గద్దర్‌పై బండి సంజయ్‌ ఘాటు వ్యాఖ్యలు.. CM రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన

by Gantepaka Srikanth |
గద్దర్‌పై బండి సంజయ్‌ ఘాటు వ్యాఖ్యలు.. CM రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం ప్రజాయుద్ధ నౌక గద్దర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా CM రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గద్దర్‌ను అవమానిస్తే తగిన శాస్తి చేస్తామని హెచ్చరించారు. బీజేపీ ఆఫీస్ అడ్రస్‌లో గద్దర్ పేరు ఉండేలా చేస్తామని కీలక ప్రకటన చేశారు. మరోసారి ఎక్కడైనా గద్దర్‌ను తక్కువచేసి మాట్లాడితే ఊరుకునేదే లేదని వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ(BJP) రాష్ట్ర కార్యాలయం ఉన్న ఏరియాకు గద్దర్ పేరు పెట్టడానికి ప్రభుత్వం వెనుకాడదని అన్నారు. బీఆర్ఎస్(BRS) హయాంలో కూడా గద్దర్‌‌ను గేటు బయట కూర్చోబెట్టి అవమానించారు.. వాళ్లకు ఎలాంటి గతి పట్టిందో బీజేపీ నేతలకు అంతకు రెట్టింపు గతి పడుతుందని అన్నారు. గద్దర్ పేరును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినా పద్మ అవార్డు ఇవ్వలేదని మండిపడ్డారు. అందుకే నంది అవార్డులకు గద్దర్(Gaddar) పేరు పెట్టుకున్నామని.. గద్దర్ పేరిట అవార్డు ఇవ్వడమంటే ప్రతీ ఏటా ఆయన్ను స్మరించుకోవడమే అని తెలిపారు.

గద్దర్ ఈ సమాజానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు. గద్దర్ మృతిచెందినప్పుడు గత ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూసిందని అన్నారు. ఆయన మృతదేహాన్ని ఎల్బీ స్టేడియంలోకి కూడా తీసుకెళ్లనివ్వలేదని తెలిపారు. రాష్ట్రం కోసం సర్వం త్యాగం చేసిన గద్దర్‌కు ఘన నివాళి అర్పించేందుకు కూడా పోరాటం చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఆయన సిద్ధాంతం స్ఫూర్తి దాయకం అని అన్నారు. గద్దర్‌తో ఎవరు విభేదించినా.. ఆయన సిద్ధాంతం గొప్పదని తెలిపారు. రాష్ట్రాల కలయికే కేంద్రమని ఢిల్లీ పెద్దలు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఇకనైనా చేసిన తప్పులను కేంద్ర ప్రభుత్వం సరిదిద్దుకొని.. మళ్లీ ఇలాంటి పొరపాట్లు జరుగకుండా చూసుకుంటుందని భావిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed