకు ఇస్తామని హామీ ఇచ్చారు. దొడ్డి కొమురయ్య (Doddi Komuraiah) పేరు ఈ సమాజంలో శాశ్వతంగా గుర్తిండిపోయేలా ఓ కార్యక్రమానికి ఆయన పేరు పెడతామని చెప్పుకొచ్చారు.

98 శాతం కులగణన పూర్తి

రాబోయే జనగణనలో కులగణన చేర్చాలనే డిమాండ్‌తో దేశానికే ఆదర్శంగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం కులగణన (kula gananaa) చేపట్టిందని సీఎం చెప్పారు. దాదాపు 98శాతం కులగణన సర్వే పూర్తయిందని తెలిపారు. మిగిలిన 2 శాతం సర్వే పూర్తి చేస్తే తెలంగాణ సమాజానికి సంబంధించిన మెగా హెల్త్ చెకప్ పూర్తవుతుందని చెప్పారు. ఈ గణాంకాల ఆధారంగా కురుమలకు ప్రయోజనం దక్కబోతుందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కురుమ, యాదవులకు చెరో రెండు టికెట్లు ఇచ్చాం.. సరిత స్వల్ప మెజార్టీతో ఓడిపోయారని గుర్తుచేశారు. ఆమె గెలిచి ఉంటే బాగుండేదని, మీ సామాజిక వర్గం వారిని మీరే ఓడగొట్టుకోవద్దని సూచించారు.

రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావాలి

దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో ఇవాళ కురుమ భవనం నిర్మించుకున్నామని సీఎం రేవంత్ అన్నారు. ఈ కురుమ భవనం విద్యకు వేదిక కావాలని ఆకాంక్షించారు. కురుమలు తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి విద్యార్థుల డైట్ చార్జీలు పెంచేందుకు మనస్సు రాలేదని విమర్శించారు. కానీ ప్రజా ప్రభుత్వం రాగానే డైట్ చార్జీలు, కాస్మొటిక్ చార్జీలు పెంచామన్నారు. తమ ప్రభుత్వం బలహీన వర్గాల, బహుజనుల ప్రభుత్వం అని పేర్కొన్నారు. జమీందార్ల తల్లి కాకుండా బహుజనుల తెలంగాణ తల్లి ఉండాలని ఆ విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని (Statue of Telangana Mother) ప్రతిష్టించుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story