పార్లమెంట్ సెగ్మెంట్లలో పోటీ తగ్గించే వ్యూహం.. ఇబ్బందులు లేకుండా రేవంత్ ప్లాన్

by GSrikanth |
పార్లమెంట్ సెగ్మెంట్లలో పోటీ తగ్గించే వ్యూహం.. ఇబ్బందులు లేకుండా రేవంత్ ప్లాన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్లో టికెట్ కోసం ఆశావహుల మధ్య పోటీ తీవ్రంగా ఉన్నది. పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్‌రెడ్డి తనదైన శైలిలో అసంతృప్తిని చల్లార్చుతున్నారు. రాష్ట్రంలో 14కు పైగా సీట్లను గెలవాలని టార్గెట్‌గా పెట్టుకున్న రేవంత్‌రెడ్డి.. సమర్థులైన, గెలిచే అవకాశం ఉన్నవారిని ఎంపిక చేయడంపై దృష్టి పెట్టారు. కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో లోక్‌సభ ఎన్నికల్లోనూ గెలుపు తథ్యమని భావిస్తున్న సీనియర్ లీడర్లు ఎంపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ పోటీ తీవ్రంగా ఉండడంతో ఫిల్టర్ చేయడం, మిగిలినవారిని కన్విన్స్ చేయడం, ఇతర పదవుల్లో సరిపెట్టడం తప్పనిసరిగా మారింది. వరంగల్ స్థానం కోసం పట్టుబడుతున్న మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు ఇటీవల స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ పోస్టును ఇచ్చి కూల్ చేశారు. మహబూబ్‌నగర్‌లో వంశీచంద్ రెడ్డి పేరును ఖరారు చేయగా.. ఆ స్థానంలో టికెట్ ఆశిస్తున్న చిన్నారెడ్డిని స్టేట్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పోస్టుతో సంతృప్తిపర్చారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ చాన్స్ ఇవ్వకపోవటంతో కేబినెట్ మినిస్టర్ ర్యాంకుతో సమాన పదవిని చిన్నారెడ్డికి కేటాయించారు.

మరికొన్ని స్థానాల్లోనూ హెవీ కాంపిటీషన్ ఉన్నది. ఖమ్మం స్థానంలో టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న రేణుకా చౌదరి అవకాశం లేని కారణంగా రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇచ్చింది. సికింద్రాబాద్ సెగ్మెంట్‌లో టికెట్ ఆశించిన అనిల్ కుమార్ యాదవ్‌ను సైతం రాజ్యసభకు పంపారు. ఇలాంటి తరహా స్థానాలు మరికొన్ని ఉండగా.. వారికి కూడా కీలక నామినేటెడ్ పోస్టులతో రేవంత్ సంతృప్తిపర్చనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించే సమయానికి కనీసంగా పది నామినేటెడ్ పోస్టులపై ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడే అవకాశమున్నది. నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోనూ పార్టీ నిర్ణయాలను అంచనా వేసిన ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహరిస్తున్న మల్లు రవి ఇటీవలే ఆ పదవికి రాజీనామా చేశారు. ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం ఆల్రెడీ ఒక పోస్టులో ఉన్నవారికి టికెట్ ఉండదనే నిబంధనతో ఆ పదవికి రాజీనామా చేశారు. ఈ స్థానంలో టికెట్ తనకు రావాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ స్థానంలో పార్టీ ఇప్పటికే ఒక అంచనాకు వచ్చిన అభ్యర్థికి, మల్లు రవికి మధ్య ఇప్పుడు పోటీ నెలకొన్నది.

సీనియర్ల మధ్య తీవ్ర పోటీతో..

రాష్ట్రంలో ఎవరికి టికెట్ ఇవ్వాలనేది ఏఐసీసీ స్థాయిలో దాదాపుగా ఒక నిర్ణయం జరిగింది. కొన్నింటిలో సీనియర్ లీడర్ల మధ్య తీవ్ర పోటీ ఉన్నందున ఖరారు చేయడం సంక్లిష్టంగా మారింది. నల్లగొండ, భువనగిరి, మల్కాజిగిరి, చేవెళ్ల, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్.. ఇలా పలు స్థానాల్లో సీనియర్ నేతల మధ్య ముమ్మర పోటీ ఉన్నది. మార్చి మొదటివారం తర్వాత షెడ్యూలు వస్తుందనే సంకేతాలు వెలువడడంతో ఈసారి నోటిఫికేషన్ వెలువడేకంటే ముందే అభ్యర్థుల జాబితాను ఏఐసీసీ రిలీజ్ చేయాలనుకుంటున్నది. కచ్చితంగా గెలిచే అభ్యర్థులకే రేవంత్ మొగ్గు చూపే అవకాశం ఉంది. ఆ దిశగానే ఆయన అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed